అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ అధ్యక్షుడు దూకుడుగా వ్యవహరించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా అంటే…లేవని చెప్పలేం అని బీజేపీ వర్గీయులే చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా జగన్ మూడు రాజధానులపై ప్రకటనను రాయలసీమ, ఉత్తరాంధ్ర బీజేపీ నాయకులు స్వాగతించారు. ఇదే పార్టీ విధానమని కూడా ప్రకటించారు.
అయితే కాలం గడిచే కొద్ది బీజేపీలో రాజధానిపై భిన్న స్వరాలు వినిపించడం మొదలయ్యాయి. మూడు రాజధానులకు అనుకూలంగా అమరావతి మినహా మిగిలిన ప్రాంతాల బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కన్నా లక్ష్మినారాయణ, సుజనాచౌదరి, పురంధేశ్వరి తదితరులు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కొన్ని గంటలు మౌనవ్రతం పాటించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీలో తాను తప్ప ఇతరులెవరూ మాట్లాడినా అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలని, తనదే పార్టీ నిర్ణయమని కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. అయితే తనదే పార్టీ అభిప్రాయమని మరో బీజేపీ నేత జీవీఎల్ స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం బీజేపీ కోర్ కమిటీ సమావేశమై అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని తీర్మానించింది. అంతే కాకుండా రాజధాని కోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో కన్నా దూకుడును బీజేపీ శ్రేణులు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏడాది క్రితం తెల్లారితే వైసీపీలో చేరాల్సిన కన్నా…ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్‌తో ఆగిపోయాడు. ఆ తర్వాత ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. ఆ పదవిని నిలబెట్టుకునే క్రమంలో రాజధానిపై దూకుడు పెంచడం వెనుక అసలు రహస్యంగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇప్పటికే కన్నా పదవీ కాలం ముగిసింది. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడమా లేక కన్నానే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన పదవిని రెన్యువల్ చేసుకునేందుకు కన్నా నానాపాట్లు పడుతున్నాడు. ఇందులో భాగంగా ఆయనకు రాజధాని అంశం ఓ ఆయుధమైంది. కన్నాను మార్చడం వల్ల రాజధాని ప్రాంతంలో వ్యతిరేకత వస్తుందనే భయాన్ని అధిష్టానానికి పరోక్షంగా పంపే ప్రయత్నాలు పార్టీలోని ఓ వర్గం నుంచి జరుగుతున్నాయి.
కన్నానే కొనసాగించడం వల్ల రాజధాని అంశాన్ని బలంగా వ్యతిరేకించవచ్చనే ఎత్తుగడతోనే ఓ సామాజికవర్గానికి చెందిన నేతలు పన్నాగం పన్నారనే ప్రచారం బీజేపీలో విస్తృతంగా సాగుతోంది. ఒక వేళ కన్నానే కొనసాగిస్తే ఇతర ప్రాంతాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే కన్నా లక్ష్మినారాయణ కేవలం తాను గుంటూరు-కృష్ణా జిల్లాల బీజేపీ అధ్యక్షుడి మాదిరి మాట్లాడుతున్నారని, ఇతర ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఉత్తరాంధ్ర, రాయలసీమ బీజేపీ నేతల్లోనూ, ప్రజల్లోనూ బలమైన వ్యతిరేకత ఏర్పడుతోంది. కన్నా ఎత్తుగడ ఫలిస్తుందా లేక బీజేపీ అధిష్టానం తెలివితేటలు పైచేయి సాధిస్తాయా అనేది త్వరలోనే తేలనున్నాయి.