మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త ‘చందాల’ బాబు అయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రాజధాని రైతులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రాజధాని నిలుపుకునేందుకు చేపట్టే ఉద్యమ ఖర్చుల నిమిత్తం చంద్రబాబు విరాళాల సేకరణ మొదలు పెట్టారు.
రాజధాని రైతుల ఉద్యమానికి చంద్రబాబు భార్య భువనేశ్వరి తన వంతుగా రెండు బంగారు గాజులు ఇచ్చారు. చంద్రబాబు తన వంతు విరాళం కింద రూ.లక్ష అందజేశారు. టీడీపీ నేతలు, పారిశ్రామికవేత్తలు, బాబు సామాజికవర్గానికి చెందిన నేతలు ఎక్కువగా విరాళాలు అందజేస్తున్నారు.
బందరు, రాజమహేంద్రవరం, తిరుపతిలలో ఆయన విరాళాలు సేకరించారు. తిరుపతిలో శనివారం బాబు జోలె పట్టడంతో దాదాపు రూ.3 లక్షల విరాళం వచ్చింది. ఈ సందర్భంగా ఆ మొత్తాన్ని అందరి సమక్షంలో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధికి ‘చందాల’ బాబు అందజేశారు. బాబు మాట్లాడుతూ నాడు రాజధాని నిర్మాణానికి రూ.57 కోట్లు విరాళాల రూపంలో సేకరించానన్నారు.
విరాళాల కోసం పిలుపు
తాను జోలె పట్టి విరాళాలు సేకరించడంతో పాటు బ్యాంక్ అకౌంట్‌కు నేరుగా డబ్బు పంపాలని బాబు తిరుపతి వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన సప్తగిరి గ్రామీణ బ్యాంకు, విజయవాడ, అమరావతి పరిరక్షణ సమితి పేరుపై విరాళాలు పంపాలని అభ్యర్థించారు. విరాళాలు పంపాల్సిన బ్యాంకు ఖాతా నెంబర్: 50031331229ను మూడుసార్లు చెప్పారు. మొత్తానికి చంద్రబాబు ఎన్నెన్ని అవతారాలు ఎత్తుతారో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.