అభివృద్ధి అంటే ఏంటి. దానికి నిర్వచనం ఏంటి. బయట బంగారు లాంటి భవనాలు ఉన్నా ఇంట్లో పొయ్యి మీద పిల్లి లేవలేని సీన్ ఉంటే అభివృద్ధి అనగలరా. వ్యక్తుల సమూహమే సమాజం అయినపుడు, ముందు వ్యక్తి అభివృద్ధి, వికాసం ముఖ్యం కదా.
ఆ విధంగా చూసుకుంటే ఏపీ దేశంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన ఉంది అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అంటున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే ఏపీయే ముందుంటుందని కూడా ఆమె చెబుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, తలసరి ఆదాయం పెరిగిందని, అలాగే ప్రజల ఆరోగ్యానికి భద్రత ఉందని, అక్షరాస్యత శాతం ఏపీలో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇలా ఈ మూడింటినీ చూస్తే కనుక ఏపీ నంబర్ వన్ పొజిషన్ లో ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇక ఈ రెండున్నరేళ్లలో ఏపీలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, నాడు నేడు కార్యక్రమం ద్వారా అది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అని ఆమె అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీతో పాటు, నాడు నేడు ద్వారా వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆరోగ్యరంగాన్ని కూడా ఏపీలో అభివృద్ధి చేశారని చెప్పారు.
శ్రీకాకుళం లాంటి వెనకబడిన జిల్లాలో తలసరి ఆదాయం గతం కంటే ఎక్కువగా పెరిగింది అని కృపారాణి అంటున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో శ్రీకాకుళం జిల్లాలో వలసలు రెండు లక్షల దాకా ఉంటే చంద్రబాబు టైమ్ లో అవి ఆరు లక్షలకు చేరాయని గుర్తు చేశారు. ఇపుడు జగన్ సర్కార్ పాలనలో వలసలు బాగా తగ్గాయని ఆమె పేర్కొన్నారు. జగన్ సర్కార్ నవరత్నాలు అమలు తోనే కరోనా టైమ్ లో కూడా ఏపీలో జీడీపీ పెరిగింది అని ఆమె వివరించారు
చంద్రబాబు మూడు లక్షల కోట్ల అప్పులు చేశారని వాటితో ఏపీకి ఏం ఖర్చు చేశారో లెక్క చెప్పగలరా అని ఆమె సవాల్ చేశారు. తాము తెచ్చిన అప్పుకు ప్రతీ పైసాకూ లెక్క ఉందని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి అభివృద్ధి అంటే భవనాలు, భౌతిక వసతులు మాత్రమే కాదని, మానవ వికాసమని డాక్టర్ కూడా అయిన కృపారాణి అంటున్నారు. మరి దీనికి విపక్షాలు ప్రత్యేకించి టీడీపీ తమ్ముళ్ళు ఏమంటారో.