అబద్ధాలు చెప్పడం, తమ తప్పుల్ని ఎదుటి వాళ్ల నెత్తిన వేయడం, యూటర్న్ తీసుకోవడంలో ఇంత వరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పేరుతో అనేక రికార్డులున్నాయి. ఇప్పుడా రికార్డులను ఆయన తనయుడు లోకేశ్ బద్దలు కొట్టేలా కనిపిస్తున్నారు.
ఆ సమర్థతలో తండ్రిని మించిన తనయుడిగా లోకేశ్ క్రమంగా రూపాంతరం చెందుతున్నారు. ఇంత కాలం లోకేశ్‌కు లోకజ్ఞానమే తెలియదంటూ రకరకాలుగా హేళన చేస్తున్న వాళ్లకు కూడా షాక్ ఇచ్చేలా లోకేశ్ వ్యవహరిస్తున్నారు.
పోలవరం విషయంలో విమర్శలే లోకేశ్ తెలివితేటలకు నిదర్శనమని చెబుతున్నారు. పోలవరానికి సంబంధించి జగన్ సర్కార్‌పై లోకేశ్ విమర్శలేంటో తెలుసుకుందాం.
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.20,398 కోట్లకు కుదిం చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేరు. ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపిస్తే వారి చేతగానితనంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం మిగిల్చారు.
కేంద్రాన్ని నిలదీసి నిధులు తేలేని వారు …చంద్రబాబుపై నిందలేస్తే ప్రజలు నమ్ముతారా? సహాయ , పునరావాసం, ఇతర కాంపొనెంట్స్ కింద పోలవరం ప్రాజెక్ట్ వ్యయం పెరిగినందున అంచనా వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు పెంచాలని చంద్రబాబు కోరితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ’
అబద్ధాలు చెప్పడంలో తండ్రికి ఏ మాత్రం లోకేశ్ తీసిపోరని ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఎన్నికలకు ఏడాది ముందు వరకు అంటే 2018 దాకా టీడీపీ కొనసాగింది. ప్రత్యేక హోదా విషయమై వైసీపీ అధినేత జగన్ ఒత్తిడితో టీడీపీ మంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతి రాజు తమ పదవులకు రాజీనామా చేయక తప్పలేదు.
2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ సమావేశంలో 2013-14 అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లుగా తీర్మానించారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.4,730.71 కోట్లు ఖర్చు చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా , జగన్ తన కేసులను మాఫీ చేసుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేదని ఆరోపించడం లోకేశ్‌కే చెల్లుబాటైంది.
జగన్ కేసులుండడం వల్లే ఇప్పుడు గట్టిగా నిలదీయలేదని కాసేపు అనుకుందాం. మరి నాడు చంద్రబాబు ఎందుకు నిలదీయలేకపోయారో లోకేశ్ సమాధానం చెబుతారా? ప‌్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టారా? .
పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లుగా తీర్మానించిన కేబినెట్‌లో తమ పార్టీ నేతలు కూడా భాగస్వాములనే విషయాన్ని మరిచిపోతే ఎలా? నాడు కేబినెట్‌లో తీర్మానించిన మేరకే కదా ఇప్పుడు ఇస్తామని కేంద్రం చెబుతున్నది! .
ఇందుకు మొట్టమొదటి దోషి టీడీపీనే అనే విషయాన్ని లోకేశ్ మరిచిపోవచ్చు గానీ, జనం గుర్తు పెట్టుకుంటారు. పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకున్నట్టుంది లోకేశ్ వ్యవహారం. అప్పట్లోనే గట్టిగా నిలదీసి ఉంటే … ఆంధ్రాకు ఇప్పుడీ కష్టాలు వచ్చేవా?
రాష్ట్రానికి, పోలవరం ప్రాజెక్టుకు తీరని ద్రోహం చేసిందే గాక, ఇప్పుడు తగదునమ్మానని జగన్ సర్కార్‌పై విమర్శలు చేయడం ఏంటి? ఏం చెప్పినా జనం నమ్ముతారనే నమ్మకమా? కనీసం అంతరాత్మకైనా సమాధానం చెప్పుకోవాలని లేదా లోకేశ్? ఏమిటీ బుకాయింపు మాటలు? అయ్యారే …తండ్రికి మించి మాట్లాడుతున్నావ్ కదయ్యా!