‘చెప్పేది శ్రీరంగ నీతులు…దూరేది దమ్మురి గుడిసెలు’ సామెత చందాన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్‌కే) ఈ ఆదివారం ‘ఇదేమి న్యాయం?’ శీర్షికతో రాసిన ‘కొత్తపలుకు’ రాతలున్నాయి. ఎందుకనో ఆయన్ను కులం తీవ్రంగా కలచివేస్తోంది. ‘నాకెందుకులే మీ ఆంధ్రోళ్ల సంగతి’ అంటాడే గానీ, ఆయన వదిలి పెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేడు.
సూర్యుని చుట్టూ పరిభ్రమించడం భూమైనా మరిచిపోతుందేమో కానీ, సీఎం జగన్ చుట్టూ ఆర్‌కే తిరగడం ఒక్క క్షణం కూడా మానేలా లేడు. ఈ వారం కూడా కులం గురించే ఆర్‌కే ఏడ్పు. ఇంకా జగన్ , జైలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, రాజధాని విషయంలో బీజేపీ ఎందుకు తొందరపడలేదనేందుకు కారణాలు, బొత్స, పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి ఆశలు, వైఎస్ భారతి, షర్మిల మధ్య విభేదాలు లాంటి ఆర్‌కే ఆశలన్నీ గతంలో రాసినట్టే ఈ వారం కూడా మరోసారి పాఠకులకు గుర్తు చేశాడు. కేంద్రంలోని బీజేపీ త్వరగా జగన్‌ను జైల్లో వేయకపోతే ఆర్‌కేనే ఏ తీహార్ జైలుకో పంపేలా ఉన్నాడు.
ఆర్‌కేకు ఇష్టమైన కులం గురించి మాట్లాడుకుందాం.
‘రాజధాని రగడను కమ్మ–రెడ్ల మధ్య పోరాటంగానే కొన్ని వర్గాల ప్రజలు పరిగణిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌కు ఈ దుస్థితి ఏమిటా? అని ఆలోచనాపరులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు’ అని రాసిన ఆర్‌కేకు ఇప్పుడు ఈ పరిస్థితులు కొత్తగా కనిపిస్తున్నాయా? గత ఐదేళ్లలో కులాల ప్రాతిపదికన పాలన సాగలేదా? కులాల ప్రాతిపదికనే కదా మీ కలాలు కదులుతున్నది.
‘మహిళలను అక్రమంగా నిర్బంధించడంతోపాటు ‘‘మీ కులం ఏమిటి?’’ అని పోలీసులు ప్రశ్నించడం అరాచకం కాక మరేమిటి? పాలకుల్లో మూర్తీభవించిన కుల విద్వేషానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది’ అని రాసిన ఆర్‌కే ఓ విషయాన్ని తెలుసుకోవాలి. సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ ఐదుగురు మేనత్త గార్లూ దళితులను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు కుల, మత వివక్ష కారణంగా పులివెందుల నియోజకవర్గంలోని స్వగ్రామం బలపనూరు నుంచి వైఎస్సార్ కుటుంబం గ్రామ బహిష్కరణకు గురైన చేదు నిజాన్ని ఆర్‌కే తెలుసుకోవడం మంచిది.
‘కులం, మతం, ప్రాంతం ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినవారు ఎందరో ఉన్నారు. ఈ మూడింటినీ ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి మాత్రమే! అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మూడింటినీ ఆయన పెంచిపోషిస్తున్నారు’
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ బీజేపీకి దగ్గరగా ఉన్నాడనే ప్రచారం ద్వారా ముస్లింల ఓట్లను వైసీపీకి దూరం చేయాలనే కుట్రలో మీ పాపం ఎంతో చెప్పగలరా ఆర్‌కే? చివరికి కన్నా లక్ష్మినారాయణపై బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టారని తమరే కాదు రాసింది? అప్పుడే ఆ విషయాలన్నీ మరిచారా? అలాగే 2014లో కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి నెరవేర్చకపోగా, ఆయన్ను ప్రశ్నించడం మానేసి; తాను కాపులను బీసీల్లో చేర్చలేనని నిజాయితీగా చెప్పిన జగన్‌పై ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత తెచ్చేందుకు ఈనాడు, మీరు కలిసి రాసిన కుట్రపూరిత రాతల గురించి ఎంత చెప్పినా తక్కువే కదా? అన్ని తప్పుడు రాతలు, పనులు మీరు చేసి, జగన్‌కు కులాన్ని ఆపాదించడం న్యాయమా సార్!
‘జగన్మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నవారు ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఒకసారి గుర్తుచేసుకోవాలి. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గానికి చెందినవారిని కూడా ప్రోత్సహించారు’
రామోజీతో పాటు మీకు యాడ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే కమ్మ సామాజికవర్గం మొత్తాన్ని ఆదరించేనట్టేనా ఆర్‌కే? అయ్యా సీఎం గారూ వారిద్దరిని ఒక కంట చూడవయ్యా స్వామి.
కులానికి సంబంధించి గత కొత్తపలుకుల్లో కూడా ఆర్‌కే రాశారు. వాటి గురించి కూడా ఈ సందర్భంగా చర్చించాల్సిన అవసరం ఉంది. గత నెల 29న ‘మాతృభాష తెలుగుకే కులాన్ని ఆపాదిస్తున్న కుసంస్కారులు రాజ్యమేలుతున్నప్పుడు.. ధర్మాన, బొత్స, తమ్మినేని వంటివారు నోరు పారేసుకోకుండా ఎలా ఉండగలరు?’ అని ఆర్‌కే పలికారు.
అలాగే నవంబర్ 17న ఏపీలో ‘రహస్య అజెండా!’ శీర్షికతో రాసిన వ్యాసంలో…
‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదం గా మారిన ‘ఇంగ్లిష్ మీడియంలోనే విద్యా బోధన’ అనే ప్రభుత్వ నిర్ణయం వెనుక కూడా మత కోణం ఉందనీ, ముఖ్యమంత్రికి రహస్య ఎజెండా ఉందనీ ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. దేశంలో క్రైస్తవమత వ్యాప్తికి మిషనరీ స్కూళ్లు ఇతోధికంగా కృషి చేసిన విషయం తెలిసిందే. పేద ప్రజలకు మేలు చేయడం కోసమని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడితే బీసీలనుకూడా క్రైస్తవ మతంలోకి సులువుగా మార్చవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు శంకిస్తున్నారు’ అని రాశారు.
అయ్యా ఆర్‌కే మాతృభాష తెలుగుకే కులాన్ని ఆపాదిస్తున్న కుసంస్కారులు రాజ్యమేలుతున్నప్పుడు అని రాశావే…మరి ఏకంగా మతాన్ని అంటగడుతూ, దాని వెనుక జగన్‌కు మతమార్పిడి అనే రహస్య అజెండా ఉందని ఆపాదిస్తున్నమీ జర్నలిజాన్ని ఏమని పిలవాలో మీరే చెబితే బాగుంటుంది. జర్నలిజంలో పాతాళం అంచులను ముద్దాడుతున్న మీ గొప్పదనాన్ని ఏమని కీర్తించాలో అర్థం కావడం లేదు. వెంకటప్ప అనే బీసీ వ్యక్తి పేరుతో వైఎస్ కుటుంబం పులివెందుల్లో ఆంగ్ల మాధ్యమం స్కూళ్లను నడుపుతూ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న విషయాన్ని మీ లాంటి కులగజ్జి ఉన్నవాళ్లు తెలుసుకుంటే మంచిది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంత కులపిచ్చి ఏమిటో? అని తెలంగాణకు చెందిన ప్రముఖులు కూడా ఈసడించుకుంటున్నారని రాయడం బాగానే ఉంది. ప్రతి వారం కులప్రస్తావన లేనిదే అక్షరం ముందుకు సాగించలేని మీదే కులపిచ్చి అని అంటే కాదనగలరా?
స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా ఆయన పేర్కొన్న రెండు సూక్తులు చెప్పి ముగిస్తాను.
‘రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు’
‘నీ వెనుకేముంది…ముందేముంది…అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం’ అని కొన్ని దశాబ్దాల క్రితం చెప్పిన మంచి మాటలు ఆయన్ను ఇప్పటికీ సజీవంగా నిలిపాయి. రోజుకు ఒక్కసారి కాకపోయినా కనీసం వారానికి ఒక్కసారి కొత్తపలుకు రాసే ముందైనా మీతో మీరు మాట్లాడుకుంటే మంచిది. అలా మాట్లాడుకుంటే నిత్యం ‘దమ్మురి గుడిసెల్లో’ దూరే మీరు ఇలాంటి ‘శ్రీరంగనీతులు’ రాసే అవకాశం ఉండదు.