జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో అధికార పొత్తుని కొనసాగిస్తూనే ఆ పార్టీకి మిత్రధర్మంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇది మీడియాతో సహా అంతటా అతి పెద్ద చర్చగా జరిగినా బీజేపీ మాత్రం అంతా బాగుంది. మేము ఒక్కటే అని చెప్పుకుంటూ వచ్చింది. ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పలుమార్లు విశాఖ వచ్చిన సోము వీర్రాజు కూడా బీజేపీ జనసేన పొత్తు ఉంది. మాకే జనసేన సపోర్ట్ అని నమ్మబలికారు.
తీరా ఎన్నికలకు ముందు జనసేన రిలీజ్ చేసిన ప్రకటన చూస్తే వైసీపీని ఓడించండి అని మాత్రమే ఉంది. మిత్రపక్షం అయిన బీజేపీకి ఓటేయమని ఎక్కడా అందులో లేదు. దాంతో బీజేపీ పెద్దలు ఖంగు తిన్నారు. పవన్ మచిలీపట్నంలో జరిగిన ఆవిర్భావ సభలో ముస్లిం మైనారిటీ వర్గాల జోలికి వస్తే బీజేపీతో పొత్తు తెంచుకుంటాను అని తన మనసులోని మాటను బయటపెట్టారు.
అయినా బీజేపీ నుంచి నో సౌండ్. బీజేపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఉత్తరాంధ్రాలో చేజారింది. డిపాజిట్టు సైతం గల్లంతు అయింది. ఇంత జరిగాక ఇపుడు తాపీగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన పీవీఎన్ మాధవ్ పవన్ మీద ఘాటైన విమర్శలు చేశారు.
జనసేన బీజేపీ ఎక్కడా కలసి జనం ముందు కనబడలేదని ఆయన విమర్శించారు. పొత్తు ఉందని జనాలు నమ్మాలీ అంటే కలసి వెళ్లాలి కదా అని ఆయన అన్నారు. తమతో పవన్ కళ్యాణ్ కలసిరావడం లేదని మాధవ్ ఉన్న విషయాన్ని ఎట్టకేలకు చెప్పేశారు. మరో సీక్రెట్ కూడా ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సహకరించమని తాము పవన్ని కోరామని అయినా ఆయన స్పందించలేదని ఘాటైన విమర్శ చేశారు.
కేవలం వైసీపీని ఓడించాలని చెప్పి జనసేన చేతులు దులుపుకుంది తప్ప బీజేపీని గెలిపించాలని ఎక్కడా కోరలేదని మాధవ్ అన్నారు. ఇపుడు జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఓడాక కానీ బీజేపీకి తెలిసిరాలేదని, ఇన్నాళ్ళకు జనసేనతో పొత్తు విషయంలో క్లారిటీ వచ్చిందా అని సెటైర్లు పడుతున్నాయి.
ఏపీ బీజేపీ నేతలు జనసేనకు దూరంగా ఉంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారం కోరలేదని అంతా ప్రచారం సాగింది. అయితే ఇపుడు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్పిన మాటలను బట్టి చూస్తే సహకరించమని కోరినా పవన్ స్పందించలేదు అంటే ఈ పొత్తు పుటుక్కున తెగిపోవడానికి ఎంతో దూరం లేదు అనే అంటున్నారు.