వివాదాల కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్.. మరోసారి షాకింగ్ కామెంట్స్ తో వార్తల్లోకెక్కింది. ఈ దఫా ఏకంగా జాతిపిత మహాత్మ గాంధీ, భారత తొలి ప్రధాని నెహ్రూని టార్గెట్ చేసింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది కంగన.
రాజకీయ నాయకులతో పాటు, సినీ ప్రముఖులు కూడా పటేల్ గొప్పదనాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. అయితే కంగనా మరో అడుగు ముందుకేసి పటేల్ గొప్పదనాన్ని పొగుడుతూనే గాంధీ, నెహ్రూల అసమర్థత, ఆశ్రిత పక్షపాతం వల్లే పటేల్ లాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రథమ ప్రధాని అయ్యే అవకాశం కోల్పోయారంటూ ట్వీట్ చేసింది.
పటేల్ భారత తొలి ప్రధాని అయ్యే అవకాశాన్ని గాంధీ కోసం త్యాగం చేశారని అంది కంగనా. నెహ్రూ ఇంగ్లిష్ బాగా మాట్లాడగలరని గాంధీ నమ్మకం, ఆ నమ్మకం వల్లే ఆయన పటేల్ ని కాదని, నెహ్రూని ప్రధానిగా చేశారట.
ఈ నిర్ణయం వల్ల పటేల్ బాధపడలేదు కానీ, కొన్ని దశాబ్దాల పాటు ఈ దేశం ఇబ్బందులు ఎదుర్కొంది అంటూ ట్వీట్ చేసింది కంగన. అందుకే మనకు దక్కాల్సిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అంటోంది.
“పటేల్ ఉక్కు మనిషి. నెహ్రూ బలహీన మనస్తత్వం ఉన్న వ్యక్తి. కానీ నెహ్రూని ప్రధానిని చేయాలని అనుకున్నారు గాంధీ. నెహ్రూ ఈ దేశాన్ని ముందుండి నడిపించాలని గాంధీ కల. అది మంచి ప్రణాళికే. అయితే.. గాంధీ మరణం తర్వాత పరిస్థితి ఘోరంగా తయారైంది.”
“అందరికీ పటేల్ జయంతి శుభాకాంక్షలు. మాకు అఖండ భారత దేశాన్ని అందించిన మహానుభావుడు మీరు. అయితే ప్రధాని పదవి త్యాగం చేసి మీ నాయకత్వాన్ని మాకు దూరం చేశారు. మీ నిర్ణయానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాం.” అంటూ కంగన చేసిన వరుస ట్వీట్లు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర కలకలం రేపాయి.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక స్వాతంత్ర పోరాట చరిత్రను బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నాలు చాలానే జరిగాయి. అయితే బీజేపీ నేతలు కూడా ఇంత దారుణంగా ఎప్పుడూ గాంధీ నిర్ణయాలను వ్యతిరేకించలేదు. కానీ కంగనా రనౌత్ మాత్రం ముందూ వెనకా ఆలోచించకుండా తన ట్వీట్లతో హల్ చల్ చేస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించినంత ఈజీగా.. కంగనా రనౌత్ జాతిపిత మహాత్ముడిని కూడా విమర్శిస్తుంటే.. నెటిజన్లు ఊరుకోలేదు. ఓ రేంజ్ లో ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఓవైపు బీజేపీ నేతలు కంగనా ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరోవైపు కంగనాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు సగటు భారతీయులు. ఈసారి ఆమెపై మరిన్ని దేశద్రోహం కేసులు పడతాయేమో.