చిత్రం: దాస్ కా ధమ్కీ
రేటింగ్: 2.25/5
తారాగణం: విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్, అక్షర గౌడ్, రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, మహేష్ ఆచంట తదితరులు
కెమెరా: దినేశ్ కె బాబు
ఎడిటింగ్: అన్వర్ ఆలి
సంగీతం: లియోన్ జేంస్
నిర్మాత: కరాటే రాజు
దర్శకత్వం: విశ్వక్ సేన్
విడుదల తేదీ: 22 మార్చ్ 2023
నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తన ట్యాలెంట్ చూపిస్తున్న విశ్వక్ సేన్ కొంత గ్యాప్ తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా తానే నటించాడు. పైగా ఇది హోం ప్రొడక్షన్. స్క్రీన్ ప్లే, డైలాగ్, దర్శకత్వం అన్నీ తానై నడిపాడు.
విషయంలోకి వెళ్తే కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఒక స్టార్ హోటల్లో వెయిటర్. అదే హోటల్లో తన తోటి రూం మేట్స్ వెయిటర్ గా ఒకరు (మహేశ్), వాలే పార్కింగులో ఒకరు (హైపర్ ఆది) పని చేస్తుంటారు. పేదరికం వల్ల పడే బాధల నుంచి బ్రేక్ తీసుకోవాలనే యావలో కృష్ణదాస్ డబ్బున్నవాడిగా బిల్డప్పివ్వాలనుకుంటాడు. పర్యవసానంగా కీర్తి (నివేతా పేతురాజ్) అతని ప్రేమలో పడుతుంది. తనని ఒక పెద్ద కంపెనీకి సీయీవోగా భావించిన ఆమె డేటింగ్ కూడా మొదలుపెడుతుంది. అసలు సీయీవో సంజయ్ (విశ్వక్ సేన్) రోడ్ యాక్సిడెంటులో చనిపోతే ఆ స్థానంలో నటించమని అడుగుతాడు సంజయ్ బాబాయ్ (రావు రమేష్). ఆ తర్వాత ఏమౌతుందనే కథ.
గతంలో వచ్చిన రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, రాముడు భీముడు, ఈ మధ్యన వచ్చిన ధమాకా, అమిగోస్..ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. ప్లాట్ పాతదైనా పర్వాలేదు. కథనం పకడ్బందీగా ఉంటే ఏ లోటు ఉండదు.
సినిమా ప్రధమార్థం చాలా సరదాగా సాగుతుంది. విశ్వక్ సేన్ మార్క్ కామెడీకి హైపర్ ఆది పంచులు, మహేశ్ టైమింగ్ తో కూడిన లైన్లు కలగలిపి రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. కానీ తనలోని అపరిచితుడైన నటుడుని పరిచయం చేసుకోవాలనే ఆతృతతో సెకండాఫులో సంజయ్ పాత్రని అవకతవకగా రాసుకోవడం జరిగింది. అప్పటి వరకు ఉన్న లైట్ హ్యూమర్ కాస్తా పోయి సీరియస్ గా, డార్క్ గా మారిపోతుంది కథనం.
ఒకే టికెట్టు మీద రెండు సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలిగి చాలా లెంగ్దీగా అనిపిస్తుంది. పైగా స్క్రీన్ ప్లేలోనూ, సీన్ కన్సీవింగ్ లోనూ చాలా లోపాలున్నాయి. మరింత కన్విన్సింగ్ గా, గ్రిప్పింగ్ గా మలచగలిగే అవకాశమున్నా ఆ పని చెయ్యలేదు. సంజయ్ పాత్ర ప్రవేశమైనప్పటి నుంచి నీరసం, చిరాకు కలుగుతాయి. ఆడియన్స్ ఈ ట్రాకప్పుడు ఫోన్లు ఓపెన్ చేయడం గమనిస్తే ఇది ఎంత నిజమో తెలుస్తుంది.
విశ్వక్ సేన్ మాత్రం డ్యుయల్ షేడ్ లో నటించి మెప్పించే ప్రయత్నం చేసాడు కానీ అతనికి కామెడీయే బెటర్ గా సెట్టవుతుందని తేలిపోయింది.
ఈ సినిమాకి ప్రధానమైన సేవింగ్ గ్రేస్ హైపర్ ఆది, మహేశ్ ఆచంట. వాళ్లిద్దరూ లేకపోతే ఈ చిత్రాన్ని భరించడం బరువయ్యేది. వీళ్ల ట్రాకుల్లోని పంచ్ డైలాగ్స్ హైపర్ ఆదీయే రాసాడా, లేక టైటిల్స్ లో పేర్కొన్నట్టు విశ్వక్సేనే రాసాడా తెలీదు. ఎవరైతేనేం…హాస్యం మాత్రం పండింది. కానీ సెకండాఫులో అంతా తేలిపోయి మళ్లీ చివర్లో కాస్త నవ్వులు విరిసాయి. ఈ కామెడీ జంటని ఇంకాస్త వాడుకుని ఉంటే బాగుండేది.
విశ్వక్ సేన్-రోహిణి మధ్యలోని ట్రాకైతే నీరసానికి పరాకాష్ట.
నివేతాపేతురాజ్ గ్లామరస్ గా ఉంది. తెరమీద తక్కువసేపే ఉన్నా తన ఉనికి బలంగా చాటుకుంది.
కొన్ని బూతు డైలాగులు కట్ చేసినట్టు, మ్యూట్ చేసినట్టు తెలిసినా విషయం అర్ధమైపోవడం వల్ల ఒక్కోసారి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టఫులో “గరిట అబయటకు తీసా..” అని విశ్వక్ సేన్ చెప్పినప్పుడు మహేశ్ ఆచంట, ఆదిల రియాక్షన్ కి డబుల్ మీనింగేంటో అర్ధమైపోతుంది. అలాగే “మీరేమో పెద్ద బ్యాట్స్ మన్ అనుకున్నాను” అని నివేతా అనడం కూడా డైరెక్ట్ మీనింగే.
సంగీతం విషయానికొస్తే “పడిపోయానే పిల్లా” బాగుంది. ఇప్పటికే అది సూపర్ హిట్. ఐటెం సాంగ్ మాత్రం అవసరం లేని చోట అడ్డుగా తగిలింది.
మిగిలిన టెక్నికల్ విభాగాలన్నీ ఓకే. ఎడిటర్ సెకండాఫులో ఇంకాస్త కత్తెర వేసుండాల్సింది.
విశ్వక్ సేన్ తనని తాను ఒక పెద్ద మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నమిది. సాదాగా మొదలై, సీరియస్ గా మారి చివరికి అయోమయమైన దారుల్లో నడిచి సీక్వెల్ ప్రకటనతో ముగుస్తుంది. “ఎ ఫిల్మ్ బై విశ్వక్ సేన్” అని వేసేసాక కొడ మరొక పది నిమిషాలు సినిమా కొనసాగి సీక్వెల్ అనౌన్స్మెంట్ అయ్యింది. ధమ్కీ ఇస్తే కంటెంటుతో సౌండ్ వినపడాలి. అది జరగలేదు.
బాటం లైన్: సౌండివ్వని ధమ్కీ