రాపాక మరోసారి రివర్స్ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు పడడం లేదనే ఊహాగానాలు చాన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి మరింత ఊతమిచ్చేలా మరోసారి వ్యవహరించారు రాపాక. ఓ వైపు రాజధాని అంశంపై పవన్ కల్యాణ్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేస్తే.. దానికి డుమ్మా కొట్టారు రాపాక. అలా అని సైలెంట్ గా కూర్చోలేదు, ఏకంగా గుడివాడలో ఎడ్ల పందాలకు వెళ్లారు.
ఎడ్ల పందాలు ఎప్పుడూ చూడలేదని అందుకే వచ్చానని చెప్పిన రాపాక, మరోసారి జగన్ నిర్ణయాల్ని సమర్థిస్తూ మాట్లాడారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనన్న రాపాక.. రాజధాని రైతులు ఇలా ధర్నాలు చేసే కంటే ఓసారి వెళ్లి జగన్ ను కలిస్తే సమస్య ఈజీగా పరిష్కారమైపోతుందని వ్యాఖ్యానించారు.
“ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తానని అసెంబ్లీలోనే చెప్పాను. ఇంగ్లిష్ మీడియంకు మద్దతిచ్చాను. ఇప్పుడు మూడు రాజధానులకు కూడా మద్దతిస్తున్నాను. రాజధాని ఒకే చోట ఉంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి కాబట్టి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. అది రాష్ట్రానికి చాలా మంచిది.”
పార్టీ నాయకుడితో (పవన్) చర్చించేంత సీన్ లేదని.. ఆయన అభిప్రాయం ఆయన చెబితే, తన అభిప్రాయం తాను చెబుతానంటున్నారు రాపాక. ఏ విషయంపై పవన్ తనను ఏమీ అడగరని, తను కూడా ఏదీ చెప్పనని అన్నారు రాపాక. ఏదైనా ఓపెన్ గా చెప్పే హక్కు తనకుందన్నారు.
“జగన్ రైతుల గురించే ఆలోచిస్తున్నారు. రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్ముతున్నారు. అలా కాకుండా డైరక్ట్ గా సీఎం దగ్గరకెళ్లి కష్టాలు చెప్పుకుంటే, తప్పనిసరిగా ముఖ్యమంత్రి న్యాయం చేస్తారు. రోడ్డు మీద అల్లర్లు చేసే కంటే సీఎంను కలిస్తే బెటర్.“
రాపాక వ్యవహారశైలితో మరోసారి పవన్ కు ఆయనకు మధ్య అభిప్రాయబేధాలున్నాయనే విషయం స్పష్టమైంది. తనకు పార్టీ చెప్పేదేం లేదని, ఒకవేళ చెప్పినా తను చేసేదేం ఉండదని కాస్త విస్పష్టంగానే చెప్పేశారు రాపాక