వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎదుటి వాళ్లను అవమానించడం సరదా. తనకు మాత్రమే లాజిక్, వెటకారం చేయడం తెలుసని ఆయన గాఢంగా నమ్ముతుంటారు. పవన్‌కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ తదితరులను ఆయన సినిమాను అడ్డు పెట్టుకుని చెడుగుడు ఆడుకున్నారు. వాళ్లేమీ అనకపోవడంతో ఎవరి జోలికి వెళ్లినా ఇంతే అనే అతి విశ్వాసం వర్మలో పెరిగింది.
తాజాగా ఏపీలో టికెట్ల ధరల నియంత్రణ నిర్ణయం రాజకీయ వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ నిర్ణయంపై అనూహ్యంగా రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. ప్రభుత్వాన్ని, మంత్రుల్ని వివిధ మాధ్యమాల వేదికగా తన మార్క్ పంచ్‌లతో దెప్పి పొడుస్తూ శునకానందం పొందుతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే… ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా కాచుకుని ఉండనే ఉంది. దీంతో మంత్రులపై చెలరేగిపోయేందుకు అవకాశం దొరికిందని వర్మ సంబరపడ్డారు.
ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలియదని వర్మ వ్యంగ్యంగా అన్నారు. దీంతో తాను ఒలంపిక్ పతకం సాధించినంత ఆనందం పొందినట్టున్నారు. కొడాలి నాని ఎవరో తనకు తెలియదన్న వర్మ వ్యాఖ్యలను సదరు మంత్రి దృష్టికి మీడియా తీసుకెళ్లింది. మంత్రి చాలా తెలివిగా, పాయింట్ బ్లాక్‌లో తూటా పేల్చినట్టుగా దిమ్మ తిరిగే జవాబిచ్చారు.
“రాంగోపాల్‌వర్మకు కొడాలి నాని తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. చాలా మందికి ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉందని, దానికి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అతని తెలియదు. ఇప్పుడిప్పుడే కొంత తెలుస్తోంది. ఇక నేను తెలియాలంటే చాలా సమయం పడుతుంది. తెలుసుకుంటారు” అని నాని వ్యాఖ్యానించారు. ఇది కేవలం వర్మకే కాదు సినిమా ఇండస్ట్రీ మొత్తానికే ఆన్సర్.
కొడాలి నాని వ్యాఖ్యల్లోని అంతరార్థం తెలియాల్సిన వాళ్లకు బాగా తెలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్మ అనవసరంగా ఈ వివాదంలోకి ఎంటరై కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నారనే ఆవేదన, ఆగ్రహం టాలీవుడ్ నుంచి వ్యక్తమవుతోంది. సమస్యలను పరిష్కరించుకోవడం కంటే, ప్రభుత్వంపై కామెంట్స్‌తో పైచేయి సాధించాలనే ఆధిపత్య ధోరణి వర్మ వ్యాఖ్యల్లో, ట్వీట్స్ కనిపిస్తోందనే విమర్శలు చిత్ర పరిశ్రమ నుంచి రావడం గమనార్హం.
కానీ అందరితో ఒక ఎత్తు, కొడాలి నాన్‌తో గేమ్ మరో రకంగా ఉంటుందనే సంగతి రెండు రోజులు ఆలస్యంగానైనా వర్మకు తెలిసొచ్చిందని చెబుతున్నారు. కొడాలి నానితో గేమ్ ఆడితే ఎలా ఉంటుందో తాజా నర్మగర్భ వ్యాఖ్యలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, పూర్తి సినిమా వేరే లెవెల్‌లో ఉంటుందని వర్మ తెలుసుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు. లేదంటే వర్మ ఖర్మే అని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.