తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందరి అంచనాలకు మించి పాలన సాగిస్తున్నారనే సానుకూల దృక్పథాన్ని సృష్టించుకున్నారు. ప్రతి అంశంలోనే ఆయన తండ్రి కరుణానిధి కంటే మెరుగ్గా పాలన సాగిస్తున్నారనే అభిప్రాయాల్ని కలిగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను స్టాలిన్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఏపీలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ పాలన సాగిస్తున్నారనేది మెజార్టీ ప్రజానీకం విమర్శ.
ఇదే తమిళనాడు విషయానికి వస్తే స్టాలిన్‌పై రౌడీ ముద్ర, సమర్థుడు కాదనే ప్రచారాల మధ్య అరకొర మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. ఇదే జగన్ విషయానికి వస్తే తండ్రి వైఎస్సార్ మాదిరిగా ప్రజారంజక పాలన సాగిస్తారనే విశ్వాసంతో ఆయనకు భారీ సీట్లతో అధికారాన్ని కట్టబెట్టారు. తమిళనాడులో కరుణానిధి మాదిరిగా స్టాలిన్ కక్షపూరిత పాలన సాగించడం లేదు. తన ప్రత్యర్థి పార్టీ పాలనలో ప్రవేశ పెట్టిన మంచి పథకాలను ఆయన కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో జగన్ పాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని సొంత పార్టీ నేతలే అంటుండం గమనార్హం.
కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో ముంచుకొస్తున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలనే వైద్య నిపుణుల సూచనల్ని పాటింప చేయడంలో తమిళనాడు సీఎం స్టాలిన్ చూపుతున్న చొరవ స్ఫూర్తిదాయకం. చెన్నై వీధుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారి చెంతకు నేరుగా సీఎం స్టాలిన్ వెళ్లి చైతన్యం కలిగించడం ప్రశంసలు అందుకుంటోంది.
మాస్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రజలకు స్వయంగా స్టాలిన్ మాస్కులు పంచి పెట్టి అప్రమత్తం చేశారు. ఈ వీడియోని తన ట్విటర్ ఖాతాలో ఆయన షేర్ చేయడం గమనార్హం. హెడ్ క్వార్డర్స్ నుంచి క్యాంప్ ఆఫీస్‌కు వస్తున్న దారిలో మాస్కుల్లేకుండా వీధుల్లో తిరుగుతున్న వారికి, వాటిని అందజేసినట్టు స్టాలిన్ తెలిపారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు వ్యాక్సిన్ వేయించుకోవాలని, భౌతికదూరం పాటించడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తానే మాస్కు ధరించకుండా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం చూశాం. పాలకుడే అట్లా వుంటే, ఇక ప్రజలు ఎలా వుంటారో అర్థం చేసుకోవచ్చు. అందుకే స్టాలిన్ పాలనతో ఆయన మిత్రుడైన ఏపీ సీఎం జగన్ పాలనను పోల్చి మాట్లాడుకోవడం.