ఆ రూల్స్ నీకు వర్తించవా పుష్పా..!

థియేటర్లలో రిలీజైన ఓ సినిమా ఎన్ని రోజులకు ఓటీటీలో రావాలి? దీనికి సంబంధించి టాలీవుడ్ లో స్పష్టమైన నిబంధన ఉంది. థియేటర్లలో ఓ సినిమా విడుదలైన 7 వారాల తర్వాత మాత్రమే అది ఓటీటీలో…

థియేటర్లలో రిలీజైన ఓ సినిమా ఎన్ని రోజులకు ఓటీటీలో రావాలి? దీనికి సంబంధించి టాలీవుడ్ లో స్పష్టమైన నిబంధన ఉంది. థియేటర్లలో ఓ సినిమా విడుదలైన 7 వారాల తర్వాత మాత్రమే అది ఓటీటీలో స్ట్రీమింగ్ కు రావాలి. కానీ ఈ నిబంధనను ఎవ్వరూ పాటించడం లేదు. విడుదలైన 2-3 వారాలకే తమ సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఆమధ్య ఓ పిట్టకథ, అక్షర లాంటి సినిమాలొచ్చాయి. అవి థియేటర్లలోకొచ్చిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. చాలా చిన్న సినిమాలది ఇదే దారి.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద సినిమాల్ని మినహాయించాలి. ఎందుకంటే, ఉన్నంతలో అవి ఈ నిబంధనను పాటించాయి. ఒకట్రెండు సినిమాల్ని తప్పిస్తే, మిగతావన్నీ కాస్త గ్యాప్ లోనే ఓటీటీలోకొచ్చాయి. కానీ పుష్ప లాంటి పెద్ద సినిమా ఈ రూల్ ను పాటించకపోవడం బాధాకరం.

డిసెంబర్ 17న రిలీజైంది పుష్ప. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా ఇవాళ్టి నుంచి ఓటీటీలోకొచ్చింది. అంటే విడుదలైన 3 వారాలకే పుష్ప సినిమా స్ట్రీమింగ్ కొచ్చిందన్నమాట. అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోనే ఇలా రూల్స్ పాటించకుండా తన సినిమాను ఓటీటీలకు ఇచ్చేస్తుంటే, ఇక చిన్న సినిమా నిర్మాతలు, హీరోలు ఎందుకు ఊరుకుంటారు. తగ్గేదేలే అంటూ తమ సినిమాల్ని కూడా ఇచ్చేస్తారు.

నిజానికి చిన్న సినిమాల్ని కాస్త మానవతా దృక్పథంతో చూడాలి. థియేటర్లలో డబ్బులు రావు కాబట్టి కనీసం కాస్త తొందరగా ఓటీటీలకు ఇచ్చేస్తే గిట్టుబాటు అవుతుందని, తక్కువ నష్టాలతో బయటపడొచ్చని చిన్న నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అందుకే చాలా చిన్న సినిమాలు రిలీజైన 2-3 వారాలకే ఓటీటీలో ప్రత్యక్షమౌతాయి.

కానీ పుష్ప లాంటి పెద్ద సినిమాకు అంత ఖర్మ పట్టలేదు. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ అయినట్టు స్వయంగా ఆ యూనిట్టే చెప్పుకుంటోంది. వరల్డ్ వైడ్ 300 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు ఊదరగొట్టుకుంటోంది. ఆంధ్రా తప్ప అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చినట్టు ప్రకటించుకుంటోంది. మరి ఇలాంటి టైమ్ లో ఈ దేబిరింపు ఎందుకు? అగ్రిమెంట్ మొత్తాలు కాకుండా.. ఇలా తొందరగా స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీలు ఇచ్చే డబ్బుల కోసం అర్రులు చాచడం ఎందుకు? లేకపోతే ముందుగానే అగ్రిమెంట్ లో ఇలా 3 వారాలకే అని రాసుకున్నారా? ఎలా అయినా తప్పు తప్పే కదా. 

చేసిన ఈ పనిని సమర్థించుకోవడానికి కూడా పుష్ప టీమ్ వెనకాడ్డం లేదు. తమ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్  బయటకొచ్చినప్పటికీ.. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని, మరీ ముఖ్యంగా ఉత్తరాదిన హౌజ్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయంటూ తమకు చెందిన వ్యక్తులతో ట్వీట్లు వేయించుకుంటున్నారు.

పుష్పను చూసి ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ కు కూడా కన్నుకుట్టినట్టుంది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చేశారు మేకర్స్. తాజాగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా హిట్టయినట్టు మేకర్స్ చెప్పుకుంటున్నారు. కానీ ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ ను అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ పావులు కదుపుతోంది.

నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమా కూడా ఇంతే. పుష్ప కంటే వారం ముందు రిలీజైన ఈ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో కనిపిస్తోంది. చూస్తుంటే.. టాలీవుడ్ లో నిబంధనలన్నీ మాట్లాడుకోడానికే, పాటించడానికి కాదన్నట్టు తయారయ్యాయి.