వచ్చే రెండు నెలల్లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ చిన్నవి. అన్నిటికంటె పెద్దది, ముఖ్యమైన ఐన యుపిలో మెజారిటీ తగ్గవచ్చేమో కానీ బిజెపి తిరిగి వచ్చేట్లు కనబడుతోంది. దాని తర్వాత ముఖ్యమైనది 117 స్థానాల పంజాబ్. ప్రస్తుతం కాంగ్రెసు అధికారంలో వుంది కానీ తిరిగి నెగ్గుతుందన్న గ్యారంటీ లేదు. చతుర్ముఖ పోటీలో దాని స్థానంలో ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ది ఒక ప్రధాన పాత్ర. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా వుండి, కాంగ్రెసు చేత తృణీకరించబడి, కోపంతో విడిగా వచ్చి నవంబరు 2న పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేర (పిఎల్సి) వేరే పార్టీ పెట్టుకున్నాడు. సాగు చట్టాలు రద్దు చేస్తే బిజెపితో పొత్తు కలుపుతానని అప్పుడే ప్రకటించాడు. అది జరగడంతో సుఖ్‌దేవ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త), బిజెపిలతో కలిసి కూటమి ఏర్పాటు చేశాడు.
కెప్టెన్‌కు మొన్నటిదాకా కాంగ్రెసులో భక్తులున్నారు. అతనికి వ్యతిరేకంగా వున్న సిద్దూని రాహుల్, ప్రియాంక కలిసి ఎగదోసి, సంఖ్యాబలం ఉన్న కెప్టెన్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టారు. తీరా సిద్దూని సిఎంగా చేయడానికి అధిష్టానం భయపడింది. కులాల లెక్కలు వేసి దళితుడైన చరణ్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా చేశారు. పంజాబ్ జనాభాలో 32% మంది దళితులే కానీ యిప్పటిదాకా దళిత మంత్రులున్నారు తప్ప ముఖ్యమంత్రి ఎవరూ లేరు. అకాలీ దళ్ నుంచి శిఖ్కులే వుంటారు. కాంగ్రెసు నుంచి కూడా అగ్రవర్ణ శిఖ్కులే వుంటూ వచ్చారు. చన్నీ కూడా శిఖ్కే కానీ దళిత శిఖ్కు. మంత్రిగా సామర్థ్యం చూపించాడు. ముఖ్యమంత్రి అయ్యాక వివాదాల జోలికి పోకుండా పాలన సాగిస్తున్నాడు. అనేక సంక్షేమ పథకాలు చేపట్టి పాప్యులారిటీ పెంచుకోవడానికి యాడ్స్ గుప్పిస్తున్నాడు.
అతన్ని సిఎంగా చేసినా, ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించడానికి కాంగ్రెసు సిద్ధంగా లేదు. అలా ప్రకటించిన మరుక్షణం సిద్దూ తిరుగుబాటు చేస్తాడనే భయం వుంది. అలాగని సిద్దూ పేరు ప్రకటించడానికీ కాంగ్రెసు తయారుగా లేదు. ఎంత మంచి వక్త అయినా, సిద్దూకి నిలకడ లేదనే చెడ్డపేరుంది. మంత్రిగా అతను ఊడపొడిచింది ఏమీ లేదు. పైగా చన్నీ గద్దె మీద కూర్చున్న నిమిషం నుంచి అతన్ని వేపుకుని తింటూ తన చేతిలో కీలుబొమ్మ అని చూపించడానికి చేయని ప్రయత్నం లేదు. అయినా చన్నీ తల వంచుకుని పోవడంతో కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే అని అందరూ అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో దళితులు అతన్ని చూసి కాంగ్రెసుకు ఓటేస్తారా అన్నది పెద్ద సందేహం. మొన్నటిదాకా కాంగ్రెసంటే కెప్టెనే అనుకుంటూ వచ్చారు కాబట్టి, కెప్టెన్ విడిగా వెళ్లిపోయాడు కాబట్టి కాంగ్రెసు నాయకులు చాలామంది అతనితో పాటు వెళ్లిపోతారనుకున్నారు కానీ అలా జరగటం లేదు. ఎన్నికలు ప్రకటించి, టిక్కెట్ల పంపిణీ మొదలుపెట్టాక అప్పుడు మారతారేమో తెలియదు. ఈలోగా కెప్టెన్ చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనబడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపితో పొత్తు పెట్టుకున్న బాబు, ఆ పార్టీలో కూడా తన మనుషులే వుండేట్లు చూసి, రాష్ట్రంలో దాన్ని ఎదగనీయకుండా చేశారు. వెంకయ్యనాయుడు బిజెపి దేశాధ్యక్షుడిగా వున్న రోజుల్లో కూడా ఆయన బాబుకు ప్రణాళికకు అనుగుణంగా నడుచుకుంటూ సొంత రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అడ్డుపడ్డారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో స్థానిక నాయకుల కారణంగా పార్టీ నిలదొక్కుకుంది తప్ప ఆంధ్ర ప్రాంతంలో అదీ లేదు. 2014లో రాష్ట్రవిభజన తప్పదని నిశ్చయం కాగానే బాబు అప్పటికి మోదీపై దేశప్రజలకున్న మోజును గుర్తించి, బిజెపితో పొత్తు పెట్టుకోవాలనుకుని నిశ్చయించుకున్నారు. ఆంధ్ర ప్రజల అభీష్టానికి, ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెసు విభజించింది కాబట్టి, దానికి ఆంధ్రలో పుట్టగతులుండవని తెలుసుకున్న కాంగ్రెసు నాయకులు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేద్దామనుకున్నారు.
ఆంధ్రలో ఉన్న ప్రత్యామ్నాయాలు టిడిపి, వైసిపి. జగనంటే పడనివాళ్లు టిడిపి వైపు వద్దామనుకున్నారు. కానీ వారిలో కొంతమందిని బాబు బిజెపి వైపు మళ్లించారు. ఎందుకంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు బిజెపికి ఎలాగూ యివ్వాలి. ఆ కోటాలో తన వాళ్లకు యిప్పిస్తే, పేరుకి బిజెపియే కానీ, తను చెప్పినట్లుగానే నడుచుకుంటారు. ఈ స్ట్రాటజీ బాగా వర్కవుట్ అయింది. ఆంధ్ర బిజెపి, టిడిపికి తోకలాగానే తయారైంది తప్ప, దానితో ఎన్నడూ విభేదించినది లేదు. అందుకే అది యిప్పటికీ వైసిపి వ్యతిరేక ఓటును పొందలేక 1-2% ఓట్ల దగ్గరే ఆగిపోతోంది.
దేశంలో మోదీ ప్రభ అంత వెలిగిపోతున్నా, పొరుగున ఉన్న కర్ణాటకలో బిజెపి అధికారంలో వున్నా, ఒడిశాలో బిజెడికి దీటైన ప్రతిపక్షంగా వున్నా, తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలుచుకుని, ఉపయెన్నికలలో గెలుస్తూ అసెంబ్లీలో బలం పెంచుకుంటూన్నా, ద్రవిడ రాజకీయాలు రాజ్యం చేసే తమిళనాడులో సైతం 4గురు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగినా ఆంధ్రలో 2% ఓట్ల దిగువనే కొట్టుమిట్టు లాడుతోంది. కన్నా లక్ష్మీనారాయణను బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా తీసేయడానికి కారణం టిడిపి మనిషిగా వ్యవహరించడమే అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు సోము వీర్రాజు వచ్చినా స్థానిక ఎన్నికలలో దాని పరిస్థితి మెరుగు పడలేదు. అదీ బాబు బిజెపిని అదుపు చేసిన ఫలితం.
ఇప్పుడు కెప్టెన్ అదే టెక్నిక్కు వాడుతున్నాడనే అనుమానాలు వచ్చాయి, అతని అనుచరులు ముగ్గురు అతని పార్టీలో చేరకుండా బిజెపిలో చేరడంతో! చెప్పాలంటే అతను కాంగ్రెసులోంచి బయటకు రాగానే పొలోమని కాంగ్రెసు ఎమ్మెల్యేలంతా అతని వెనకే వచ్చేస్తారని అనుకున్నాడేమో తెలియదు కానీ రాలేదు. ఎందుకంటే నాలుగున్నరేళ్లగా అతనే సిఎం కాబట్టి ప్రభుత్వంపై అసంతృప్తి వున్న ఓటర్లు అతన్ని వ్యతిరేకిస్తారు. పైగా అతను తెలివైన రాజకీయవేత్తే కానీ 80 ఏళ్ల వృద్ధుడు. పైగా ఫిట్‌గా కనబడడు. ఏ మేరకు తిరిగి ప్రచారం చేయగలడో తెలియదు. అటు చూస్తే సిద్దూ, చన్నీ మంచి ఫిట్‌గా వుంటారు. కెప్టెన్ విడిగా పోటీ చేసినా బాగుండేది కానీ పోయిపోయి ప్రధాన శత్రువైన బిజెపితో చేతులు కలపడం కాంగ్రెసువాదులకు నచ్చలేదు. సాగుబిల్లులను వెనక్కి తీసుకున్నా మళ్లీ పెడతారనే భయం వారిలో వుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి తోమార్ ప్రకటన ఆ భయాన్ని మరింత పెంచింది.
సాగుబిల్లులు మళ్లీ పెట్టకపోయినా, వాటికి సంబంధించిన యికా అనేక అంశాలు, ఆందోళన సమయంలో పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవడం, చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం, మద్దతు ధర.. వంటి అంశాలు యింకా పరిష్కరించ బడలేదు. పైగా ధరలు పెరగడం వంటి అనేక విషయాలపై కేంద్రంపై ఓటర్లకు వ్యతిరేకత వుంది కాబట్టి, బిజెపివైపుకి పంజాబ్ ఓటర్లు మొగ్గు చూపుతారన్న ధైర్యం కాంగ్రెసులో ఉన్న కెప్టెన్ అనుయాయులైన ఎమ్మెల్యేలకు కలగలేదు. కెప్టెన్ విడిగా పోటీ చేస్తే పాటియాలా ప్రాంతంలో కాస్త ప్రభావం చూపిస్తాడేమో కానీ, మొత్తం మీద 3-4% ఓట్ల కంటె ఎక్కువ తెచ్చుకోలేడని, అందరి అవకాశాలూ చెడగొట్టడానికి తప్ప గెలవడానికి అవి సరిపోవని వారి భయం. అతని లక్ష్యం కాంగ్రెసును దెబ్బ తీయడమే అని స్పష్టం. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి, కాంగ్రెసుకు పరోక్షంగా సాయపడతాడేమోనని అకాలీ, బిజెపి, ఆప్‌ల భయం.
అయినా బిజెపికి కెప్టెన్లో కొన్ని సుగుణాలు కనబడ్డాయి. బిజెపికి యిన్నాళ్లూ చెప్పుకోదగ్గ శిఖ్కు నాయకుడు లేడు. దాని ప్రధాన భాగస్వామి అకాలీ దళ్ గ్రామీణ ప్రాంతపు శిఖ్కులలో బలంగా వుంటూ వచ్చింది. బిజెపికి నగర ప్రాంతాల్లోని హిందువులు మద్దతు యిస్తూ వచ్చారు. వారి సంఖ్య పరిమితం కాబట్టి, 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీలో బిజెపికి 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు సాగు బిల్లుల విషయంలో అకాలీ బిజెపితో తెగతెంపులు చేసుకుంది కాబట్టి, బిజెపికి నగర హిందూ ఓటు మాత్రమే మిగిలింది. దానితో ఎన్నికలు గెలవడం అసంభవం. అయినా బింకంగా 117 సీట్లూ పోటీ చేస్తాం అని ప్రకటించాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు కెప్టెన్ వచ్చి కలవడంతో ఒక ప్రముఖుడైన శిఖ్కు నాయకుడు తోడైనట్లయింది. అకాలీ వాళ్లు తీవ్రశిఖ్కులు. కెప్టెన్‌కి అలాటి లక్షణాలు లేవు కాబట్టి హిందువులకు, ముఖ్యంగా వ్యాపారస్తులకు యిష్టుడు. పంజాబ్‌తో పాటు ఎన్నికలు జరగబోతున్న యుపి, ఉత్తరాఖండ్‌లలో శిఖ్కు ఓటర్లను ఆకర్షించడానికి కెప్టెన్‌ను అక్కడ కూడా తిప్పవచ్చు.
సిద్దూ పాకిస్తాన్ వాళ్లతో చెట్టాపట్టాలు వేసుకున్నపుడు కెప్టెన్ దేశభద్రత గురించి తను వర్రీ అవుతున్నానని పదేపదే చెప్పుకున్నాడు. పాకిస్తాన్‌కు సరిహద్దు ప్రాంతమైన పంజాబ్‌లో రక్షణ అనేది ప్రధానమైన అంశం. బిజెపి ట్రంప్ కార్డు దేశభద్రతే. దానికి కెప్టెన్ యిమేజి సహాయపడుతుంది. పంజాబ్‌పై ఆసక్తి చూపడానికి బిజెపికి యింకో కారణం కూడా వుంది. దాని పేరు ఆప్! దిల్లీ తర్వాత ఆప్ బలంగా వున్నది పంజాబ్‌లోనే. 2017 ఎన్నికలలో ఆప్ 112 స్థానాల్లో పోటీ చేసి 20టిలో గెలిచింది. 24% ఓట్లు తెచ్చుకుంది. గతంలో లోక్ ఇన్సాఫ్ పార్టీకి 6 సీట్లు వదిలింది (దానిలో 2 నెగ్గిందది) కానీ యీసారి దానితో పొత్తు తెంపుకుని, మొత్తమన్నీ తానే పోటీ చేస్తానంటోంది. ఇప్పటికే 73 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. దిల్లీలో ఆప్ పాలనలో విద్య, ఆరోగ్యం మెరుగుపడిన సంగతి పక్కనే వున్న పంజాబీలకు తెలుసు కాబట్టి, ఆప్ పట్ల మోజుండడంలో ఆశ్చర్యం లేదు.
ఇక అకాలీ దళ్‌కు వస్తే, 2017 వరకు ఉన్న అకాలీ ప్రభుత్వం అసమర్థతకు, అవినీతికి, డ్రగ్స్‌కు పేరుబడి, చాలా అప్రతిష్ఠపాలైంది. కాంగ్రెసుకు 77, ఆప్‌కు 20 సీట్లు వస్తే అకాలీ 94 సీట్లలో పోటీ చేసి 15 మాత్రమే తెచ్చుకుంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్న అకాలీ ఆప్ కంటె 1.5% ఓట్లు మాత్రమే ఎక్కువగా తెచ్చుకుంది. సాగు బిల్లులలకు పార్లమెంటులో సమర్థన తెలిపి, పంజాబ్ రైతులు తిరగబడిన తర్వాతనే బిజెపితో తెగతెంపులు చేసుకుంది. అది ఒక కుటుంబం గుప్పిట్లోనే నడుస్తోంది. ఇలాటి పరిస్థితుల్లో గెలుస్తుందని కచ్చితంగా చెప్పలేం. అయినా తన జాగ్రత్తలు తను తీసుకుంటోంది. రాష్ట్రంలో దళితుల సంఖ్య ఎక్కువ కాబట్టి బియస్పీతో ఆర్నెల్ల క్రితమే పొత్తు పెట్టుకుని 20 సీట్లు వాళ్లకు వదిలింది. 91 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. వారిలో 21 మంది కొత్తవారే!
శిఖ్కులు అకాలీని అభిమానిస్తారు కాబట్టి వాళ్ల ఓట్లు గుంజుకోవాలనే తాపత్రయంలో సిద్దూ వీరశిఖ్కుగా ప్రవర్తిస్తున్నాడు. 2015లో మతగ్రంథం అపవిత్రం చేసిన కేసు గురించి తన ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తున్నాడు. కెప్టెన్ వుండగానే కాదు, చన్నీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా! మొన్నటికి మొన్న ప్రభుత్వం ఏమీ చేయటం లేదని విమర్శలు గుప్పించడంతో ఉపముఖ్యమంత్రి వగైరాలు అభ్యంతరం తెలిపారు. సిద్దూ ఓవరాక్షన్ హిందువులకే కాదు, తటస్థ శిఖ్కులకు కూడా నచ్చటం లేదు. అంతఃకలహాలతో సతమతమవుతున్న కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమూ లేదు. ఇలాటి పరిస్థితుల్లో ఆప్‌కు అవకాశాలు పెరిగాయంటున్నారు. అసలే చతుర్ముఖ పోటీ కాబట్టి, కొన్ని సీట్లు వచ్చినా, ఎన్నికల అనంతరం ఎవరితోనైనా చేతులు కలిపి గద్దె కెక్కేయవచ్చు.
ఆప్ పేరు చెపితేనే నిలువెల్లా భగ్గుమనే బిజెపి, దానికి యింకో రాష్ట్రంలో కూడా అధికారం దక్కుతుందంటే సహించగలదా? దాని కోసం మరో తటస్థ వ్యక్తిగా పేరుబడిన కెప్టెన్‌తో చేతులు కలపడం మేలు కాదూ? అందుకే సగం సీట్లలో తాము పోటీ చేసి, తక్కినవి భాగస్వాములకు యిస్తామని లీకులు యిస్తోంది. అందువలన కెప్టెన్ విజయావకాశాలున్న అనేకమంది నాయకులు తన వెనుక ఉన్నారని చూపించుకోవలసిన అవసరం వుంది. అలాటి సమయంతో తన అనుచరులైన ముగ్గురు కాంగ్రెసు ఎమ్మెల్యేలను బిజెపిలోకి ఎందుకు పంపిస్తాడు? కెప్టెన్‌కు కాబినెట్ సహచరుడిగా వుండి, అతను పార్టీలోంచి వెళ్లిపోగానే తీసివేయబడిన రాణా గుర్మీత్ సోధీ, ఫతే జంగ్ బాజ్వా, బల్వీందర్ సింగ్ లడ్డీ, యీ ముగ్గురూ కెప్టెన్‌కు సన్నిహితులని అందరికీ తెలుసు. వాళ్లు డిసెంబరు మూడవ వారంలో బిజెపిలో చేరారు.
కెప్టెన్ ఎలాగూ తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తాడు, మనం ముందుగానే చేరి సీనియారిటీ తెచ్చుకుందామని చేరారా? అని కొందరు సందేహించారు. కెప్టెన్ సహచరుణ్ని డైరక్టుగా అడిగితే ‘‘వాళ్ల నియోజకవర్గాలు నగర ప్రాంతాల్లో వున్నాయి. అక్కడ బిజెపికి బలం ఎక్కువగా వుంది. అందుకని చేరి వుంటారు.’’ అని చెప్పాడు. ఇది అంత నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నగర, గ్రామీణ అనే తేడా లేకుండా కాంగ్రెసుకు అన్ని ప్రాంతాల్లోనూ బలం వుంది. మొన్నటివరకు కాంగ్రెసు నాయకుడిగా వున్న కెప్టెన్‌కు అక్కడా పలుకుబడి వుండి వుండాలి. బిజెపికి అంత బలమే వుండి వుంటే వీళ్లు అక్కడ నెగ్గి వుండేవారే కాదు.
అందువలన కెప్టెన్ బాబు తరహా ప్రయోగమే చేస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది. ఆంధ్రలో బిజెపి బలపడడం బాబుకి అస్సలు యిష్టం లేదు. గతంలో కాంగ్రెసుకు, యిప్పుడు వైసిపికి ఏకైక ప్రత్యామ్నాయంగా టిడిపియే ఉండాలని ఆయన ప్లాను. పంజాబ్‌లో యిప్పటికే ఓటర్లు అకాలీ, కాంగ్రెసుల మధ్య చీలి వున్నారు. కొత్తగా ఆప్ వచ్చి కొన్ని సీట్లు పట్టుకుపోతోంది. ఇక బిజెపి కూడా బలపడితే మరీ కష్టమని కెప్టెన్ భావన. 2017లో బిజెపికి 5% ఓట్లు మాత్రమే వచ్చాయి. 23టిలో పోటీ చేస్తే 3 గెలిచింది. 2019 పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసిన మూడిటిలో రెండు నెగ్గింది, 10% ఓట్లు తెచ్చుకుంది. కానీ అవి మోదీని ప్రధాని చేయడానికి ఉద్దేశించిన ఎన్నికలు. తర్వాతి రోజుల్లో సాగుబిల్లులు పెట్టడమే కాక, ఏడాది పాటు ఆందోళన చేసిన రైతుల పట్ల నిర్దయగా వ్యవహరించిన కారణంగా రైతాంగం, ముఖ్యంగా రాజకీయంగా బలంగా వున్న జాట్లు బిజెపి పట్ల ఆగ్రహంగా వున్నారు.
సాగు బిల్లుల రద్దు తర్వాత కూడా కోపం తగ్గలేదని మొన్ననే స్పష్టమైంది. మోదీ ప్రసంగించవలసిన ఫిరోజ్‌పూర్ సమావేశానికి 70 వేల మంది వచ్చేందుకు ఏర్పాట్లు చేసినా కేవలం 700 మంది మాత్రమే వచ్చారనే వార్త, ఫోటోలు వచ్చాయి. ఆ కారణంగానే మోదీ ఏదో ఒక డ్రామా ఆడి వెనక్కి వెళ్లిపోయారని చన్నీ చేసిన ఆరోపణలో అతిశయోక్తి వుండవచ్చేమో కానీ, ‘మీటింగుకి బోల్డు మంది వచ్చారు, కావాలంటే చెక్ చేసుకోండి’ అని బిజెపి క్లెయిమ్ చేయటం లేదని గమనించాలి. ఈ సందర్భంగా మనమందరం గుర్తించవలసిన దేమిటంటే బాధ్యులెవరైనా సరే, దేశప్రధాని భద్రత విషయంలో లోపం జరిగింది. అదే సమయంలో మోదీ అనవసరంగా రిస్కు తీసుకున్నారనీ ఒప్పుకోవాలి. హెలికాప్టర్లో దిగడానికి లేనప్పుడు, టూరు కాన్సిల్ చేసుకుంటే పోయె, రెండున్నర గంటల రోడ్డు ప్రయాణం పెట్టుకోవడం దేనికి? అదీ సరిహద్దు ప్రాంతమైన హుస్సేన్‌వాలాలో!
ఏదైనా దుర్ఘటన జరిగితే రాష్ట్రప్రభుత్వం హస్తం వుందా లేదా అనేది విచారణలో తేలినా ప్రయోజనం వుంటుందా? మాజీ ప్రధానిగా వున్న రాజీవ్ హత్య జరిగినప్పుడు అప్పటి తమిళనాడు ప్రభుత్వం వైఫల్యాలు విచారణలో తేలాయి. కానీ రాజీవ్ ప్రాణమైతే తిరిగి రాలేదు కదా! ప్రధానిపై దాడి జరిగితే అది ఒక వ్యక్తిపై దాడి కాదు, 140 కోట్ల భారతీయుల ప్రతిష్ఠపై దాడి. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రధాని భద్రతను కాపాడడానికి నిర్వహిస్తున్న ఎస్పిజి, ఇంటెలిజెన్సు వగైరా సంస్థల అసమర్థతకు చిహ్నం. నేషనల్ సెక్యూరిటీ ఎడ్వయిజర్ కూడా బాధ్యుడే. వాయుమార్గం కుదరనప్పుడు రోడ్డు మార్గం గురించి రాష్ట్రప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తాము తృప్తి పడితేనే వాళ్లు క్లియరెన్స్ యివ్వాలి. రాష్ట్ర డిజిపి రాలేదు వంటివి యిప్పుడు చెప్తున్నారు, ఎందుకు రాలేదు అని సందేహించి, వెళ్లవద్దు అని ప్రధానికి సలహా యివ్వవలసిన పని వాళ్లది.
ఇప్పుడు లోపాల గురించి కమిటీలు, విచారణ జరుగుతోంది. దీని తర్వాత ప్రధాని భద్రతకు సంబంధించిన ఉన్నతాధికారులపైన చర్యలు తీసుకుంటేనే మనకు మన వ్యవస్థపై నమ్మకం కుదురుకుంటుంది. తీసుకోకపోతే యిది రాజకీయ స్టంటుగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చాయంటే చాలు, మోదీపై హత్యాప్రయత్నం వార్తలు వచ్చేస్తాయి. మాజీ ప్రధానిపై కూడా ఆరోపణలు చేసేస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ వాటి వూసే వుండదు. ఏ విచారణా వుండదు. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వంపై మచ్చ పడింది. ‘ఇదంతా కావాలని చేస్తున్నదే! దిల్లీ ట్రాఫిక్‌లో మోదీ అనేకసార్లు చిక్కుకున్నారు. పోలీసు వ్యవస్థ బిజెపి నడిపే కేంద్రం చూస్తుంది కాబట్టి యిస్యూ చేయలేదు. మొన్న వారణాశిలో మోదీ ర్యాలీకి నిరసనకారులు అడ్డు తగిలితే దారి మళ్లించారు. అక్కడున్న రాష్ట్రప్రభుత్వం బిజెపిది కాబట్టి యిస్యూ చేయలేదు. ఇప్పుడు పంజాబ్‌లో కాంగ్రెసు ప్రభుత్వం వుంది కాబట్టి యీ రగడ.’ అంటున్నాడు కాంగ్రెసు ప్రతినిథి.
ఎన్నికలు పూర్తయ్యేవరకు యీ గొడవ నడుస్తూనే వుంటుంది. ఇప్పటికే మోదీ మృత్యుముఖం నుంచి తప్పించుకున్నారని హడావుడి చేస్తూ, ప్రార్థనలు, యాగాలు మొదలెట్టారు బిజెపి కార్యకర్తలు. ఏడాది పాటు రైతులు రోడ్లమీద చలిలో పడి వుంటే చలించని, తన వద్దకు వచ్చేసరికి 20 నిమిషాలకే పెద్ద గోల చేసేస్తున్నారే అంటున్నాయి ప్రతిపక్షాలు. రైతు ఆందోళనలో అగ్రస్థానంలో ఉన్న పంజాబీ జాట్ కుటుంబాలు ప్రతిపక్షాల బాటలోనే ఆలోచిస్తాయి. కరోనా సమయంలో టెంట్లు వేసుకుని, వంటలు వండుకుంటూ, అనారోగ్యాల పాలై, కొందరు మృత్యువుపాలై ఆందోళన చేస్తే దేశద్రోహులని, ఖలిస్తానీలని ముద్ర వేసి, కేసులు పెట్టి వేధించిన బిజెపి, మోదీ ఒక్కడు 20 నిమిషాల పాటు రోడ్డు మీద సుఖవంతమైన కారులో వేచి వుంటేనే యింత గలభా చేస్తోందే అనుకోవచ్చు. మోదీ పంజాబ్ మళ్లీ రాకపోరు. అప్పుడు ఆయన సభలకు వచ్చిన జనం బట్టి, ప్రజలెలా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది.
ఇలాటి బలహీన స్థితిలో వున్న బిజెపిని తన ప్రస్తుత రాజకీయావసరాల కోసం బలపడేట్లు చేస్తే ముందుముందు తనకే తలనొప్పిగా మారుతుందని కెప్టెన్ అనుకుంటూండవచ్చు. అందుకే దాన్ని తన అనుయాయులతో నింపేసి, తనకు అనుకూలమైన మార్గంలో నడిపిద్దామని చూస్తూండవచ్చు. రాష్ట్రంలో అది ఎదగకుండా తలపై మేకు కొడదామని చూస్తున్నాడని అనుకోవాలి. ఆ మేకు కొట్టడం ఎలాగో బాబు యిప్పటికే చేసి చూపించారు కాబట్టి, అనుకరిస్తే సరిపోతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)