కేసీఆర్ ఎందుకు లాగుతున్నారు?

కేంద్రంలో భాజ‌పా ప్రభుత్వ పదవీ కాలం ఇంకా మరో రెండేళ్లు వుంది. కేంద్రం సహకారం లేకుండా ఇటు పాలన సాధ్యం కాదు. అటు ఎన్నికలు ఈదడమూ అంత సాధ్యం కాదు. ఎన్నికల వేళ భాజ‌పాతో…

కేంద్రంలో భాజ‌పా ప్రభుత్వ పదవీ కాలం ఇంకా మరో రెండేళ్లు వుంది. కేంద్రం సహకారం లేకుండా ఇటు పాలన సాధ్యం కాదు. అటు ఎన్నికలు ఈదడమూ అంత సాధ్యం కాదు. ఎన్నికల వేళ భాజ‌పాతో పోరు ఎలాగూ తప్పదు. కానీ ఇప్పటి నుంచీ తెరాస ఎందుకు భాజ‌పాతో తగాదా పెట్టుకుంటున్నట్లు? ఇదంతా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ను అడ్డుకోవడానికేనా? ఈ గేమ్ ప్లాన్ అంతా అందుకోసమేనా? ఈ ప్లాన్ లో భాజ‌పా కూడా భాగస్వామేనా? ఇలాంటి అనుమానాలు వున్నాయి. కానీ అవన్నీ ఉట్టి అనుమానాలుగానే మిగిలిపోతున్నాయి కూడా. 

ఎందుకంటే కాంగ్రెస్ ను అడ్డుకోవడానికి మరీ ఇంత భయంకరమైన గేమ్ ప్లాన్ ను ఇప్పటి నుంచీ అమలు చేయాల్సినంత సీన్ అక్కడ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి రంకెలు మినహా కాంగ్రెస్ కు వున్న సత్తా మరేమీ లేదు. మరి ఎందుకు భాజ‌పాతో మరీ ఇంతగా కయ్యం పెట్టుకుంటున్నారు కేసీఆర్. కావాలని తన మీద భాజ‌పా కాలు దువ్వేలా చేసుకుంటున్నారు? ఏదో..ఇంకేదో వుంది. కేసిఆర్ మాస్టర్ మైండ్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

దేశ వ్యాప్తంగా భాజ‌పా బలహీన పడుతోందని కేసీఆర్ ఏమైనా భవిష్యత్ దర్శనం చేస్తున్నారా? ఇప్పటి నుంచీ దాని తాను దూరం అని చాటడానికి ప్రయత్నిస్తున్నారా? తెలంగాణ వ్యాప్తంగా వున్న హిందూ ఓటు బ్యాంకు ఎలాగూ కులాల వారీగా, పార్టీల వారీగా చీలి వుంటుంది. మిగిలిన మతాల ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారా?

ఒకప్పుడు ఆంధ్ర-తెలంగాణ సెంటిమెంట్ తో కొట్టుకు వచ్చిన కేసిఆర్ ఇప్పుడు కేంద్రం-రాష్ట్రం అనే లాజిక్ ను వాడాలనుకుంటున్నారా? అన్నింటికి మించి తాను ఎప్పటికీ పోరాట వీరుడే..ఉద్యమ నాయకుడే అని గుర్తూ చేస్తూ, పోరాడేవారినే జ‌నాలు నాయకుడిగా గుర్తిస్తారనే ఆలోచన తో ఈ దిశగా పావులు కదుపుతున్నారా? 

ఇలా ప్రశ్నలు చాలానే వున్నాయి. వీటన్నింటి వెనుక కేసీఆర్ ధైర్యం..ధీమా మాత్రం ఒక్కటే. ఎంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగినా అది తెరాస ను ఓడించే రేంజ్ కు అయితే పెరగలేదన్నదే. హైదరాబాద్ పరిథిలో కావచ్చు. తెలంగాణ రూరల్ లో కావచ్చు. కేసీఆర్ మీద మరీ బలీయమైన, కక్షపూరితమైన వైఖరి ఇంకా జ‌నాల్లో బలపడలేదు. సర్వేల్లో బయటకు వస్తున్న వాస్తవం అదే. సోషల్ మీడియాలో కొంత వరకు కనిపిస్తున్నంత రేంజ్ లో ప్రభుత్వ వ్యతిరేకత లేదు. 

ఆ ధైర్యంతోనే, ఈ పోరాట పంథాను కేసీఆర్ ఎంచుకుని వుండొచ్చు. ఇది రెండు అంచెల వ్యూహం కావచ్చు. కాంగ్రెస్ ను ఎన్నికల పోరులో మూడో స్థానానికి తోసేయడం, భాజ‌పాను ఇప్పటి నుంచే ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేసుకోవడం. భాజ‌పా కూడా ఈ పోరు ను సీరియస్ గా తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడే హుటాహుటిన తరలి రావడం, ఓ పార్లమెంట్ సభ్యుడు కేవలం ఓ నిరసన నేపథ్యంలో రిమాండ్ పాలు కావడం అన్నవి అన్నీ ఈ సీరియస్ నెస్ ను స్పష్టం చేస్తున్నాయి. చూస్తుంటే ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరగేలాగే వుంది.