ఇండస్ట్రీలో పాపం, ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన మామూలుగా వుండదు. నిజానికి ప్రభాస్ మాంచి ఫ్యాన్ బేస్ వుంది. కానీ ఏం జరుగుతోందో తెలియదు. ఏ సినిమా ఎన్ని భాగాలో తెలియదు. ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. అసలు ఏ సినిమాలు ఏ షూట్ జరుగుతున్నాయో తెలియదు. మిగిలిన హీరోల సంగతి అలా కాదు, పీఆర్ టీమ్ నుంచి ఏదో ఒక అప్ డేట్ ఏదో విధంగా వస్తుంటుంది. ఫలానా టైమ్ కు ఫలానా సినిమా కాస్త అటు ఇటుగా అయినా అన్న క్లారిటీ వుంటుంది. .
కానీ ప్రభాస్ సినిమాలు మాత్రం అలా కాదు. ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమా అసలు అనౌన్స్ మెంట్ జరగకుండానే షూట్ జరిగిపోతూ వుంటుంది. సినిమా విడుదల రెండు మూడు నెలల్లోకి వచ్చేసినా ప్రచారం అన్నది కిలో మీటర్ దూరంలో కూడా కనిపించదు. చకచకా సినిమాల డేట్ లు వచ్చేస్తున్నా, తాము ఇచ్చిన డేట్ కు కట్టుబడే వున్నామనే భరోసా వుండదు.
ఉగాది లాంటి కీలకమైన పండుగకు డజన్ల కొద్దీ పోస్టర్లు, శుభాకాంక్షలు వెల్లువెత్తినా ప్రభాస్ సినిమా నుంచి చిన్న ఎ 4 షీట్ కూడా వుండదు. అసలు ఆదిపురుష్ ఏ స్టేజ్ లో వుంది. సలార్ ఏ స్టేజ్ లో వుంది అన్నది పొరపాటున కూడా బయటకు రానివ్వరు. పొరపాటున వస్తే ఎలా వచ్చింది అని కిందా మీదా అయిపోయి, మరింత కట్టుదిట్టంగా అన్ని దారులు మూసేస్తారు. ప్రభాస్ భాగస్వామలు, సన్నిహితులు అయిన యువి సినిమాలే ఇలా వుండేవి అనుకుంటే ఇప్పుడు అదే తీరు మిగిలిన సినిమాలు అన్నింటికీ వుంది. అంటే ఏమని అర్థం చేసుకోవాలి?
రెండేళ్ల క్రితం ప్రభాస్ మాత్రమే మనకు పాన్ ఇండియా హీరో కావచ్చు. వంద కోట్ల హీరో కావచ్చు. కానీ ఇప్పుడు బన్నీ, చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, నాని ఇలా అందరూ పాన్ ఇండియాకు పరిచయం అయిపోయిన వారే. ఆ దిశగా వెళ్తున్న వారే. అంటే కాంపిటీషన్ ఏ రేంజ్ లో పెరుగుతోందో చూసుకోవాలి. పైగా వీరంత ప్రభాస్ కన్నా వయసులో చాలా చిన్న. అందువల్ల ప్రభాస్ ఇక స్పీడ్ అందుకోవాలి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమా ఇవన్నీ కేవలం ఒక్క 12 నెలల గ్యాప్ లో విడుదల చేయాల్సి వుంది. ఇది సరైన ప్లానింగేనా? అన్నది కూడా చూడాలి.
ప్రభాస్ కు హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. కానీ వాళ్లు మిగిలిన హీరో ఫ్యాన్స్ చేత ట్రోల్ చేయించుకోకుండా వుండగలగాలి. మిగిలిన హీరోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటే ప్రభాస్ నుంచి ఏ చప్పుడు లేకుండా వుంటే ఫ్యాన్స్ మనోభావాలు ఎలా వుంటాయి అన్నది ప్రభాస్ తో సినిమాలు తీసే వారంతా ఆలోచించాల్సి వుంది.