స్వడబ్బా..పర డబ్బా..పరస్పర డబ్బా

టాలీవుడ్ జనాలు ఫిక్స్ అయిపోయారంట. మన డబ్బా ఎవ్వరూ వాయించనక్కర్లా..మనకు మనమే వాయంచుకుందాం అని. ఈ వెబ్ సైట్ల, దినపత్రికలు ఇచ్చే రేటింగ్ ఎలా వుండనీ? ఎవరికి కావాలి? మనం అంతా కలిసి ఒకరి…

టాలీవుడ్ జనాలు ఫిక్స్ అయిపోయారంట. మన డబ్బా ఎవ్వరూ వాయించనక్కర్లా..మనకు మనమే వాయంచుకుందాం అని. ఈ వెబ్ సైట్ల, దినపత్రికలు ఇచ్చే రేటింగ్ ఎలా వుండనీ? ఎవరికి కావాలి? మనం అంతా కలిసి ఒకరి భుజాలు మరొకరు నొక్కుకుంటే పోయే కదా? మనకు వున్న లక్షలాది ఫాలోవర్లు అదే ఫాలో అవుతారు. అదే నమ్ముతారు. అది చాలు కదా అన్నది టాలీవుడ్ జనాల లేటెస్ట్ స్ట్రాటజీ అంట. 

చిరకాలంగా వెబ్ సైట్ లు, దినపత్రికల సమీక్షలతో తలనోప్పిగా వుంది టాలీవుడ్ కు. పైగా ఇటీవల దినపత్రికలు కొన్ని మరీ కఠినంగా సమీక్షలు ఇస్తున్నాయి. దినపత్రికలకు కూడా వెబ్ సైట్ వుండడంతో, జెన్యూన్ గా సమీక్షలు ఇస్తే జనం ఆదరిస్తారని గమనించాయి. అందుకే డబ్బా సమీక్షలు కాకుండా, నికార్సయిన సమీక్షలు అందించడం ప్రారంభించాయి. ఇక వెబ్ సైట్ల సంగతి సరేసరి, 

ఏది సరైన సమీక్ష, ఏది కాదు అనే జ్ఞానం పాఠకులకు పూర్తిగా వచ్చేసిందని అర్థం చేసుకున్న వెబ్ సైట్లు అన్నీ నిర్మొహమాటంగా సమీక్షలు ఇస్తున్నాయి. సినిమా రంగంతో అంతో ఇంతో మొహమాటం వున్న వెబ్ సైట్ లు కూడా ఇదే దారి పట్టాయి. ఈ తరహా వైఖరి టాలీవుడ్ జనాలకు మింగుడు పడడం లేదు. అందుకే తమ స్వంత ప్రచారం చేసుకుంటే బెటర్ కదా అని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

ఇన్ స్టాలో, ట్విట్టర్ లో తమ ఫాలో వర్లు లక్షల్లో వున్నారు. వీరిలో పదిశాతం మంది తమ ప్రచారం నమ్మినా సినిమాకు సరిపోతుంది కదా? నలుగురు కలిసి మేకను సైతం కుక్క పిల్లను చేసినపుడు, నలభై మంది కలిసి కుక్క పిల్లను మేకపిల్లను చేయలేరా? సో అదే కార్యక్రమం స్టార్ట్ చేసారన్నమాట. మీ సినిమా వచ్చినపుడు నేను వేస్తా..నా సినిమా వస్తే మీరు వేయండి అనే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ అన్నమాట. 

దాన్నే ఇంకోలా చెప్పాలంటే నీ భుజం నేను నొక్కుతా..నా భుజం నువ్వు నొక్కు అనే పద్దతి అన్నమాట. నిజానికి ఈ పద్దతి సక్సెస్ అయితే నిర్మాతలకు పబ్లిసిటీ ఖర్చు కోట్లు మిగిలిపోతుంది.  కానీ అసలు గమ్మత్తు ఏమిటంటే థియేటర్లు ఓపెన్ అయ్యే వరకే ఇలాంటి ప్రచారం పని చేస్తుంది.

జనాలు థియేటర్ దగ్గర పెదవి విరిచారు అంటే వెబ్ సైట్లు, పత్రికలు, టాలీవుడ్ జనాలు అందరూ కలిసి కట్టుగా టముకు వేసి, భాజ భజంత్రీలు వాయించినా జనం థియేటర్ కు రారు. గతంలో ఇలాంటి అనుభవాలు చాలా వున్నాయి.

ఇంకా ఇక్కడ చెప్పాల్సిన ట్విస్ట్ ఏమిటంటే, ఇలా డబ్బాలు కొడుతున్న పెద్దోళ్లు చాలా మంది ఆఫ్ ది రికార్డుగా తమ డబ్బా వ్యవహారాలకు నెగిటివ్ గా మాట్లాడడం, తమ తమ ఆబ్లిగేషన్లు బయట పెట్టడం. టాలీవుడ్ అంటేనే ఇలాంటి హిపోక్రసీ వ్యవహారాలకు పెట్టింది పేరుకదా?

కరోనా తగ్గకపోయినా.. నిమ్మగడ్డ తగ్గట్లేదు