ఫ్యామిలీ కథలకు పెట్టింది పేరు త్రివిక్రమ్. ఇక నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పక్కింటబ్బాయి లుక్స్ తో, కుటుంబ కథా చిత్రాలకు అతికినట్టు సరిపోతాడు. మరి వీళ్లిద్దరూ ఎందుకు కలవలేదు? కలిసి ఎందుకు సినిమా చేయలేదు?
ఇదే ప్రశ్న నానికి ఎదురైంది. దసరా సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న నానికి, ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. త్రివిక్రమ్, తన కోసం కథ రాస్తున్నాడనేది నాని ఇచ్చిన ఆన్సర్. ఇంకా ఏమన్నాడంటే..
“త్రివిక్రమ్ నాకోసం కథ రాస్తున్నారని నేను అనుకుంటున్నాను. నాతో సినిమా చేస్తానని ఓ సందర్భంలో త్రివిక్రమ్ అన్నారు కూడా. మేమిద్దరం కలిస్తే గ్రేట్ కాంబినేషన్ అవుతుంది. ఒక టైమ్ లో మల్టీస్టారర్ చేద్దామని కూడా అనుకున్నాం. అయితే ఇప్పటివరకు కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఒకవేళ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే మాత్రం అది మెమొరబుల్ మూవీ అవుతుంది.”
ఇలా త్రివిక్రమ్ తో సినిమాపై స్పందించాడు నాని. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశం ఎప్పుడొస్తుందా అని తను కూడా ఎదురుచూస్తున్నానని తెలిపిన నాని.. త్రివిక్రమ్ తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపాడు.