శంకర్ దాదా ఎంబీబీఎస్ Vs ఆచార్య ఆర్ఎంపీ

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా టైమ్ లో డాక్టర్లని రౌడీలుగా చూపించడం కరెక్ట్ కాదు అంటూ ఆ వర్గం నిరసన తెలిపింది. అయితే సోషల్ మీడియా ఇంత పాపులర్ కాదు కాబట్టి అది పెద్దగా…

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా టైమ్ లో డాక్టర్లని రౌడీలుగా చూపించడం కరెక్ట్ కాదు అంటూ ఆ వర్గం నిరసన తెలిపింది. అయితే సోషల్ మీడియా ఇంత పాపులర్ కాదు కాబట్టి అది పెద్దగా బయటకు రాలేదు. సినిమా విడుదల తర్వాత చిరంజీవి క్యారెక్టర్ చూసి ఎవరూ గొడవ పొడిగించలేదు. కానీ ఇప్పుడు ఆచార్యలో మళ్లీ తెల్ల కోటుకి కోపం తెప్పించారు చిరంజీవి.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఐటెంసాంగ్ రిలీజైంది. ఇందులో ఆర్ఎంపీలను కించపరిచినట్టు ఓ చరణం ఉంది. దాన్ని తీసేయాలంటున్నారు. ఆర్ఎంపీల సంఘాలు రోడ్డెక్కి నిరసన చేపట్టాయి. వెంటనే సినిమా నుంచి ఆ పాటలో ఆ పదాల్ని తీసేయాలంటూ డిమాండ్ చేశారు ఆర్ఎంపీలు. పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.

మనోభావాలు దెబ్బతినే సీజన్ చాన్నాళ్ల క్రితమే మొదలైంది. అయితే ఎడాపెడా అడ్డదిడ్డంగా ఈమధ్య మనోభావాలు దెబ్బతింటున్నాయి. అలాగని వారిని తక్కువచేసి చూడలేం, వారికి మండింది, రోడ్డెక్కారు, ఇంకోసారి ఇంకొకరికి మండితే వారు కూడా రోడ్డెక్కుతారు. అయితే అంతవరకు రాకుండా చూసుకోవడం సినిమాలు తీసేవారి బాధ్యత.

క్లీన్ సినిమాలు తీసే కొరటాల శివ కూడా ఇలాంటి పదాలను ఇగ్నోర్ చేయడం ఆలోచించాల్సిన విషయమే. అయితే అదేదో శృతిలో కలిసిపోతుందనుకున్నారు కానీ, తెలంగాణలో ఇంత రచ్చ అవుతుందని ఎవరూ అనుకోలేదు. పోనీ చిరంజీవి అయినా ఓసారి చూసుకోవాలి కదా. కానీ అదీ జరగలేదు. చివరికి ఎవరూ ఊహించని విధంగా గొడవ మొదలైంది.

సినిమా విడుదల ఇప్పుడు కాదు, సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలు పెట్టలేదు, కానీ ఇప్పుడు అనుకోకుండా ఇలా సినిమా వివాదంలో చిక్కుకుంది. పోనీ ఈ వివాదం కూడా సినిమాకి ప్లస్ అవుతుందనుకున్నా.. ఏమీ లేని సమయంలో ఎందుకీ వివాదం అంటూ తల పట్టుకున్నారు నిర్మాతలు. అసలా పాట విడుదల చేయడమే తప్పని బాధపడుతున్నారు.

మొత్తమ్మీద ఆచార్య విషయంలో కొరటాల శివ చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. సినిమా ప్రారంభంలోనే ఆచార్య కథపై చాలా గందరగోళం నడిచింది. దాన్ని ఎలాగోలా క్లియర్ చేసుకున్నాడు కొరటాల. ఇప్పుడిలా “ఐటెంసాంగ్ లో అశ్లీల సాహిత్యం” అంటూ మరో వివాదంలో ఇరుక్కుపోయాడు. క్లీన్ ఇమేజ్ ఉన్న దర్శకుడు, చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడిలా సాహిత్యం విషయంలో తలపట్టుకోవాల్సి వచ్చింది. అంత సీనియర్ నటుడైన చిరంజీవి కూడా దీన్ని పట్టించుకోలేదా అనేది చర్చనీయాంశమైంది.