తుంగభద్ర నీటిని వాడుకునే విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి రాయలసీమకు నష్టం కలిగించేలా వుందని రాయలసీమ మేధావుల ఫోరం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీమ సాగునీటి సమస్యలపై మొదటి నుంచి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. తాజాగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎగువ భద్రకు జాతీయ హోదా ఇవ్వడంపై అడిగిన ప్రశ్న, అలాగే కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం చూస్తే…. సీమకు నష్టమేమీ లేదనే భావన కలిగిస్తోందని రాయలసీమ మేధావుల ఫోరం పేర్కొంది.
అసలు విజయసాయిరెడ్డి ప్రశ్నలోనే అవగాహనలేమి, బలహీనత కొట్టొచ్చినట్టు కనపడుతోందని పురుషోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఎగువభద్ర ప్రాజెక్టు వల్ల కృష్ణాలో రాయలసీమ నికరజలాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేశారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్న వేశారని ఆయన తెలిపారు. ఈ ప్రశ్న ఏపీ ప్రభుత్వ ఆలోచనగానే అర్థం చేసుకోవాల్సి వుంటుందని ఆయన తెలిపారు.
బచావత్ ప్రకారం తుంగభద్ర నుంచి కృష్ణాలో కలపాల్సిన నీళ్లు 31.5 టీఎంసీలని పేర్కొన్నారు. కానీ సగటున 100 – 150 టీఎంసీలు కలుస్తున్నాయని పురుషోత్తమ్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది ఏకంగా 630 టీఎంసీలు కలిశాయని గణాంకాలు చెబుతున్నట్టు ఆయన వెల్లడించారు. తుంగభద్ర నుంచి కృష్ణాలో కలపాల్సిన నీటి కన్నా వందల టీఎంసీల నీరు కలుస్తోందని తెలిపారు. తుంగభద్ర ఎక్కువ శాతం కర్ణాటకలోనే ప్రవహిస్తోందని వివరించారు. ఈ విషయంపై గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రాన్ని ప్రశ్న అడగడం సరికాదని పురుషోత్తమ్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. గందరగోళ వ్యవహార శైలితో ఎగువభద్ర విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలా పోరాడుతుంది? అని ఆయన ప్రశ్నించారు.
రాయలసీమకు ప్రాణ సమానమైన తుంగభద్ర నీటిని వినియోగించే విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల భవిష్యత్‌లో రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కేంద్రం ఇచ్చిన సమాధానంతో అయినా ఏపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త డిమాండ్ చేశారు.
కృష్ణ నీటికి పరిమితులు ఏర్పడిన నేపథ్యంలో రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి తుంగభద్ర నీళ్లు ప్రదానం అవుతుందని ఆయన తెలిపారు. తుంగభద్ర నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు సరఫరా చేసేలా చర్యలు, ఎగువ రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టుల వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.