మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సరిచూస్తున్నాం, ఓటీపీ చెప్పండి అంటూ బ్యాంక్ ల నుంచి ఫోన్లు చేస్తున్నట్టు మోసగాళ్లు కస్టమర్లను బురిడీ కొట్టించడం చూస్తూనే ఉన్నాం. విదేశాల నుంచి మీకు కాస్ట్ లీ గిఫ్ట్ వచ్చింది, కస్టమ్స్ దగ్గర ఆగిపోయింది, విడిపించుకోడానికి డబ్బులు చెల్లించండి అంటూ మోసం చేసేవారి గురించీ విన్నాం. కానీ గుర్గావ్ లోని ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది, ఆమెను తికమక పెట్టి ఏకంగా 20లక్షల రూపాయలు కాజేశారు మోసగాళ్లు. ఆ మోసం గురించి తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెట్టడం ఖాయం.
గుర్గావ్ కి చెందిన ఓ మహిళకు కొరియర్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్టుగా ఓ మోసగాడు కాల్ కలిపాడు. ఆమెకు వచ్చిన ఓ పార్శిల్ కస్టమ్స్ అధికారుల దగ్గర ఆగిపోయిందని, అందులో అనుమానిత వస్తువులున్నాయని, ముంబై పోలీసులు కేసు నమోదు చేశారంటూ హడలగొట్టాడు. ముంబై పోలీసులు మీతో మాట్లాడతారంటూ కాన్ఫరెన్స్ కలిపాడు.
ఇక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాల సింగ్ రాజ్ పుత్ అంటూ అవతలి వ్యక్తి సదరు యువతిని మరింత బెదరగొట్టాడు. అతడితో పాటు ఇన్ స్పెక్టర్ బన్సల్ అంటూ మరో వ్యక్తి మాట్లాడాడు. ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ నుంచి మాట్లాడుతున్నామంటూ వారు సదరు మహిళను బెదిరించారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది.
మీకు వచ్చిన పార్శిల్ వ్యవహారంతోపాటు.. ముంబైలో మీకున్న మూడు బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఆ మహిళను బెదిరించారు మోసగాళ్లు. అసలు నాకు ముంబైలో బ్యాంక్ అకౌంట్లేవీ లేవని చెప్పింది ఆ మహిళ. అది నిరూపించుకోవాలంటే, తమ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కి సహకరించాలన్నారు.
4,99,999 రూపాయలు తమ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేయాలన్నారు. పోలీసులంటే భయపడి ఆ మహిళ అడిగిన మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలు చెప్పి 6 విడతల్లో 20,37,194 రూపాయలు బదిలీ చేయించుకున్నారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి.. నిజమైన పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటివరకూ మన బలహీనతలను ఆసరాగా చేసుకుని తెలివిగా బురిడీ కొట్టించే ఆన్ లైన్ మోసగాళ్లు, ఇప్పుడు బెదిరించే ప్లాన్లు వేస్తున్నారు. పోలీసులమంటూ ఫోన్లు చేసి మరీ డబ్బు దండుకుంటున్నారు. తప్పు చేసినవాళ్లు తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉంటున్నారు, అమాయకులు మాత్రం అంతా పోయాక చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.