సజ్జల రామకృష్ణారెడ్డి ఎదుట ఇప్పుడు తాను కలగన్న మరొక అవకాశం ఊరిస్తూ నిలుచున్నది. ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకుంటారా? లేదా, ఇప్పుడున్న వైభవంతోనే సరిపెట్టుకుంటారా? అనేది వైసీపీ అంతర్గత రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ! ఇంతకీ విషయం ఏంటి? ఆయన ముందున్న అవకాశం ఏంటి? ఇప్పుడున్న వైభవం ఏంటి? అన్నీ తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.
ఈ ఏడాదిలో రాజ్యసభలో మొత్తం 77 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కాబోతోంది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీల పదవీకాలం కూడా ముగుస్తుంది. వారిలో వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, బీజేపీకి చెందిన సురేష్ ప్రభు, అప్పట్లో తెలుగుదేశానికి చెందిన వారే అయినా ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ ఉన్నారు.
ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో ఉన్న బలాబలాల్ని బట్టి మాత్రమే.. కొత్త ఎంపీలు నలుగురూ తిరిగి రాజ్యసభలో కాలుపెట్టగలరు కాబట్టి.. అచ్చంగా నాలుగూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కే దక్కుతాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి మాత్రం పదవి కొనసాగింపు గ్యారంటీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కొత్తగా ఎవరిని రాజ్యసభకు పంపుతారు.. ఎవరిని ఆ అదృష్టం వరిస్తుంది? అనేది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ.
సరిగ్గా ఇక్కడే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి, తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగి, రాజకీయనాయకుడిగా రూపాంతరం చెంది, ప్రస్తుతం సలహాదారు హోదాలో ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డికి రాజ్యసభ ఎంపీ కావడం అనేది కల. వైసీపీ అధికారంలోకి రాకముందునుంచి కూడా ఆయన రాజ్యసభ అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. పార్టీలో కూడా కీలకంగా ఉంటూ వచ్చారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయనకు తొలివిడతలోనే రాజ్యసభ ఎంపీ పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అయిన సజ్జలకు కేవలం ప్రభుత్వ సలహాదారు పదవి మాత్రమే లభించింది. రకరకాల సమీకరణాల నేపథ్యంలో పార్టీకి దక్కేపదవుల్లో ఒకటి సజ్జలకు కేటాయించలేకపోయారు జగన్! ఇప్పుడు మళ్లీ నాలుగు సీట్లు దక్కుతున్నాయి. కొత్తగా ముగ్గురికి అవకాశం వస్తోంది. ఈ నేపథ్యంలో.. సజ్జల రామకృష్ణారెడ్డి .. తన చిరకాలస్వప్నం నెరవేర్చుకుని, రాజ్యసభ ఎంపీ అవుతారా అనేది కీలకమైన చర్చ.
అయితే.. ఆయన పార్టీ ఎంపీలకంటె కూడా ప్రస్తుతం ఎంతో కీలకమైన హోదాను, వైభవాన్ని అనుభవిస్తున్నారు. పేరుకు ప్రభుత్వ సలహాదారు మాత్రమే అయినప్పటికీ.. అంతకంటె చాలా కీలకమైన ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోదగిన వ్యవహారాలు అన్నీ సజ్జల చేతులమీదుగానే చక్కబడుతున్నాయి. ఆయన ప్రాధాన్యం అపరిమితంగా ఉంది. మంత్రులందరికంటె కూడా కీలకమైన వ్యక్తిగా ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు.
ఇంత వైభవాన్ని అనుభవిస్తుండగా.. దీన్నంతా వదులుకుని.. ఎంతగా తన కల అయితే మాత్రం.. రాజ్యసభ ఎంపీ పదవిని ఎంచుకుంటారా? అనేది పలువురిని తొలుస్తున్న ప్రశ్న. అందుకే.. ‘సజ్జలగారూ.. ఇది చాలా.. అది కావాలా?’ అని సరదాగా అనుకుంటున్నారు.