ఇలాంటి వ్యాఖ్యలు స్పీకరుకు తగవు!

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచన చేస్తోంది. దీనిద్వారా అభివృద్ధి వికేంద్రీకృతమై అన్ని ప్రాంతాలూ సమానంగా ముందంజ వేస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది. అధికార పార్టీ వాళ్లందరూ ఈ వాదనకే కట్టుబడి.. మూడు రాజధానుల ప్రతిపాదనను…

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచన చేస్తోంది. దీనిద్వారా అభివృద్ధి వికేంద్రీకృతమై అన్ని ప్రాంతాలూ సమానంగా ముందంజ వేస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది. అధికార పార్టీ వాళ్లందరూ ఈ వాదనకే కట్టుబడి.. మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. విపక్ష పార్టీల వారందరూ అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనే వాదనతో ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైన పార్టీ రహిత ఉన్నత పదవిలో ఉండే స్పీకరు ఎలా మాట్లాడాలి?

దీనికి సంబంధించిన స్పష్టమైన విధినిర్దేశాలు మనకు ఉండకపోవచ్చు. కానీ.. స్పీకరు స్థానంలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా సరే.. సామాజిక వాతావరణం మరింత ప్రశాంతంగా తయారు కావడానికి, ఉద్రిక్తతలు చల్లబడడానికి తగినట్లుగా మాట్లాడితే ఆ స్థానానికి గౌరంగా ఉంటుంది. హుందాగా ఉంటుంది. కానీ.. ఆయన కూడా రెచ్చగొట్టేలా మాట్లాడితే ఎలా?

మూడు రాజధానుల వల్ల వేర్పాటు ఉద్యమాలు రాకుండా, సమాన అభివృద్ధి జరుగుతుందని స్పీకరు తమ్మినేని సీతారాం అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన విశాఖలో మాట్లాడుతూ అమరావతిలోనే అన్నీ కేంద్రీకృతమైతే.. ఉత్కళ కళింగాంధ్రప్రదేశ్ పేరుతో మరో ఉద్యమం వస్తుందని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ చివరి వ్యాఖ్య చాలా రెచ్చగొట్టేదిగా ఉంది. రాజ్యాంగబద్ధమైన స్పీకరు పదవిలో ఉండే వ్యక్తి అలా మాట్లాడడమే చిత్రంగా ఉంది. అదే నిజమైతే గనుక.. అయిదేళ్లపాటూ అమరావతే రాజధాని అని చంద్రబాబు ఊదరగొడితే ఉత్కల కళింగ ఉద్యమం ఏమైపోయినట్టు? అలాంటి ఉద్యమం రావడమే నిజమైతే.. విశాఖకు  రాజధాని తరలడం వల్ల రాయలసీమ వాసులు గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించే పరిస్థితి రావాలని ఇండైరక్టుగా రెచ్చగొట్టడం అవుతుంది కదా? అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వం ఎలాంటి ప్రగతిశీల ఆలోచనతో ఈ ఏర్పాటు చేస్తున్నదో ఆయన చెబితే బాగుంటుంది అంతే తప్ప.. చేయకపోతే ఉద్యమాలు వస్తాయి అన్నట్లుగా మాట్లాడడం సబబు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బయ్యర్లందరూ అప్పుడే మూట కట్టుకున్నారు