చంద్రబాబును ఓ బురదపాముతో పోల్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అప్పటికప్పుడు మాట మార్చడం, అవసరమైతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
“గతంలో ఓసారి బీజేపీతో పొత్తు వద్దని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించుకున్నారు. మేం దాన్ని సవాల్ గా స్వీకరించాం. ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించాం.
వెంటనే సాయంత్రానికి చంద్రబాబు మాట మార్చేశాడు. వచ్చి మా కాళ్లు పట్టుకున్నాడు. అది తాచుపాము కాదు, బురదపాము. చంద్రబాబు నైజం ఇలా ఉంటుంది. అనేక మందిని వాడుకొని వదిలేశాడు. రాజకీయ చదరంగంలో ఆయనకి అది ఇష్టమైన ఆట.”
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత గద్దె బాబురావు ఈమధ్య ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన సోమువీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోము వీర్రాజు, బాబును బురదపాముతో పోల్చారు. అంతేకాదు.. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు ఓ పిలుపునిచ్చారు వీర్రాజు.
“ఒకానొక టైమ్ లో ఎన్టీఆర్, తన పదవి పోగొట్టుకొని, విసిగిపోయి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే.. స్వయంగా వాజ్ పేయి, అద్వానీ రంగంలోకి దిగారు.
ప్రజాపరిరక్షణ ఉద్యమం చేపట్టి ఎన్టీఆర్ ను తిరిగి కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఎన్టీఆర్ ను, చంద్రబాబు అవమానించాడు. ముఖ్యమంత్రిగా దించేశాడు. వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు చెప్పండి, తెలుగుదేశం కార్యకర్తలు ఏ పార్టీలో ఉండాలి.”
ఈ సందర్భంగా కొత్తగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన అచ్చెన్నాయుడిపై కూడా విమర్శలు గుప్పించారు వీర్రాజు. అచ్చెన్నాయుడు వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయన ఏపీ టీడీపీకి అధ్యక్షుడిగా కనిపించడం లేదని.. చంద్రబాబుకు, ఆయన కొడుకు కుటుంబానికి మాత్రమే అధ్యక్షుడిగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.