జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు మనసు పారేసుకున్నారు. తాను పవన్‌ను ప్రేమిస్తున్నా, అటు వైపు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదనే ఆవేదన చెందారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు తన మనసులోని ప్రేమను బయట పెట్టుకున్నారు. పొత్తు కోసం తాము సిద్ధంగా ఉన్నామని, ఇక తేల్చాల్సింది పవన్‌కల్యాణే అని బహిరంగంగానే చంద్రబాబు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి వెళ్లారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలం వీర్నమలతాండాలో రోడ్ షో, అనంతరం బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనతో పొత్తు ప్రస్తావన వచ్చింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు కదా అని టీడీపీ కార్యకర్త చంద్రబాబును ప్రశ్నించారు.
కార్యకర్త ప్రశ్నపై బాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్‌కు నేరుగానే పొత్తు హస్తం అందించడం గమనార్హం. బాబు ఏమన్నారంటే…
‘ఇద్దరు ప్రేమించుకుంటే అది పెళ్లి వరకు వెళ్తుంది. వన్ సైడ్ లవ్ పనికిరాదు కదా! మనం జనసేనను ప్రేమిస్తున్నాం. జనసేన కూడా కలిసి రావాలి కదా’ అని బాబు తన మనసులో మాటను బయట పెట్టారు. ఇటీవల జనసేనతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారంపై మీడియా ప్రశ్నించగా ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పనని బాబు డ్రామాలాడిన సంగతి తెలిసిందే. మూడునాలుగు రోజులకే జనసేనతో పొత్తుపై బాబు మనసులో ఏముందో బయట పడింది.
బీజేపీతో జనసేనాని పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. జనసేనతో పొత్తు వుంటే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలవమనే భయం చంద్రబాబులో ఉందనే ప్రచారానికి తాజాగా ఆయన వ్యాఖ్యలు మరింత బలం కలిగిస్తున్నాయి. తనపై బహిరంగంగానే ప్రేమను వెల్లడించిన తర్వాత పవన్‌కల్యాణ్ స్పందన ఏంటో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.