కాపుల‌కు ప‌వ‌న్ బ‌ల‌మా? బ‌ల‌హీన‌తా?

న‌మ్మితేనే మోస‌పోతార‌ని పెద్ద‌లు చెబుతారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో ఇదే నిజ‌మ‌వుతోంద‌నే ఆందోళ‌న‌, అనుమానం కాపు సామాజిక వ‌ర్గంలో బ‌లంగా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీసీల త‌ర్వాత అత్య‌ధికులు కాపులే. అయిన‌ప్ప‌టికీ రాజ్యాధికారాన్ని ద‌క్కించుకోలేకున్నారు. ఈ…

న‌మ్మితేనే మోస‌పోతార‌ని పెద్ద‌లు చెబుతారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో ఇదే నిజ‌మ‌వుతోంద‌నే ఆందోళ‌న‌, అనుమానం కాపు సామాజిక వ‌ర్గంలో బ‌లంగా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీసీల త‌ర్వాత అత్య‌ధికులు కాపులే. అయిన‌ప్ప‌టికీ రాజ్యాధికారాన్ని ద‌క్కించుకోలేకున్నారు. ఈ ఆవేద‌న వాళ్ల‌లో గాఢంగా ఉంది. దీనికి ప్ర‌ధానంగా ఆ సామాజిక వ‌ర్గంలో నాయ‌క‌త్వ స‌మ‌స్యే కార‌ణం.

వంగ‌వీటి రంగా త‌ర్వాత అంత‌టి నాయ‌కుడు రాలేదు. ఉన్న వాళ్లు త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌జారాజ్యం రూపంలో మెగాస్టార్ చిరంజీవి వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఈ రాజ‌కీయాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న సోద‌రుడు జ‌న‌సేన రూపంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌చ్చారు. ప‌వ‌న్ రాజ‌కీయాలేంటో ఆయ‌న‌కే అర్థ‌మ‌వుతున్న‌ట్టు లేదు. 2014లో పార్టీని స్థాపించి, పోటీ చేయ‌కుండా కాపుల ఆత్మ‌గౌర‌వాన్ని టీడీపీ-బీజేపీ కూట‌మికి తాక‌ట్టు పెట్టార‌నే ఆవేద‌న ఆ సామాజిక వ‌ర్గంలో బ‌లీయంగా ఉంది. 2019లో వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి స‌త్తా చూప‌లేక‌పోయారు.

ఓట‌మి, అవ‌మానాలు, ఛీత్కారాల నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ గుణ‌ఫాఠాలు నేర్వ‌లేదు. స‌హ‌జంగా ఓట‌మి ఆయ‌న్ని రాజ‌కీయంగా రాటుదేల్చాల్సింది. ప‌వ‌న్ విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. ఎందుకంటే రాజ‌కీయంగా ఆయ‌న సంక‌ల్పం అంత బ‌లంగా లేద‌నేం దుకు… ప‌వ‌న్ కార్య‌క్ర‌మాలే నిద‌ర్శ‌నం.  అదేంటో గానీ, చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల కోస‌మే తాను ఉన్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇదే ఆయ‌న్ను రాజ‌కీయంగా భారీ దెబ్బ‌తీసింది. అయిన‌ప్ప‌టికీ మ‌నిషి ఆలోచ‌న‌ల్లో మార్పు రాలేదు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నా… చంద్ర‌బాబు మాత్రం క‌న్నుగీటుతూనే ఉన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైపు నుంచి సానుకూల సంకేతాలు రాక‌పోతే చంద్ర‌బాబు ఎందుకంత బ‌హిరంగంగా పొత్తుపై మాట్లాడ్తార‌నే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

తాజాగా జ‌న‌సేనానిపై త‌న రాజ‌కీయ ప్రేమ‌ను చంద్ర‌బాబు బ‌హిరంగంగానే వ్య‌క్త‌ప‌రిచారు. బాబు మాయ‌మాట‌ల‌పై జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం బీజేపీ ఘాటుగా స్పందించింది. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైపు నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. మౌనం అర్ధ అంగీకార మ‌ని భావించాలా? అనే ప్ర‌శ్న‌లు తెరపైకి వ‌స్తున్నాయి. చంద్ర‌బాబుతో ప‌వ‌న్ జ‌త క‌ట్ట‌డం వ‌ల్ల క‌మ్మ సామాజిక వ‌ర్గానికే త‌ప్ప త‌మ‌కేంటి? అనే ప్ర‌శ్న‌లు కాపుల నుంచి వ‌స్తున్నాయి.

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రేమాట‌లో తామెందుకు పావులు కావాల‌నే ఆవేద‌న కాపుల్లో ఉంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాంటి వాళ్ల‌ను న‌మ్ముకుంటే ఈ జ‌న్మ‌లో రాజ్యాధికారానికి చేరువ కాలేమ‌నే అభిప్రాయానికి కాపులు వ‌చ్చారు. రాజ్యాధికారం ప‌క్క‌న పెడితే, ఇప్పుడు త‌మ సామాజిక వ‌ర్గం ప్ర‌యోజ‌నాల కోసం పోరాడే చ‌రిష్మా ఉన్న నాయ‌కుడు కావాల‌ని కాపులు కోరుకుంటున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం లాంటి నీతి, నిజాయ‌తీ ఉన్న యువ నాయ‌కులు కాపు సామాజిక వ‌ర్గం నుంచి రావాల‌ని పిలుపు నిస్తున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లో కూడా న‌టించే కాపు నాయ‌కులు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని వారు అంటు న్నారు.

త‌మ నాయ‌క‌త్వం ఎద‌గ‌కుండా భౌతికంగా క‌నుమ‌రుగు చేసిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తామెందుకు ప‌వ‌న్ వెంట న‌డ‌వాల‌నే తిరుగుబాటు ఆలోచ‌న‌లు ఆ సామాజిక వ‌ర్గం నుంచి వ‌స్తున్నాయి. త‌న రాజ‌కీయ పంథా, ఎజెండాపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహన లేని ప‌వ‌న్‌ను న‌మ్ముకుంటే…కుక్క తోక ప‌ట్టుకుని గోదారిని ఈదాల‌ని అనుకున్న‌ట్టుగా ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం. అస‌లు ప‌వ‌న్ అనే నాయ‌కుడు కాపుల‌కు బ‌ల‌మా? బ‌ల‌హీన‌తా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. కేవ‌లం కాపుల మ‌ద్ద‌తును పొందేందుకే ప‌వ‌న్‌పై చంద్ర‌బాబు దొంగ ప్రేమ చూపుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఈ నేప‌థ్యంలో తెలిసి తెలిసి ప‌వ‌న్ మాట‌లు న‌మ్మి, మ‌రోసారి చంద్ర‌బాబును నెత్తినెక్కించుకోవ‌డ‌మా? అని కాపులు సందిగ్ధంలో ప‌డ్డారు.