ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనను బలోపేతం చేయడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన పార్టీకి కమిటీలు వేయాలను డిసైడ్ అయ్యారు.
నిజానికి జనసేనలో ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. పార్టీకి కమిటీలు అవసరం అని నేతలు అంటున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నాయి. నాయకులు ఉన్నారు. అయితే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీకి కమిటీలు అవసరం అని నేతలు అంటూ వచ్చారు.
దాంతో తొలుత జిల్లా కమిటీలు, ఆ తరువాత మండల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారి ద్వారా గ్రామ స్థాయి వరకూ కమిటీలు వేసి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ కి తీసుకెళ్ళారని చూస్తున్నారు. ఉత్తరాంధ్రాలో బలమైన సామాజిక వర్గం మీద జనసేన అధినాయకులు ఫొకస్ పెట్టారని అంటున్నారు.
అదే విధంగా ప్రజల్లోకి పార్టీని పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి కూడా జనసేన ఆలోచిస్తోంది. తగిన యాక్షన్ ప్లాన్ ని కూడా రెడీ చేస్తోంది. పొత్తులతోనే 2024 ఎన్నికలకు జనసేన వెళ్తుందని ఈ సరికే అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉంది.
అది విస్తరించి టీడీపీతో పొత్తు ఉన్నట్లు అయితే మరింత ధాటీగా సీట్ల విషయంలో పట్టుపట్టడానికి ఇప్పటి నుంచే పార్టీని గట్టిగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పవన్ కళ్యాణ్ జిల్లాల టూర్లు ఉంటాయని కూడా చెబుతున్నారు. మొత్తానికి పవన్ ఉత్తరం వైపుగా ఆశగా చూస్తున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలని చూస్తున్నారు.