అడిగిందే కాదు, అడగనిది కూడా ఇచ్చిన జగన్..!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా ఇది ఓ గుడ్ న్యూస్. అడిగిన పీఆర్సీతో పాటు, అడగని వయోపరిమితి పెంపుని కూడా అమలు చేశారు సీఎం జగన్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 62…

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా ఇది ఓ గుడ్ న్యూస్. అడిగిన పీఆర్సీతో పాటు, అడగని వయోపరిమితి పెంపుని కూడా అమలు చేశారు సీఎం జగన్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 62 ఏళ్లకు పెంచారు. 

ప్రస్తుతం తెలంగాణలో పదవీ విరమణ వయసు 61 ఏళ్లుగా ఉంది. అంతకు మించి అన్నట్టు మరో ఏడాది అదనంగా సర్వీసులో ఉండే అవకాశమిచ్చారు జగన్. రిటైర్మెంట్ వయసుని 60నుంచి 62కి పెంచారు. అంటే రెండేళ్లపాటు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతంతోపాటు, ఇతర సౌకర్యాలు కూడా పొందే సదవకాశం దక్కించుకున్నారన్నమాట.

పీఆర్సీ ఫిట్ మెంట్ 23.29 శాతం..

ప్రభుత్వం ఫిట్ మెంట్ ని 23.29గా ఖరారు చేసింది. ప్రభుత్వం ముందు నుంచీ చెబుతున్నదానికంటే ఇది ఎక్కువ.

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ 2018 జులై-1 నుంచి అమలులోకి వస్తుంది. గతంలో ప్రకటించిన మానిటరీ బెనిఫిట్స్ 2020 ఏప్రిల్-1 నుంచి అమలులోకి వచ్చినట్టు పరిగణిస్తారు. ఫిబ్రవరి 1న వచ్చే జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై 10,247 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. సీపీఎస్ విషయంలో కూడా జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సీపీఎస్ పై జూన్30 లోపు నిర్ణయం తీసుకుంటామన్నారు.

సొంతింటి కల నెరవేర్చే దిశగా..

ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చే దిశగా మరో ముందగుడు పడింది. మిడిల్ ఇన్ కమ్ గ్రూప్స్ పేరిట ఏర్పాటు చేస్తున్న ఎంఐజీ లేఅవుట్స్ లో 10శాతం ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్ చేస్తారు. 20 శాతం రిబేటు కూడా వారికి ఇస్తారు. ఈమేరకు జగన్ పీఆర్సీ ప్రకటనతో పాటు భారీ హామీ ఇచ్చేశారు.

సచివాలయ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్..

ఇన్నాళ్లూ సచివాలయ ఉద్యోగులు తమ భవిష్యత్ ఏంటా అని బెంగ పెట్టుకున్నారు. రెండేళ్లు పూర్తయినా పర్మినెంట్ చేయలేదని భయపడుతున్నారు. వారికి కూడా జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు జూన్-30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ చేసి జీతాలు పెంచుతారు. మొత్తమ్మీద ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య, పీఆర్సీ, జీతాల పెంపు వ్యవహారం ఇబ్బందులేవీ లేకుండా పరిష్కారమైంది.