ఢిల్లీలో మీటింగులు ముగించుకుని డైరెక్టుగా కాకినాడకు రాబోతున్నట్టుగా ట్వీట్ చేశారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. అయితే ఢిల్లీలో మీటింగులు ఎప్పుడో, మీటింగులు ముగిసేదెప్పుడో చెప్పలేదు. ఆ మీటింగులు ఎవరితోనో కూడా జనసేన వాళ్లకు కూడా క్లారిటీ లేదు.
శనివారం రోజున పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పవన్ అక్కడ అధికారికంగా ఎవరితోనూ సమావేశం కాలేదు. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ ముఖ్య నేత నడ్డా తదితరులతో పవన్ కల్యాణ్ సమావేశం కాబోతున్నట్టుగా లీకులు ఇచ్చారు. అయితే ఇంత వరకూ ఆ సమావేశాలు ఏవీ జరగలేదు.
ఇక కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద జనసేన కార్యకర్తల దాడి వార్తలపై పవన్ స్పందించారు. తమ వారిపై అక్రమ కేసులు పెట్టారని పవన్ అంటున్నారు. ఈ సందర్భంగా తనదైన వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
'ఈ రోజు కాకినాడ లో జరిగిన సంఘటన కి పోలీస్ శాఖ వారు,అసలు కారకులైన వైసీపీ నాయకులని వదిలేసి , జనసేన నాయకులూ మీద అన్యాయంగా IPC సెక్షన్ 307 పెడితే, నేను ఢిల్లీ మీటింగ్ ముగించుకొని , నేరుగా కాకినాడకే వస్తాను, అక్కడే తేల్చుకుంటాము.' అంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరి చీలుస్తా, తేలుస్తా.. అనే మాటలు పవన్ కల్యాణ్ కు కొత్త కాదు. ఈ క్రమంలో కాకినాడలో పవన్ కల్యాణ్ ఏం తెలుస్తారో చూడాల్సి ఉంది.