కాలం పరుగెడుతోంది. మూడు దశాబ్దాల క్రితం దూరదర్శన్ ఛానల్ ఒక్కటే చూసి మురిసిన కళ్లు ఇప్పుడా ఛానల్ కోసం వెతకట్లేదు.
శాటిలైట్ ఛానల్స్ విప్లవంలో డైలీ సీరియల్స్, నిరంతర వార్తా కథనాలకి అలవాటు పడిపోయాం. రెండున్నర దశాబ్దాల వరకు ఆ కథ బాగానే నడిచింది.
కానీ క్రమంగా ఇంటర్నెట్ విప్లవం వచ్చింది. డేటా స్పీడ్ పెరిగింది. అంబానీల పుణ్యమా అని ధనిక-పేద అనే తేడా లేకుండా ప్రతి పౌరుడి చేతిలోకీ సెల్ఫోన్ వచ్చింది. అది కాస్తా “స్మార్ట్” గా మారింది.
తర్వాత జియో మాయ దేశం మొత్తాన్ని కమ్మేసింది. ఆ జియో మొబైల్ నుంచి ఇంట్లో టీవీకి పాకింది. స్మార్ట్ టీవీ కొనక్కర్లేకుండా ఒక సెటప్ బాక్సుతో ఉన్న టీవీనే స్మార్ట్ గా మార్చేసింది జియో.
ఇప్పుడు సగటు మధ్యతరగతి వ్యక్తి ఆలోచించేది ఒక్కటే. రూ 399 (ఒక మల్టీ ప్లెక్సు సినిమా టికెట్ ధరంత) కడితే అంతులేనంత వినోదం నెలంతా కంటి ముందుంటుంది. దీనికి తోడు వైఫై ఇంటెర్నెట్ సౌకర్యం కూడా ఉంటుంది.
చిన్న మొబైల్లో కాకుండా టీవీలోనే యూట్యూబ్ చూసుకోవచ్చు. అనేక ఓటీటీల్లో సినిమాలు చూసేయొచ్చు. లైవ్ క్రికిట్, ఫుట్ బాల్ మ్యాచెస్ చూసేయొచ్చు. ఒకటేమిటి సమస్తం జియోలో ఉందిప్పుడు.
స్తోమతని బట్టి మరిన్ని ఓటీటీలను కలుపుకుంటూ రూ 999, రూ 1499 నెలకి కట్టేవాళ్లు కూడా ఉన్నారు. వీళ్లకి అదనంగా ల్యాంద్ ళైన్ నంబర్ కూడా ఇదే ప్యాకేజులో ఫ్రీగా లభిస్తోంది.
ఎలా చూసుకున్నా దేశంలో అధిక శాతం మంది దీనికి అలవాటు పడుతున్నారు.
అధిక శాతం మంది ప్రజలు చూసేవి ప్రధానంగా రెండే. ఒకటి – నిరంతర వార్తా ఛానల్స్, రెండు- టీవీ సీరియల్స్. ఇంట్లో జియో కనెక్షన్ ఉంటే ఆ సీరియల్సన్నీ హట్ స్టార్ లో వచ్చేస్తున్నాయి. ఇక వార్తలన్నీ యూట్యూబులో కోరుకున్న లైవ్ ఛానల్లో చూసుకోవచ్చు.
ఈ లెక్కన ఇక శాటిలైట్ చానల్స్ ఎలా నడుస్తాయి? ఇప్పటికే టీఆర్పీలు భయంకరంగా తగ్గాయి గతంతో పోలిస్తే. పైగా ఖర్చుకి, ఆదాయానికి పొంతన ఉండట్లేదు.
పై స్థాయిలో ఉన్న ఒకటి రెండు ఛానల్స్ ని మినహాయిస్తే, సగటు న్యూస్ ఛానల్ ఖర్చు నెలకి కోటి రూపాయలుంటే, ఆదాయం పదిలక్షలు కూడా రావట్లేదంటే అతిశయోక్తి కాదు.
మరెలా నడుపుతున్నారని అడగొచ్చు.
కొన్ని పార్టీల సౌజన్యం, ఆయా పార్టీల వెనుల వెనుక ఉన్న ఫండర్స్ ద్వారానే సాధ్యమౌతోంది. అందుకే నేడు వార్తలు చెప్పే మీడియా ఛానల్స్ అన్నీ ఏదో ఒక పార్టీకి భజన చేస్తూ బతుకున్నాయి. స్వతఃసిద్ధంగా సంపాదించుకోగలిగే శక్తి వీటికి లేదు కనుక.
ఇక ఆ ఫండింగ్ మాత్రం ఎన్నాళ్లొస్తుంది? జనం చూస్తున్నంత సేపే. టీఆర్పీలు రాకపోతే జనం చూడట్లేదని వాళ్లూ వెనక్కు తగ్గుతారు.
యూట్యూబులో ఛానల్ రన్ చేయడానికి ఇంత మంది మార్బలం, భారీ స్టూడియోలు అవసరం ఉండదు. ఒక చిన్న గదిలో కూర్చుని వార్తలు చదువుకోవచ్చు. ఎక్కడి రిపోర్టర్లక్కడ ఆయా ఊళ్లల్లో ఒక గదిలాంటి ఆఫీసులో ఉంటూ పని చేసుకుంటే సరిపోతుంది. వాళ్ల రిపోర్ట్స్ ని కూడా మొబైల్లో లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవడమే.
అప్పుడు ఖర్చు తగ్గుతుంది, స్టాఫ్ కూడా తగ్గుతారు. ఎవరి పనైతే తెర మీద కనిపిస్తుందో వాళ్లు మాత్రమే మిగులుతారు.
ఇంత మార్పొచ్చినా కూడా పార్టీల ఫండింగ్ మీద బతకాల్సిందే. ఎందుకంటే ఎంత ఖర్చు తగ్గించుకున్నా యూట్యూబ్ మోడల్లో బ్రేక్-ఈవెన్ చేసుకోవడం చాలా కష్టం.
అంటే శాటిలైట్ ఛానల్స్ అన్నీ కేవలం యూట్యూబ్ ఛానల్స్ గా మనుగడ కొనసాగించే రోజులు దగ్గర పడ్డాయి. శాటిలైట్ ఛానల్స్ కి అంతిమ ఘడియలు దాపురించాయి. అంతా కాలమహిమ.
– శ్రీనివాసమూర్తి