కుప్పం పర్యటనలో చంద్రబాబు భయం బట్టబయలైంది. ముఖ్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తు లేకపోతే తన పార్టీ పుట్టి మునగడం ఖాయమనే సంకేతాల్ని తనకు తానే పంపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాబులోని బేలతనాన్ని చూస్తున్న టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అధికార పార్టీతో పోరాడడం కంటే, పొత్తులపైనే ఆయన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
అందుకే చంద్రబాబు సిగ్గు విడిచి తనకు తానుగా పొత్తుల అంశాన్ని కుప్పం పర్యటనలో ప్రస్తావించడం విమర్శలకు తావిస్తోంది. నిన్నమొన్నటి వరకూ పొత్తుల అంశాన్ని కొట్టి పారేస్తూ వచ్చిన చంద్రబాబు, తాజాగా పదేపదే అదే జపం చేయడం బాబులో భయాన్ని చూపుతోంది. పవన్‌కల్యాణ్‌తో తనది ఒన్‌సైడ్ లవ్ అని, అటు వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని బాబు చెప్పుకోవడం ఆయన దివాళాకోరు రాజకీయానికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పం నియోజక వర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు మరోసారి పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు కుదుర్చుకోవాలని అనుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. పొత్తులు ఉన్నప్పుడు గెలిచామని, అలాగే లేనప్పుడు గెలిచామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం ఆయనకే చెల్లింది. పొత్తులపై వైసీపీ మాట్లాడుతున్న తీరు పనికిమాలినదని ఆయన విమర్శించారు.
నిజంగా రాష్ట్రంపై, పవన్‌పై చంద్రబాబుకు అంత ప్రేమే వుంటే…జనసేనానిని సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమా? ఆ విధంగా ఒప్పందం చేసుకుని జనసేనతో టీడీపీ పొత్తు కుదుర్చుకునే చిత్తశుద్ధి, దమ్ము చంద్రబాబులో ఉన్నాయా? ఎన్నికల ముంగిట చంద్రబాబు ప్రేమ ఒలకబోస్తూ వల్లిస్తున్న మాయ మాటలు నమ్మి మరోసారి పవన్‌కల్యాణ్ మోసపోతారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఒకే ఒక్క జగన్‌ను ఎదుర్కోడానికి తన వల్ల కావడం లేదని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారనేందుకు పొత్తు మాటలే నిదర్శనమనే వాదన తెరపైకి వచ్చింది.