చిత్రం: రంగమార్తాండ
రేటింగ్: 3/5
తారాగణం: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, జయలలిత, అనసూయ, ఆదర్శ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, భద్రం తదితరులు
కెమెరా: రాజ్ కె నల్లి
మాటలు: ఆకెళ్ల శివప్రసాద్
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: కాలిపి మధు, ఎస్ వెంకట రెడ్డి
దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేదీ: 22 మార్చ్ 2023
కృష్ణవంశీ ఒక తరాన్ని ఊపు ఊపిన దర్శకుడు. తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించున్న దర్శకుడు. ఇంచుమించు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఒక సినిమాతో ముందుకొచ్చాడు. అయితే ఈ సారి ఒక రీమేక్ తో. మరాఠీలో “నటసమ్రాట్” పేరుతో విడుదలై హిట్టైన చిత్రమిది. అక్కడ నానాపటేకర్ నటవిశ్వరూపం చూపిస్తే ఇక్కడ ఆ పని ప్రకాశ్ రాజ్ కి పడింది.
ఇంతకీ ఈ సినిమాకి విడుదలకి ముందే చాలా షోలు వేసారు సినీరంగ ప్రముఖులకి. చూసినవాళ్లంతా ఆకాశానికెత్తేసారు. నిజంగా అంతుందా? తెలుసుకుందాం!
ఇంతకీ ఇది ఎవరూ ఊహించలేని, ఎప్పుడూ చూడని కథైతే కాదు. ఇలాంటివి భారతీయభాషల్లో గత దశాబ్దాల్లో అనేకం వచ్చాయి. తెలుగులో కూడా చాలా వచ్చాయి.
ఉన్నదంతా సంతానానికి రాసిచ్చేసి ప్రశాంతంగా వాళ్ల నీడలో బతుకుదామనుకున్న ఆత్మాభిమానంగల ఒక నటుడు ఎదుర్కునే కష్టాలు, పడే బాధలు ఈ సినిమాలోని సారాంశం.
నిజానికి అసలీ సినిమా తెలుగులోకి రీమేక్ చెయ్యాలన్న ఆలోచనే సాహసం. ఎందుకంటే ఇప్పటికే టీవీ సీరియల్స్ లో ఇలాంటి కష్టాల కథలు, కన్నెళ్ల వ్యథలు జనం చూస్తూనే ఉన్నారు. మళ్లీ టికెట్టు కొనుక్కుని హాలుకెళ్లి చూస్తారా? అంత ఓపిక తీరిక ఎక్కడుంది? పైగా సినిమాలంటే అద్భుతరసం, హాస్యరసం తప్ప మరొకటి పట్టని విధంగా ఉంది ఈ మధ్యన. ఇలాంటి కరుణరసం పొంగే సినిమాలు చూసే అవసరం ఎవరికుంటుంది? ఈ ప్రశ్నలు చుట్టుముట్టినా కూడా కథలోని ఎమోషన్ ని నమ్మి తీసిన సినిమా ఇది.
ఈ ప్రశ్నలతో పాటూ ఇక్కడ మరొక పెద్ద పాయింటుంది. మరాఠీలో కథానాయకుడు స్టేజ్ ఆర్టిస్ట్. అక్కడ సంగతి ఏమోగానీ ఆ నేపథ్యం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇక్కడ బాగా సంపాదించుకుని బతికిన నటులంటే సినిమా నటులే ఉంటారు. బాగా బతికి ఆస్తులు సంపాదించిన రంగస్థల నటులు ఉన్నారో లేదో కూడా జనబాహుళ్యానికి తెలీదు. కనుక కథతో కనెక్టవడం కష్టమవుతుంది.
కథలో ఎలాగూ కొన్ని మార్పులు చేసారు కాబట్టి స్టేజ్ ఆర్టిష్టు కాకుండా సినిమా నటుడని పెట్టుంటే కథాగమనం ఎలా ఉండేదో? ఈ ప్రశ్న ఎందుకంటే చూస్తున్నంత సేపూ ప్రకాష్ రాజ్ పాత్రతో ట్రావెల్ చేయడానికి కన్విన్సింగ్ గా అనిపించదు. దానికి తోడు బ్రహ్మానందం పాత్ర కూడా. అసలీ కథ ఎప్పటిదనుకోవాలి? పోనీ ఇదేమైనా పీరియడ్ బ్యాక్డ్రాప్ అనుకుందామంటే అదీ కాదు. పూర్తి సమకాలీన చిత్రం.
అది పక్కన పెట్టి మిగతా విషయాలు చెప్పుకుందాం.
కుటుంబసభ్యుల మధ్యలో మనస్పర్ధలొచ్చాయంటే కచ్చితంగా కొంత మంది చెడ్డవాళ్లవ్వాలన్న రూలేమీ లేదు. అందరూ మంచివాళ్లే కావొచ్చు. కానీ ఒకరి అలవాట్లు ఒకరికి నచ్చకపోవడం, ఒకరి స్వేచ్ఛ మరొకరికి ఇబ్బంది కలగడం, మరీ ముఖ్యంగా ఒకరి ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా మరొకరు ఉండకపోవడం…ఇలాంటివే ఉంటాయి. ఈ కథలో ఉన్నవి కూడా అవే.
జెనెరేషన్ గ్యాప్ ని కళ్లకు కట్టినట్టు చూపించారు. కొత్తతరం ఆలోచనలతో ఉండే కోడలు, పాత తరమే గొప్పనుకునే మామగారు. వీళ్ల మధ్య నలిగే ఇతర పాత్రలు.
అయితే లీడ్ రోల్ మీద సింపతీ పెంచడానికి ఎక్కడా కూడా వృద్ధజంటని రాచిరంపాన పెట్టడం, అగౌరవంగా చూడడం వంటి సీన్లు పెట్టలేదు. అది జరిగుంటే ఎప్పుడో వచ్చిన “సంసారం ఒక చదరంగం”, “సూరిగాడు” మాదిరి సినిమాల్ని తలపిస్తుంది తప్ప కొత్తగా చూస్తున్నట్టేమీ అనిపించేది కాదు.
ఇక నటీనటుల గురించి చెప్పుకోవాలంటే ప్రకాశ్ రాజ్ అద్భుతమనిపించాడు. ఆయన తన కెరీర్ లో చేసిన కొన్ని గొప్ప పాత్రల్లో ఇదొకటి అనిపించుకుంటుంది. బాగా బతికిన వాడిగా, చితికిపోయిన వాడిగా, ఆత్మాభిమానం కలవాడిగా, దానిని చంపేసుకున్నవాడిలా..ఇలా రకరకాలుగా అభినయాన్ని వడ్డించి వార్చాడు.
ఇందులో బ్రహ్మానందం చేసిన పాత్ర ఒక సర్ప్రైజ్. మరాఠీలో విక్రం గోఖలే చేసిన పాత్రకు ఇంకొంత ఇంటెన్సిటీ కలిపి నటించాడు. కచ్చితంగా మెచ్చుకోవాల్సిన నటన. ఆయనని ఇంతవరకూ ఈ టైపు నటనలో చూడలేదు. ప్రపంచాన్ని ఎంత చూసినా, ఎన్ని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నటించినా నిజజీవితంలో ఎమోషన్, ఎక్స్పెక్టేషన్ ఉన్నవాడు నేరో మైండ్ గానే కనిపిస్తాడు, ఏడుస్తాడు, అరుస్తాడు. వివిధ సందర్భాల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పాత్రలు చేసేది అదే.
బ్రహ్మానందం అంతిమఘడియల్లో ప్రకాశ్ రాజ్ స్థితప్రజుడిగా కనిపిస్తాడు. కానీ తన అంతిమఘడియలో ఆ స్థితప్రజ్ఞత ఉండదు. ఎమోషనలైపోతాడు. అదే జీవితం.
రమ్యకృష్ణ సెకండాఫులో ఒక సీన్లో తప్ప మిగిలిన భాగమంతా శాంతమూర్తైన గృహిణిగా కనిపిస్తుంది. శివాత్మికా రాజశేఖర్ కొన్ని సీన్స్ లో మంచి పరిణతితో నటించింది. ఆమెలో చాలా వెర్సటాలిటీ ఉందనిపించింది. రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్, అనసూయ ఓకే. జయలలితది బహ్మానందం భార్యగా చిన్న పాత్ర.
ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు చాలా సహజంగా ఉంటూనే హత్తుకునేలా ఉన్నాయి.
స్కూల్లో ప్రకాశ్ రాజ్ తెలుగు భాష గురించి చెప్పే సన్నివేశం హృదయానికి హత్తుకుంటుంది.
అలాగే “టు బి ఆర్ నాట్ టు బి..” అని షేక్స్పియర్ డైలాగ్ చెబుతూ భారతీయ కవుల, కథకుల గురించి చెప్పే సన్నివేశం కూడా బాగా పండింది.
చిన్నపిల్లల చేత చేయించే అశ్లీల నాట్యాల మీద కూడా కృష్ణవంశీ తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ పాత్ర చేత సామాజిక బాధ్యతాపాఠం చెప్పించారు. ఇవన్నీ బానే ఉన్నాయి.
ఇక సంగీతం విషయానికొస్తే ప్రశాంతంగా, మనసుగా హాయిగా అనిపిసుంది. ఎక్కడా రణగొణధ్వనులు లేకుండా సందర్భోచితంగా సాగాయి పాటలన్నీ. థీం సాంగ్ లో సిరివెన్నెల సాహిత్యం చాలా అర్ధవంతంగా ఉంది. వివిధ సన్నివేశాల్లో నేపథ్యంగా బిట్ సాంగ్ లాగ వచ్చే ఆ పాట కథని నడిపిస్తూ కథానాయకుడి పరిస్థితిని వర్ణిస్తూ సాగుతుంది. ఇళయరాజా పాడిన ఆ పాట మరింత హాంటింగ్ గా అనిపిస్తుంది.
కెమెరా, ఎడిటింగ్ వగైరాలన్నీ మూలచిత్రాన్ని చూసి ఫాలో అయినట్టే ఉంది.
దర్శకుడిగా కృష్ణవంశీని తన స్టైల్ కి భిన్నంగా కరుణరసంతో కూడిన కుటుంబకథాచిత్రాన్ని తెరకెక్కించినందుకు అభినందించాలి. ఎవరో ఒకరు ఎపుడో అపుడు అప్పుడప్పుడైనా ఇలాంటి అడుగులెయ్యాలి. లేకపోతే సినిమా అనేది ఎప్పటికీ మూసలో కూరుకుపోయే ఉంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊపిరి పీల్చగలిగితే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయి.
ఇందులోని పాత్రలు మన మధ్యన ఉన్నవే. తెర మీద ఏదో ఒక పాత్రతో ప్రేక్షకుడు తనను తాను ఐడెంటిఫై చేసుకుంటే మాత్రం కంటతడి పెట్టడం ఖాయం.
బాటం లైన్: మనసుని తాకే చిత్రం!