మా డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. మేము ఇచ్చే ప్రతీ పైసాతోనే సర్కార్ కదులుతోంది. ఇదీ బీజేపీ నేతలు మీడియా ముందు చెప్పే మాటలు. ఇంతకీ మా డబ్బులు అంటున్నారు. అవి ఎక్కడ నుంచి వచ్చాయి మాస్టారూ అంటే జవాబు చెప్పలేరేమో. కేంద్రం డబ్బులు ఇస్తోంది. మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారు అని లేటెస్ట్ గా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది మీకు బాగా రివాజుగా మారిపోయింది. ఎంతసేపూ మా పధకాల మీద మీ స్టాంపులు కొట్టి ప్రచారం చేసుకోవడమేనా. ఇదేమి దుర్నీతి అంటూ వైసీపీ నేతల మీద పడి గర్జిస్తున్నారు. కేంద్రం కుప్పలు తెప్పలుగా ఏపీకి నిధులిస్తోంది. అనేక పధకాలను తెచ్చి పెడుతోంది. అయినా కూడా ఏపీ ఎత్తిగిల్లడంలేదు అంటూ ఎత్తిపొడుస్తున్నారు ఎంపీగారు.
సరే అవన్నీ నిజమే అనుకున్నా ఏపీకి కేంద్రం నిధులు ఎన్నో వేల కోట్లు ఇస్తున్నా అసలు కేంద్రానికి ఆ డబ్బు ఎక్కడిది. ఈ మధ్యనే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఒక మాట అన్నారు. కేంద్రానికి ప్రత్యేక ప్రాదేశికం అంటూ వేరే ఉందా అని. దాని కంటే కొన్ని దశాబ్దాల క్రితమే అన్న ఎన్టీయార్ కూడా చెప్పారు. కేంద్రం ఒక మిధ్య. రాష్ట్రాలే నిజం అని.
మరి రాష్ట్రాలలో ఉన్న ప్రజలు పన్నులు కడితే అవన్నీ నిధులుగా పోగు అయితే కేంద్ర నిధులు అయ్యాయి. అంటే రాష్ట్రాల నుంచి కలెక్ట్ చేసినది అవే రాష్ట్రాలకు ఇస్తూ మా డబ్బులు అనడంతో ధర్మం ఏమైనా ఉందా అంటే కమలనాధులు జవాబు చెప్పలేరేమో.
మా పధకాలు అంటున్నారు, మరి ఏ పధకం అయినా అమలు చేయాల్సింది రాష్ట్రాలే కదా. కేంద్రానికి మెకానిజం ఉందా లేదా అన్నది పక్కన పెడితే రాష్ట్రాలే అన్నీ చేయాలి కదా. కేంద్రం ఇళ్ళు కట్టించింది అంటున్నారు. వాటికి భూములు ఇచ్చేది రాష్ట్రమే కదా. కేంద్రం జాతీయ సంస్థలు ఇచ్చింది అంటే భూములు ఎక్కడ నుంచి వస్తాయి. మరి ఆ విధంగా చూసుకుంటే అన్నీ మావే అంతా మేమే అన్న రాజకీయ డబాయింపు పనికివస్తుందా కాషాయం నేతలూ అంటే ఆన్సర్ ఉంటుందా.
ఇక కేంద్ర పధకాల అమలు తీరుతెన్నులను గమనించడానికి జీవీఎల్ లాంటి ఎంపీలను కేంద్రం నియమించింది. అది మంచిదే. కానీ మా పధకాలు, మా డబ్బులు అని డప్పు కొట్టుకుని రాజకీయం చేద్దామనుకుంటేనే చికాకేమో. సరే మాకే ఓటేయండి అన్నీ తెచ్చామంటున్న బీజేపీ పెద్దలు ప్రత్యేక హోదా ఇచ్చేసి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసి కొత్తగా కేంద్ర సంస్థలను ఏర్పాటు చేస్తే మెచ్చి శాలువలు కప్పరా.
ఇది కదా రాజమార్గం. కానీ ఎంతసేపూ స్టిక్కర్ల రాజకీయం అంటూ వైసీపీ మీద విమర్శలు చేయడంతోనే బీజేపీ నేతలకు సరిపోతుందాయే. మరి ఈ తరహా పాలిటిక్స్ కి అంతూ పొంతూ ఉండదేమో. ఇంతకీ అంతా మేమే అని బీజేపీ అంటే ఏపీ జనాలు నమ్ముతున్నారా.