టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏమైనా మతిపోయిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నోట ప్రతీకార మాటలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోడానికి ఆయన్ను గద్దె ఎక్కించాలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కుప్పం నియోజకవర్గానికి వెళ్లారు. కుప్పం, రామకుప్పం మండలాల్లోని 8 గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తన స్థాయిని, అనుభవాన్ని మరిచి మాట్లాడారు. అక్కసుతో బాబు ఎంతగా రగిలిపోతున్నారో ఆయన హెచ్చరికలే ప్రతిబింబిస్తున్నాయి.
‘వైసీపీ నాయకులు మా పార్టీ కార్యకర్తలను చాలారకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తాను. ఒకటీ రెండు కాదు.. 20 సార్లు రెట్టింపుగా హింసిస్తాను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేస్తారో చెప్పి వుంటే బాబుకు గౌరవం తెచ్చేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అందుకు విరుద్ధంగా రెండేళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రెట్లు హింసిస్తానని చంద్రబాబు హెచ్చరించడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రతీకారాలు తీర్చుకునేందుకు ప్రజలు అధికారం కట్టబెట్టాలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
తాను అధికారంలోకి వస్తే ఫలానా సమస్య పరిష్కరిస్తానని బాబు మాట్లాడకపోవడంపై పౌరసమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేవలం ప్రతీకారం తీర్చుకోడానికే అధికారం కావాలని చంద్రబాబు అడుగుతున్నారా? అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇలాగైతే ఏపీ రాజకీయాలు ఎక్కడికి వెళ్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.