తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు అంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ ఉద్యమం నడపడానికి నిధుల సేకరణకు జోలె పడుతున్నారు. ఏదైనా ఉద్యమం అంటే.. దాని ఆవశ్యకతను వివరిస్తూ సాగడం నాయకుడి లక్షణం. ఆ ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలకాలి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఉద్యమం అంటే నిధుల సేకరణ అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు!
ఉద్యమానికి నిధుల సేకరణకూ సంబంధం ఏమిటో తెలుగుదేశం అధినేతకే తెలియాలి. నిధులు సేకరిస్తే ఉద్యమం సాగుతుందని అనుకోవడం చంద్రబాబు నాయుడు అందరినీ భ్రమింపజేసే ప్రయత్నం అని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. తమ కులస్తులు ఎక్కువగా ఉన్న చోట.. చంద్రబాబు నాయుడు రాజధాని ఉద్యమానికి నిధుల సేకరణ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం.
ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో భారీ ర్యాలీలు సాగుతూ ఉన్నాయి. ఆదివారం రోజునే మూడు రాజధానులకు అనుకూలంగా అక్కడ మూడు ర్యాలీలు సాగడం గమనార్హం.
ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి మెజారిటీ అక్కడ బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. రెండో రౌండ్ లో అయితే చంద్రబాబు నాయుడు పూర్తిగా వెనుకబడిపోయారు. అయితే ఇప్పటికీ ఆయన కృష్ణా జిల్లా అల్లుడిగానే వ్యవహరిస్తూ ఉన్న వైనం స్పష్టం అవుతోంది. ఇటీవలే తమ నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కనపడటం లేదని కుప్పంలో కంప్లైంట్ కూడా నమోదు అయ్యింది.
ఇక మూడు రాజధానులకు అనుకూలంగా అక్కడ భారీ ర్యాలీలు సాగుతున్నాయి. ఇలా కుప్పంపై చంద్రబాబు నాయుడి పట్టు పూర్తిగా పోయిందని స్పష్టం అవుతోంది. రాయలసీమ వ్యాప్తంగానే ప్రజలు టీడీపీని పూర్తిగా తిరస్కరించారు. ప్రస్తుత పరిణామాలతో టీడీపీ అక్కడ మరింతగా దెబ్బతింటున్న వైనం స్పష్టం అవుతోంది.