ఢిల్లీలో లోకేశ్ ఏం చేస్తున్న‌ట్టు?

చంద్ర‌బాబు అరెస్ట్‌తో ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్ తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న త‌న తండ్రి యోగ‌క్షేమాల‌ను ఒకట్రెండు రోజులు…

చంద్ర‌బాబు అరెస్ట్‌తో ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్ తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న త‌న తండ్రి యోగ‌క్షేమాల‌ను ఒకట్రెండు రోజులు బ‌య‌టి నుంచే ప‌ర్య‌వేక్షించారు. ఆ త‌ర్వాత లోకేశ్ త‌న మ‌కాంను ఢిల్లీకి మార్చారు. త‌న తండ్రి అత్యంత నీతిప‌రుడ‌ని జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు.

ఢిల్లీలో ఎన్డీఏ కూట‌మిలోని రాజ‌కీయ ప‌క్షాలు ఆయ‌న్ను అస‌లు ప‌ట్టించుకోలేదు. గ‌తంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా ప‌ట్టించుకోని ప‌రిస్థితిని చూశాం. ఇండియా కూట‌మిలోని కొన్ని రాజ‌కీయ ప‌క్షాలు బాబుకు మ‌ద్ద‌తుగా మొక్కుబ‌డిగా సంఘీభావం తెలిపాయి. ఢిల్లీలో లోకేశ్ వుండి చేసేది కూడా ఏమీ లేదు. అయితే ఆయ‌న ఢిల్లీని విడిచిపెట్టి రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంట‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

త‌న‌ను అరెస్ట్ చేస్తార‌నే భ‌యంతో ఢిల్లీలోనే వుండిపోయారా? అనే చ‌ర్చ లేక‌పోలేదు. ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో త‌న పార్టీ ఎంపీల‌తో క‌లిసి ఆయ‌న ధ‌ర్నాలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం పూర్త‌యిన త‌ర్వాత టైమ్ పాస్ ఎలా చేయాల‌నేది ఒక ప్ర‌శ్న‌. బీజేపీ నేత‌లెవ‌రూ క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు ఇత‌ర పార్టీలేవీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేదు.

ఇవాళ్టి ధ‌ర్నాకు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఒక్క‌రే మ‌ద్ద‌తుగా నిలిచారు. దేశంలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడైన చంద్ర‌బాబుకు ఇలాంటి స‌హాయ నిరాక‌ర‌ణ వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌లు ఊహించ‌లేదు. త‌న తండ్రికి జాతీయ స్థాయిలో ఏ మాత్రం ప‌లుకుబ‌డి వుందో లోకేశ్‌కు ప్ర‌త్య‌క్షంగా అనుభ‌వంలోకి వ‌చ్చింది. దీంతో ఆయ‌న నిరాశ‌కు గుర‌య్యార‌ని స‌మాచారం.