కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో ముంచుకొస్తోంది. ఒమిక్రాన్‌తో ప్రాణాపాయం లేదని ఇంత కాలం ప్రచారమవుతున్న మాటల్లో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చి చెప్పింది. ఒమిక్రాన్ ప్రాణాంతకమైందని, మనుషుల ఉసురు తీస్తోందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఒమిక్రాన్‌పై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ గత వేరియంట్ల కంటే తక్కువ హానికరమని చెప్పడంలో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ఒమిక్రాన్ బాధితులు పెద్ద సంఖ్యలోనే ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ వెల్లడించారు. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ఒమిక్రాన్ కేసులో రోజుకు లక్షల్లో నమోదవుతూ ప్రపంచాన్ని వణికిస్తోంది.
ఒమిక్రాన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ మాటల్లోనే తెలుసుకుందాం.
‘డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రతను తక్కువగా తీసుకోవడం సరైంది కాదు. టీకాలు వేసుకున్న వారిలో కాస్త తక్కువ ప్రభావం కనిపిస్తూ వుండొచ్చు. అంత మాత్రాన మనల్ని ఏమీ చేయదనే నిర్లక్ష్యం ప్రదర్శించడం అన్నిటికంటే ప్రమాదకరం. ఇప్పటికే చాలా దేశాల్లో డెల్టా కంటే ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో కొన్ని దేశాల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇది కూడా మనుషుల్ని చంపేస్తోంది. నిజం చెప్పాలంటే కేసులు సునామీలా విరుచుకుపడుతున్నాయి. ఇవి యావత్ ప్రపంచంలోని ఆరోగ్య వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి’ అని టెడ్రోస్ యావత్ ప్రపంచాన్ని హెచ్చరించారు.
అంతేకాదు, ఒమిక్రాన్ చివరి వేరియంట్ అని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో కొవిడ్ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. మున్ముందు ఎలాంటి కొత్త, ప్రమాదకర వేరియంట్‌లు వస్తాయో ఊహించ చెప్పలేమని ఆయన అన్నారు. కేవలం జాగ్రత్తగా ఉండడం ఒక్కటే మన చేతుల్లో ఉందని కెర్ఖోవ్ స్పష్టం చేశారు.