ఎల్లో మీడియాతో వైసీపీ ఘర్షణ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబునాయుడి నాయకత్వాన్ని కాపాడుకునేందుకు ఎల్లో మీడియా జగన్ను బద్నాం చేయడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా పని చేస్తోంది. ఈ క్రమంలో అన్ని నైతిక విలువలను వదిలేసి దిగంబరంగా నిలిచిందనేది బహిరంగ రహస్యమే. ఎల్లో మీడియాకు సంబంధించి ఈనాడు విషయంలో వైసీపీ కొంత వరకూ లిబరల్గా ఉంటోంది.
అయితే నిత్యావసర వస్తువుల ధరల విషయంలో ఈనాడు తప్పుడు కథనం ఏపీ అధికార పార్టీ వైసీపీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో ఈనాడు, ఆ మీడియా సంస్థ అధినేత రామోజీరావు, టీడీపీ అధినేత చంద్రబాబులను ఊచకోత కోశారు. తప్పుడు కథనాలు రాస్తున్న, చూపుతున్న ఎల్లో మీడియాపై కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇప్పటికే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ-5 మీడియా సంస్థలను వైసీపీ అధికారికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. వీటికి తోడు అదనంగా ఈనాడు, ఈటీవీలను కూడా నిషేధిస్తున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. ఇకపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులెవరూ కూడా వైసీపీ కార్యాలయాలు, కార్యకలాపాలకు ఈనాడు, ఈటీవీ, అలాగే టీవీ-5, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులను ఆహ్వానించొద్దని తేల్చి చెప్పారు.
అయితే ఓ ప్రశ్నకు మంత్రి కొడాలి నాని సమాధానం చెప్పాల్సి వుంది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ-5 సంస్థలకు జగన్ ప్రభుత్వం ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం లేదు. కానీ ఎల్లో మీడియాకు పెద్దన్న అయిన ఈనాడుకు మాత్రం వాణిజ్య ప్రకటనలు ఇస్తోంది. ఇకపై ఈనాడు, ఈటీవీలకు వాణిజ్య ప్రకటనలను కూడా ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఈ పని చేస్తేనే రామోజీ నేతృత్వంలోని మీడియా సంస్థను నిషేధించినట్టు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా చేయలేనప్పుడు ఈనాడుపై నిషేధం విధించడం వృథా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై కొడాలి వివరణ ఏంటో!