
తెలుగు రాష్ట్రాల్లో రెండు పత్రికా గురివిందలున్నాయి. ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి. ఈ గింజలు తమ నలుపుని మరిచి, నచ్చని వాళ్ల మీద బురద వేస్తుంటాయి. ఆ బురద పేరు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ. వీళ్లకి మూల బిందువు చంద్రబాబు.
ఆంధ్రజ్యోతికి గాడ్ ఫాదర్ చంద్రబాబు. ఈనాడు చంద్రబాబుకే గాడ్ ఫాదర్. ఈ గాడ్ ఫాదర్ రాజకీయంలో ఈనాడు ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకుంది. జ్యోతి చిన్న సంస్థానం స్థాయిలోనే వుంది. ఒకరు పచ్చళ్లతో ప్రారంభమైతే, ఇంకొకరు కిరసనాయిల్. బాబేమో రెండెకరాలు. వీళ్లు ముగ్గురు అవినీతి గురించి అనర్గళంగా మాట్లాడుతూ ప్రజాక్షేమాన్ని కోరుతూ వుంటారు.
ఈ గురివిందలకి కష్టకాలం వచ్చింది. ఏం చెప్పినా నమ్మే కాలం కాదు. సోషల్ మీడియాలో నిజాలు బయటపడతాయి. తాము చక్రం తిప్పే టైంలో ఎన్టీఆర్‌ని దించేసి చంద్రబాబుని కూచోపెట్టారు. దాని పేరు ప్రజాస్వామ్య పరిరక్షణ. నాదెండ్ల చేస్తే వెన్నుపోటు, బాబు చేస్తే ప్రజాక్షేమం. రామోజీ సొంత ప్రయోజనాలన్నీ ప్రజా క్షేమం అకౌంట్‌లోకి వెళ్తాయి. జనం డబ్బు మార్గదర్శిలో చట్ట విరుద్ధంగా వాడుకుని, తాను ఎవరికీ ఎగ్గొట్టలేదు, నిజాయతీపరుడినని వాదించగల చాతుర్యం రామోజీది.
చంద్రబాబు ఓటుకి నోటులో దొరికినా, వైసీపీ ఎమ్మెల్యేలని కొన్నా ఈ గురివిందల దృష్టిలో తప్పు కాదు. బాబు చెమటోడ్చి రెండెకరాల నుంచి ప్రైవేట్ విమానాల్లో తిరిగే స్థాయికి వచ్చాడని వీళ్ల నమ్మకం. అలాంటి బాబు జైల్లో వున్నాడంటే అది గ్యారెంటీగా రాజకీయ కక్షే కదా! జగన్ జైలుకి వెళితే మాత్రం ఎ1, శుక్రవారం సంతకాలు అని హేళన చేస్తారు. అది రాజకీయ కక్ష అని ఒక్కరోజు కూడా రాయలేదు.
వీళ్ల దృష్టిలో చంద్రబాబు విజనరీ, దార్శనికుడు. ఆంధ్రప్రదేశ్ తలరాతని మార్చగల నాయకుడు. మరి వైజాగ్ లాంటి పెద్ద నగరం కళ్ల ముందు వుంటే, అమరావతిని కడతానని కోట్ల రూపాయలు తగలబెడుతున్నప్పుడు ఇదంతా ఎందుకని వీళ్లు అడగలేదు. జవాబుదారీ జర్నలిజం అంటే ఇదే. అమరావతిలో వీళ్లు, వీళ్లకి కావాల్సిన వాళ్లు బినామీ పేర్లతో భూములు కొని బాగుపడడం జనానికి చాలా అవసరం కదా!
ఊరందరికీ నీతులు చెప్పే ఈ గురివిందలు, బినామీ పేర్లతో కంపెనీలని సృష్టించి తమ ఉద్యోగుల్ని అందులో చూపించి వాళ్ల కడుపు కొడతాయి. కరోనాలో రూపాయి నష్టం వచ్చిందని అనేక మంది ఉద్యోగుల్ని తొలగిస్తాయి. వేజ్‌బోర్డు నివేదికల్ని డస్ట్‌బిన్‌లో వేస్తాయి.
రాజమండ్రి జైలు అధికారి సెలవుపై వెళితే దానికి కూడా రాజకీయం పులమగల సమర్థులు. బాబుకి వేడినీళ్లు లేవని గగ్గోలు పెడుతున్న వాళ్లు, ఒక్కరోజైనా ఖైదీల దుస్థితి, జైలు సంస్కరణల గురించి పత్రికల్లో పోరాటం చేశారా?
40 ఏళ్ల పార్టీలో బాబు తర్వాత లోకేశ్ తప్ప నాయకులే లేరా? అని అడగలేని జర్నలిజం వీళ్లది. బాబు దగ్గర జీతానికి పని చేస్తూ ఈ గురివిందలు ప్రజాస్వామ్యం గురించి పేజీల కొద్ది వార్తలేస్తాయి.
జగన్ వీళ్లకి లొంగడు కాబట్టి , అతను ప్రజాద్రోహి, నియంత, సైకో. ఈ గురివిందల్ని జనం గుర్తు పట్టారు. గుర్తు పట్టారని గురివిందలకి కూడా తెలుసు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా