టార్గెట్ రాపాక.. బయటపడిన అంతర్యుద్ధం

అనుకున్నంతా అయింది. ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని పార్టీ నుంచి బైటకు పంపే ప్రయత్నాలు జనసేనలో మొదలయ్యాయి. ఇప్పటి వరకూ క్యాట్ అండ్ మౌస్ ఫైట్ లా జనసేనలో సాగిన ఈ వ్యవహారం…

అనుకున్నంతా అయింది. ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని పార్టీ నుంచి బైటకు పంపే ప్రయత్నాలు జనసేనలో మొదలయ్యాయి. ఇప్పటి వరకూ క్యాట్ అండ్ మౌస్ ఫైట్ లా జనసేనలో సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు బహిరంగం అయింది. జనసేన శతఘ్ని ట్విట్టర్ అకౌంట్ లో రాపాకని విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టారు.

నేరుగా జనసేన పార్టీ అకౌంట్ ని వాడకుండా.. ఇలా శతఘ్ని ద్వారా రాపాకను టార్గెట్ చేశారు. ఆయన రియాక్షన్ చూసి, పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీలో బడ్జెట్ ని భగవద్గీతతో పోల్చడం, ఆటో డ్రైవర్ల తరపున జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం.. ఇలా జనసైనికులకు కొన్ని విషయాల్లో రాపాక ఆగ్రహం తెప్పించారు. ఆ మధ్య ఇంగ్లిష్ మీడియానికి జైకొట్టి, తాజాగా మూడు రాజధానులకూ సై అన్నారు రాపాక.

అయితే ఇప్పటివరకూ ఎక్కడా తమ నాయకుడు పవన్ కల్యాణ్ పై ఆయన వ్యతిరేకతన చూపించిన దాఖలాలు లేవు. పవన్ కల్యాణ్ తనకేం చెప్పరని, తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న మాట వాస్తవమేనని మాత్రం చెబుతూ వచ్చారు. దీంతో వ్యవహారం గుంభనంగా సాగుతూ వచ్చింది.

ఇదంతా గతం.. ఇప్పుడు పండగ సీజన్లో రాపాక వరప్రసాద్, మంత్రి కొడాలి నానితో కలసి ఎడ్లపందాల పోటీలను ప్రారంభిస్తూ మూడు రాజధానులకు జిందాబాద్ కొట్టారు. ఇటు జనసైనికులు ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి ముందు హంగామా సృష్టించి లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ రెండిటినీ ఒకటి చేస్తూ ఎమ్మెల్యే రాపాకకు వ్యతిరేకంగా శతఘ్ని టీమ్ విరుచుకుపడింది. “మీరు ప్రాతినిధ్యం వహించే పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జనసైనికులపై వైసీపీ వారు రౌడీయిజం చేస్తుంటే కనీస్పం స్పందించే సమయం కూడా లేదా రాపాక గారూ..? పార్టీ కంటే మీకు ఎడ్ల పందాలు ఎక్కువయ్యాయా?” అంటూ పోస్టింగ్ పెట్టారు.

అంటే పరోక్షంగా రాపాకను రెచ్చగొట్టే ప్రయత్నం సొంత పార్టీ నుంచే మొదలైంది. పార్టీ వింగ్ ఇలా ఓ ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం సరికాదు, ఏదైనా ఉంటే అధికారికంగా అధినేత మాట్లాడాలి, ఆయన స్పందనను పార్టీ తరపున బైటపెట్టాలి. అలాంటిది, జనసేనకు అసెంబ్లీలో ఎంట్రీ ఇప్పించిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని ఇలా అవమానించడం సరికాదు. అందులోనూ పవన్ ఇక్కడ లేనప్పుడు పార్టీ తరపున ఇలాంటి వ్యాఖ్యానాలు బైటకొచ్చాయి.

దీంతో రాపాక వర్గీయులు కూడా నొచ్చుకున్నారని తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్, శతఘ్ని టీం ద్వారా కావాలని ఇలా చేయించి ఉంటారని అంటున్నారు. ఒక విషయం స్పష్టమవుతోంది. పొమ్మనలేక రాపాకకు పొగ పెట్టడం మొదలైంది.