నిమ్మ‌గ‌డ్డ బ్లెండ‌ర్ మిస్టేక్ …

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ చేసిన చిన్న త‌ప్పిదం వ‌ల్ల చాలా అన‌ర్థం జ‌రుగుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించాలా? వ‌ద్దా? అనే అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయ‌న మూడు…

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ చేసిన చిన్న త‌ప్పిదం వ‌ల్ల చాలా అన‌ర్థం జ‌రుగుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించాలా? వ‌ద్దా? అనే అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయ‌న మూడు రోజుల క్రితం వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌ను ఆహ్వానించారు. 

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అస‌లు ఉనికే లేని రాజ‌కీయ పార్టీల‌కు కూడా నిమ్మ‌గ‌డ్డ ఆహ్వానాలు పంపి … ‘ఔరా’ ఎంత గొప్ప ప్ర‌జాస్వామ్య వాది అనిపించారు. అయితే ఆయ‌న ఒకే ఒక్క వ్య‌క్తిని పిల‌వ‌డం మ‌రిచిపోయారు. ఇంత‌కూ ఎవ‌రా వ్య‌క్తి? ఏమా క‌థ‌? …తెలుసుకుందాం ప‌దండి.

ఈ నెల 28న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన స‌మావేశానికి 19 రాజ‌కీయ పార్టీల‌ను నిమ్మ‌గ‌డ్డ ఆహ్వానించారు.  ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ, టీఆర్‌ఎస్,  జ‌న‌సేన , జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన బీఎస్పీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్సీపీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ఏఐఏడీఎంకే, ఫార్వర్డ్‌ బ్లాక్, ఎంఐఎం, ముస్లింలీగ్, జనతాదళ్‌ (ఎస్‌), జనతాదళ్‌ –యూ, సమాజ్‌వాదీ, ఆర్‌ఎల్‌డీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలకు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఆహ్వానాలు పంపారు.

ఎస్ఈసీ ఆహ్వానించిన పార్టీల్లో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన ప్ర‌ధాన‌మైన‌వి. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  నోటా కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉండ‌డం వ‌ల్ల బీజేపీ నేత‌ల‌ను ఏపీలో ప‌ట్టించుకుంటున్నారే త‌ప్ప … వాళ్ల‌కు ఇక్క‌డ అంత సీన్ లేదనేది బ‌హిరంగ ర‌హ‌స్యం. 

వామ‌ప‌క్ష పార్టీల బ‌లం ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక టీఆర్ఎస్ తెలంగాణ‌కు ప‌రిమిత‌మైన పార్టీ. ఎస్ఈసీ ఆహ్వానం అందుకున్న ఎన్సీపీ, ఏఐఏడీఎంకే, ఫార్వర్డ్‌ బ్లాక్, ఎంఐఎం, ముస్లింలీగ్, జనతాదళ్‌ (ఎస్‌), జనతాదళ్‌ –యూ, సమాజ్‌వాదీ, ఆర్‌ఎల్‌డీ, రివల్యూషనరీ సోషలిస్టుల‌లో కొన్నింటి గురించి ఎప్పుడూ పేర్లు విన్న దాఖ‌లాలు కూడా లేవు.

ఇదే సంద‌ర్భంలో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌ల‌మున‌క‌లై ఉన్న‌ అమెరికాలోని  డెమోక్ర‌టిక్‌, రిప‌బ్లిక్ పార్టీల‌కు ఆహ్వానం పంప‌క‌పోవ‌డంపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. ఆ దేశ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌ల‌మున‌క‌లై ఉండ‌డం వ‌ల్ల ఆ పార్టీల ప్ర‌తినిధులు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని భావించి, ఆహ్వానించ‌లేన‌ది త‌న‌ను ప్ర‌శ్నించిన వారికి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్  వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఇదే సంద‌ర్భంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో అత్యంత కీల‌క పాత్ర పోషిస్తున్న ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్‌కేను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముక్కూ మొహం తెలియ‌ని పార్టీల‌న్నిటిని ఆహ్వానించిన నిమ్మ‌గ‌డ్డ … గ‌తంలో చంద్ర‌బాబు నీడ‌లా ఉంటూ పాల‌న సాగించిన ఆర్‌కేను పిల‌వ‌క పోవ‌డం ఏంట‌ని ప్ర‌జాస్వామిక వాదులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌ను పిల‌వ‌క‌పోయినా … ఏపీ శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని నేడు త‌న ప‌త్రిక‌లో ఓ ఆస‌క్తిక‌ర బ్యాన‌ర్ క‌థ‌నాన్ని ప్ర‌చురించారు.  ‘ఇప్పుడు అవ‌స‌ర‌మా!’ అనే శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతిలో చ‌క్క‌టి క‌థ‌నం …ఒక ర‌కంగా ఎస్ఈసీకి నివేదిక లాంటిదే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

న‌వంబ‌ర్ 2 నుంచి ఏపీలో విద్యాసంస్థ‌లు తెర‌వాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించ‌డాన్ని త‌ల్లిదండ్రులు వ్య‌తిరేకిస్తున్నారంటూ … అందులో తెర‌పైకి తెచ్చిన లాజిక్ మాత్రం ఎవ‌రైనా ‘అంతేగా …అంతేగా’ అనేలా ఉంది.

రోజుకు మూడు వేల క‌రోనా కేసులంటూ స్థానిక ఎన్నిక‌ల‌కు  ‘నో’ అంటున్న ప్ర‌భుత్వం …బ‌డులు, కాలేజీల‌కు మాత్రం ‘ఎస్‌’ అని ఎలా అంటార‌ని ఆర్‌కే గ‌ట్టిగా నిల‌దీశారు. అందులోనూ సెకండ్‌ వేవ్‌ సంకేతాలను జ‌గ‌న్ స‌ర్కార్ లెక్క చేయ‌డం లేదంటూ ఆర్‌కే ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ క‌థ‌నాన్ని రాసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా క‌థ‌నంలో ఆర్‌కే వేసిన ప్ర‌శ్న‌లు స‌హేతుకంగానే ఉన్నాయి.  

‘రాజకీయాలు, భిన్న ధోరణులు పక్కనపెడితే… ఇప్పుడు స్కూళ్లు తెరవడమంటే కరోనాను ఆహ్వానించడమే అని విద్య, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘కరోనా ఇంకా పోలేదు. పండగలొచ్చాయని ఊళ్లకు వెళ్లొద్దు. జాగ్రత్తగా ఉండండి’ అని స్వయంగా ప్రధాని మోదీయే హెచ్చరించారు. ఇప్పటికే యూర్‌పను ‘సెకండ్‌ వేవ్‌’ కుదిపేస్తోంది. అదే పరిస్థితి భారత్‌కూ వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు’

‘కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోక ముందే పిల్లలను పాఠశాలలకు రప్పించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామ నడం కచ్చితంగా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

14 సంవత్సరాల వయస్సులోపు పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ… వారి ద్వారా ఇళ్లలో ఉండే వృద్ధులు, పెద్దలకు వైరస్‌ సోకే అవకాశాలు తోసిపుచ్చలేమని చెబుతున్నారు. అంటే… విద్యార్థులే ‘సూపర్‌ స్ర్పెడర్స్‌’గా మారతారన్న మాట!’

ఇలా సాగింది ఆర్‌కే గారి మాన‌స పుత్రిక ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో క‌రోనాపై క‌థ‌నం. ఎటూ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కా శాలు క‌నుచూపు మేర‌లో లేవ‌ని నిర్ధారించుకున్న ఆర్‌కే …విద్యాసంస్థ‌లు తెర‌వాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై త‌ల్లిదండ్రుల్లో వ్య‌తిరే క‌త  పెంచేందుకు క‌థ‌నాలు స్టార్ట్ చేశార‌ని  అర్థం చేసుకోవ‌చ్చు.  అభిప్రాయాల్ని, పాల‌సీల‌ను మార్చుకోవ‌డంలో ఇంత వ‌ర‌కూ రాజ‌కీయ పార్టీల‌నే చూశాం.

ఇప్పుడు ఆ ధోర‌ణి ఓ మీడియా సంస్థ‌లో చూస్తున్నాం. ఏది ఏమైతేనేం ఇప్ప‌ట్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌ప‌డం అన‌ర్థ‌దాయ‌క‌మ‌ని ఆర్‌కే చెప్ప‌క‌నే చెప్పారు. అందుకే ఇలాంటి వాళ్ల విలువైన అభిప్రాయాల్ని స్వీక‌రించేందుకు ఆహ్వానించాల‌ని నిమ్మ‌గ‌డ్డ‌కు చెప్ప‌డం. 

డెమోక్ర‌టిక్‌, రిప‌బ్లిక్ పార్టీల‌ను ఆహ్వానించ‌లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు … అన్ని విధాలా అండ‌గా నిలిచే ఆర్‌కేను పిల‌వ‌క‌పోవ‌డం ఏంట‌య్యా నిమ్మ‌గ‌డ్డా? 

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం