టాలీవుడ్ ను కరోనా మరోసారి వణికిస్తోంది. సెకెండ్ వేవ్ లో పవన్ కల్యాణ్, రకుల్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి తారలు కరోనా బారిన పడగా.. థర్డ్ వేవ్ లో మహేష్ బాబు లాంటి హీరోలు కరోనాకు గురవుతున్నాయి. మహేష్ తో పాటు మంచు లక్ష్మి, మంచు మనోజ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా చేరింది.
టాలీవుడ్ లో విలక్షణ పాత్రలు పోషిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా సోకింది. వెంటనే ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మిని తీసుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ సినిమా చర్చల కోసం హైదరాబాద్ వచ్చిన వరలక్ష్మి, కరోనా బారిన పడింది.
క్రాక్ సినిమాతో తెలుగులో పాపులర్ అయింది వరలక్ష్మి. ఆ సినిమాలో ఆమె చేసిన జయమ్మ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నాంది సినిమాలో ఆమె పోషించిన లాయర్ పాత్ర బాగా క్లిక్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న యశోద మూవీలో కూడా వరలక్ష్మిది కీలక పాత్ర.
మరోవైపు నితిన్ భార్యకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా వెల్లడించాడు. తన భార్య ఐసొలేషన్ లో ఉన్నప్పటికీ, దూరం నుంచి ఆమె పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేశాడు నితిన్. కరోనా అడ్డంకులు సృష్టించినా, ప్రేమకు అడ్డంకులు ఉండవంటూ మంచి క్యాప్షన్ కూడా తగిలించాడు. మరోవైపు మంచు లక్ష్మి, మంచు మనోజ్ కూడా తాము కోలుకుంటున్నట్టు ప్రకటించారు.