మూవీ రివ్యూ: 1945

టైటిల్: 1945 రేటింగ్: 1/5 తారాగణం: రానా, రెజీనా, నాజర్, సత్యరాజ్, సప్తగిరి తదితరులు కెమెరా: సత్య పొన్మర్  ఎడిటింగ్: గోపీ కృష్ణ సంగీతం: యువన్ శంకర్ రాజా  నిర్మాత: రాజరాజన్  దర్శకత్వం: సత్యశివ…

టైటిల్: 1945
రేటింగ్: 1/5
తారాగణం: రానా, రెజీనా, నాజర్, సత్యరాజ్, సప్తగిరి తదితరులు
కెమెరా: సత్య పొన్మర్ 
ఎడిటింగ్: గోపీ కృష్ణ
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నిర్మాత: రాజరాజన్ 
దర్శకత్వం: సత్యశివ
విడుదల తేదీ: 7 జనవరి 2022

బాహుబలి మొదటి భాగం తర్వాత మొదలైన ఈ చిత్రం ఎట్టకేలకి అన్ని పనులూ పూర్తి చేసుకుని నేడు విడుదలయింది. ఇంత జాప్యానికి కారణం కేవలం కరోనా ఒక్కటే కాదు.. హీరోకి, నిర్మాతకి మధ్య వచ్చిన పొరపొచ్చాలు కూడా. 

భారీ సెట్టింగులు, పీరియడ్ బ్యాక్ డ్రాప్, ఆర్ట్ వర్క్ ట్రైలర్లో కనిపించాయి. ప్యాన్ ఇండియా నటులు రానా, సత్యరాజ్, నాజర్ కనిపించారు. హీరోయిన్ పాత్రలో రెజీనా ఉంది. వీళ్లని చూసి సగటు ప్రేక్షకుడు ఒక అంచనాకు రావడం సహజం. 

బ్రిటీష్ పాలన నేపథ్యంలో అనేకమైన సినిమాలు వెండితెర మీద వచ్చాయి. ఈ ఏడు రాబోయే అతి పెద్ద చిత్రం ట్రిపులార్ ది కూడ ఆ నేపథ్యమే. 

ఈ తరహా చిత్రాల్లో ప్రధానంగా పండాల్సింది దేశభక్తి అనే ఎమోషన్. “జై నేతాజీ” అని అరిస్తేనో, బ్రిటీష్ దొరలని తన్ని తగలేసే సీన్లు పెట్టేస్తేనో ప్రేక్షకుడిలోని దేశభక్తి నిద్రలేచి కూర్చోదు. దానికి సరైన కథ, కథనం, సంభాషణ, సంఘర్షణ, పోరాటం, ఎదురు దెబ్బ, కథానాయకుడి తెలివి, ప్రతీకారం, అంతిమ విజయం… ఈ అంశాలన్నీ ఉండాలి గ్రాఫ్ లో. ఏది ఎంత ఉండాలి అనేది మరొక విషయం. 

వీటన్నిటి మీదా బలమైన కసరత్తు చేసి కళ్లు మూసుకుని సినిమా మొత్తాన్ని ముందే చూడగలగాలి. ఆ తర్వాతే సెట్స్ మీదకు రావాలి. ఇదంతా కేవలం థియరీలా కనిపించినా ప్రేక్షకుల్ని ఎమోషన్లో తడపడానికి ఈ కృషి తప్ప మరొక దారి లేదు. 

అటువంటి కృషి ఈ 1945 విషయంలో చేసినట్టు అనిపించదు. అత్యంత దయనీయమైన దర్శకత్వంలో, పేలవమైన సంభాషణలతో, ఎక్కడా టెన్షన్ పెట్టని కథనంతో నిర్వీర్యంగా సాగుతుంది. కళ్ల ముందు సెట్టింగులు, దుస్తులు రూపంలో ఖర్చైతే కనపడింది కానీ మనసుకి హత్తుకునే సన్నివేశం ఒక్కటి కూడా లేదు.

ఎప్పుడో పాతికేళ్ల క్రితం “1942 ఏ లవ్ స్టోరీ” వచ్చింది. అద్భుతమైన మ్యూజికల్ హిట్. చాలా గొప్పగా తీసిన దేశభక్తి చిత్రం. ఆ సినిమాని పది సార్లు చూసి అలాంటి సినిమా ఒకటి తియ్యాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారేమో అనిపిస్తుంది. 

ఎందుకంటే అందులో రఘువీర్ యాదవ్ ని పోలిన పాత్రని ఇక్కడ సప్తగిరి పోషించాడు. 

అక్కడ అనుపం ఖేర్ లాంటి పాత్రని ఇక్కడ సత్యరాజ్.. అక్కడ దివాన్ పాత్రలో ఇక్కడ నాజర్ కనిపిస్తారు. 

మనీషా కోయిరాలా లాంటి పాత్రలో రెజీనా ఉన్నా లవ్ ట్రాక్ ని నడపడంలో దర్శకుడు పూరిగా విఫలమయ్యాడు. 

పెళ్లిచూపుల సీన్, ఇంట్లో దొంగలు పడే సన్నివేశం దర్శకుడు కామెడీ అనుకుని తీసుండొచ్చు. కానీ చూసేవాళ్ళకి అలా అనిపించదు. అయినా కొంతవరకూ మన్నించొచ్చు. కానీ బ్రిటీష్ పోలీసులు వచ్చి గోధుమలు దోచుకుపోయే సీన్ మాత్రం చిరాకు తెప్పిస్తుంది. సన్నివేశంలోని బాధితులని చూసి జాలి కలగాల్సింది పోయి దర్శకుడి మీద కలుగుతుంది జాలి. అసలేం పండిద్దామని ఏం తీసాడో పాపం అనిపిస్తుంది. 

సప్తగిరి చావు సీన్ కూడా అంతే. ఆ పాత్ర చనిపోతే ప్రేక్షకుడికి ఏ ఫీలింగూ కలగలేదంటే అర్థం చేసుకోవచ్చు దర్శకత్వ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో. 

సుభాష్ చంద్రబోస్ చనిపోవడంతో సినిమా మొదలవుతుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ కమాండర్ చనిపోయాక ఇక ఆ నేపథ్యంలోని కథకి విలువేముంటుంది? ఆ మాటకొస్తే అసలు ఈ నేపథ్యం లేకపోయినా కథకి అడ్డొచ్చే అంశమేదీ లేదు. బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో ఒక యువకుడి కథ కింద చెప్పేసుకోవచ్చు. 

రానా దగ్గుబాటి నిండుగా కనిపించాడు. పాత్రకి ఒదిగాడు కానీ ఫలితం లేదు. 

రెజీనా కంటికింపుగా ఉంది. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది కానీ దేశభక్తి కథకి పెద్దగా ఉపయోగపడ్డది లేదు. 

నాజర్, సత్యరాజ్ ఓకే. సప్తగిరి పాత్ర వల్ల ఏ ప్రయోజనమూ లేదు. 

మిగిలిన తారాగణమంతా జూనియర్ అర్టిస్టులే. వాళ్లల్లో చాలామందికి నటన రాదు. దర్శకుడికి ఏ సీన్లోనూ ఎమోషన్ పండించడం రాదు. అదీ పరిస్థితి. 

కెమెరా, కాస్ట్యూం, కళా దర్శకత్వం వరకు మెచ్చుకుని తీరాలి. మిగిలిన విభాగాలన్నీ తేలిపోయాయి. 

ఇంతా చేసి క్లైమాక్స్ లో విలన్ ని చంపడం చూపించకుండా వాయిస్ ఓవర్ లో దాటేసాడు దర్శకుడు. షూటింగ్ అంతవరకే చేసుండొచ్చు. తర్వాత ఆర్టిస్టుల డేట్స్ కుదరకపోయి ఉండొచ్చు. 

అసలీ సినిమాని విడుదలకి ముందు ప్రచారం చేయాలన్న ఆలోచన కూడా తయారీదారులకు రాలేదంటే ఫైనల్ కాపీ చూసి ఫలితాన్ని ముందే ఊహించారేమో అనుకోవాలి. 

2022లో తొలిసినిమాగా విడుదలైన ఈ 1945 ఏ మాత్రం రంజింపజేయకుండా నీరసం తెప్పించింది. 

“జై నేతాజీ” అని క్లైమాక్స్ లో రెజీనా అరిచినా ఆమెతో గొంతు కలపడానికి ప్రేక్షకుల్లో ఓపికగానీ, ఆసక్తి గానీ కలగదు. మనసులో మాత్రం “జై క్యాబేజీ” అనుకుంటూ థియేటర్ మెట్లు దిగాలంతే. 

బాటం లైన్: జై క్యాబేజీ