ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఈడీ విచారణ ఎదుర్కోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్‌లోకి మహిళ అనే సెంటిమెంట్‌ను మంత్రులు, బీఆర్ఎస్ నేతలు బలంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఆడబిడ్డ అని కూడా చూడకుండా, విచారణ పేరుతో గంటల తరబడి వేధించడం ఏంటని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంత్రులిద్దరూ వేర్వేరు చోట్ల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వందకోట్లు అయితే, మరి నీరవ్ మోడీ ఎన్ని కోట్లు స్కామ్‌కు పాల్పడ్డారని ఆయన నిలదీశారు. లేని ఆధారాలను చూపించి తెలంగాణ ఆడబిడ్డ అయిన కవితను వేధిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గంటల కొద్ది విచారించడం ఏంటని ఆయన మండిపడ్డారు. కనీసం ఒక ఆడబిడ్డ అనే కనికరం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ధ్వజమెత్తారు.
అదానీ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటే కేంద్రం ఏం చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. లలీత్ మోడీ, విజయ్ మాల్యా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి చేతనైతే విదేశాల్లో దాక్కున్న అవినీతిపరులును తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ కవిత మహిళ అని కూడా చూడకుండా ఈడీ అధికారులు వేధించడం సిగ్గు చేటన్నారు. ప్రధాని మోదీపై ఎదురు దాడి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఆయన అన్నారు. ఏ ఒక్క బీజేపీ నేతపైనైనా ఈడీ, సీబీఐ దాడులు జరగలేదన్నారు. మంత్రులు మల్లారెడ్డి, గంగుల కరుణాకర్‌పై ఈడీ , సీబీఐ వేధింపులకు గురి చేసిందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎదురు దాడిలో కేసీఆర్ సర్కార్ వ్యూహం మార్చింది. ఆడబిడ్డ సెంట్‌మెంట్‌ను బలంగా వినిపించడం ద్వారా కేంద్రాన్ని ఆత్మరక్షణలో పడేయాలనే ప్రయత్నాల్ని బీఆర్ఎస్ వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది. ఈ ప్రయత్నం బీఆర్ఎస్‌కు ఎంత వరకు రాజకీయ ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి.