మీ పరువు, మీ భార్య పరువు.. మీరే తీసుకోవద్దు..!

హాయ్, హలో.. గుడ్ మార్నింగ్.. గోయింగ్ టు ముంబై, గోయింగ్ టు గోవా, గోయింగ్ టు ఊటీ.. అంటూ చాలామంది సోషల్ మీడియాలో అప్ డేట్స్ పెడుతుంటారు. ఇంటికి తిరిగొచ్చే సరికి దొంగలు దోచేసి…

హాయ్, హలో.. గుడ్ మార్నింగ్.. గోయింగ్ టు ముంబై, గోయింగ్ టు గోవా, గోయింగ్ టు ఊటీ.. అంటూ చాలామంది సోషల్ మీడియాలో అప్ డేట్స్ పెడుతుంటారు. ఇంటికి తిరిగొచ్చే సరికి దొంగలు దోచేసి ఉంటారు. దొంగ చేతికి తాళమిచ్చింది ఎవరు..? మేం ఫలానా ఊరికెళ్తున్నాం, మా ఇంట్లో ఉండటం లేదు, ఫలానా టైమ్ కి తిరిగొస్తున్నాం అంటూ అప్ డేట్స్ ఇచ్చింది ఎవరు..? మనమే. డబ్బులు తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ పరువు పోతే. అవును, మన పరువుని మనమే బజారున పెట్టుకుంటే ఎలా.

ఫేస్ బుక్ అకౌంట్లలో వ్యక్తిగత ఫొటోలు అందరికీ కనిపించకుండా లాక్ చేసుకోవచ్చు, వాట్సప్ స్టేటస్ లు కూడా కొందరికే పరిమితం చేసుకోవచ్చు. కానీ ఈ సెక్యూరిటీ ఫీచర్ ఎవరూ పాటించరు. మన ఫొటోల్ని ఎంత ఎక్కువమంది చూసి మెచ్చుకుంటే అంత ఆనందం మనకు. అందుకే ఎడా పెడా ఫొటోలు దిగి, మార్నింగ్ సెల్ఫీ, మధ్యాహ్నం సెల్ఫీ, ఈవెనింగ్ సెల్ఫీ.. మిడ్ నైట్ సెల్ఫీలంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు కొంతమంది. అలాంటివారందరికీ ఇదో హెచ్చరిక. మీ వరకు మీ సెల్ఫీలు, డీపీలు (డిస్ ప్లే పిక్చర్స్) ఉంటే పర్లేదు. మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఇందులో చేర్చితే మాత్రం ఇబ్బందులు తప్పవు.

భార్యతో కలసి ఉన్న ఫొటోని డీపీగా పెట్టారు ఓ వ్యక్తి. దాన్ని ఎవరో కాపీ చేసి మార్ఫింగ్ చేసి వేరొకరితో ఆయన భార్య ఉన్నట్టు మార్చేశారు. అది కూడా అశ్లీల భంగిమలో. ఆ మార్ఫింగ్ ఫొటో భర్తకి పంపించి బ్లాక్ మెయిల్ మొదలు పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలా, ఆ మార్ఫింగ్ ఫొటో పంపిన వ్యక్తికి భయపడి అడిగినంత డబ్బు ఇవ్వాలా..? ఆ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అయితే పరిస్థితి ఏంటి..? నిజానిజాలు దేవుడెరుగు, పరువు పోతే తిరిగి తెచ్చుకోవడం గురించి ఆలోచించండి.

భార్య ఫొటోలే కాదు, టీనేజ్ దాటిన పిల్లల ఫొటోలు డీపీగా పెట్టుకున్నా, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్ట్ చేసినా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ లో రోజుకి పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు వస్తున్నాయని చెబుతున్నారు సైబర్ పోలీసులు. వీటికి పరిష్కారం ఏంటి..? మార్ఫింగ్ ఫొటోలను పంపించినవాడు ఎవరో కనుక్కుని వాడికి శిక్ష విధించే లోపు అలాంటి వారు వైరస్ లా పుట్టుకొస్తుంటారు. ఈలోగా పరువుపోయి, బాధిత మహిళలు ఏ అఘాయిత్యానికో పాల్పడితే తప్పెవరిది..?

ప్రతి ఫొటోను పబ్లిక్ లో పెడుతున్నారు, చివరికి అవి మార్ఫింగ్ గా మారి వారి ఫోన్ కే అశ్లీల మెసేజ్ గా వస్తే తట్టుకోవడం కష్టం. అందుకే చేజేతులా పరువు తీసుకోవద్దు. హద్దుల్లో ఉండండి, జాగ్రత్తలు పాటించండి అంటున్నారు సైబర్ పోలీసులు. తాజాగా హైదరాబాద్ నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి ఇలానే బాధితుడిగా మారి లక్షన్నర పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లో ఇలాంటి కేసులు ఈమధ్య పదుల సంఖ్యలో నమోదవుతున్నాయని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ కు చెందిన ఓ ముఠా ఈ పనులు చేస్తోందని కూడా గుర్తించారు.

ఇలాంటి బెదిరింపుల్లో నూటికి 10మంది మాత్రమే బయటపడుతున్నారు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. మిగతా 90 మంది మౌనంగా బాధపడుతున్నారు, భరిస్తున్నారు. బ్లాక్ మెయిలర్లకు డబ్బులు సమర్పించుకుంటున్నారు. పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలంటే.. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం కానీ, వ్యక్తిగత ఫొటోలు కానీ షేర్ చేయొద్దని చెబుతున్నారు సైబర్ నిపుణులు.