బంగార్రాజు వేదిక మీద హీరో నాగ్ చేసిన కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడను అంటూ నాగ్ చేసిన కామెంట్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
అదే సమయంలో గతంలో ఓసారి సినిమా వేదిక మీదే నాగ్ చేసిన ప్రసంగాన్ని వెలికి తీసి మరీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు ఈ రోజు రాజమండ్రిలో సమావేశమై నాగ్ వ్యాఖ్యలను ఖండించినట్లు తెలుస్తోంది.
సినిమా టికెట్ రేట్ల విషయంలో తన అభిప్రాయాలను నాగ్ మరింత క్లారిటీగా చెప్పాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో కాకినాడలో సమావేశమై ఈ విషయం చర్చించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించినట్లు బోగట్టా.
ఒకవేళ నాగ్ వైపు నుంచి స్పందన రాకపోతే, థియేటర్లు మూసి వేసి నిరసన తెలపాలని కొందరు ఎగ్జిబిటర్లు సమావేశంలో సూచించినట్లు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే బంగార్రాజు సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ది తూర్పుగోదావరి జిల్లానే పైగా ఆయన సోదరుడు కన్నబాబు ఆ జిల్లా మంత్రి కూడా. మరి ఈ వ్యవహారం ఎవరు ఎలా డీల్ చేస్తారో చూడాలి.