వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి, వున్నట్లుండి మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు నిర్మాత బండ గణేష్. అలాంటిది ఇటీవల వున్నట్లుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సెల్ఫీ దిగి వార్తల్లో హల్ చల్ చేసాడు.
చెప్పీ చెప్పకుండా, వివరించీ వివరించకుండా పవర్ స్టార్ తో సినిమా అనే ఫీల్ బయటకు వదిలాడు. కానీ ఆ సినిమా సంగతేమో కానీ, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో మాత్రం ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది ఇమ్మీడియట్ గా మాత్రం కాదు. ప్రస్తుతం చేస్తున్న దేవా కట్టా, చేయాల్సిన దిల్ రాజు సినిమాలు పూర్తయిన తరువాత. ఈ మేరకు బండ్ల ఓ షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ ను కలిసి మాట తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బండ్ల తన మిత్రుడు దేవా కట్టా చేస్తున్న షూట్ కు వెళ్లి అక్కడ సాయి తేజ్ ను కలిసినట్లు బోగట్టా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు సినిమాలు తరువాత అయినా తనకు ఓ సినిమా చేయాలని కోరినట్లు, దానికి తేజ్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.