ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటికే ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోవడం, ఎదురుదెబ్బలు తినడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో బీజేపీకి ఢిల్లీలో మరో పరీక్ష ఎదురుకాబోతూ ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ రాణించగల అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలు ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే కొలువు దీరుతుందని అంచనా వేస్తూ ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు ఆప్ చేతిలో బీజేపీ ఓడిపోతే దానికి అది పెద్ద అవమానమే అవుతుంది. బీజేపీ హవా ఏమున్నా కేంద్రంలో మాత్రమే, రాష్ట్రాల్లో బీజేపీకి తిరస్కరణలు తప్పవనే అభిప్రాయాలు మరింతగా బలపడతాయి. ఆ పరిస్థితి ఏర్పడకూడదంటే..ఢిల్లీలో బీజేపీ నెగ్గాలి. అయితే అదంత తేలికగా కనిపించడం లేదు.
ఈ క్రమంలో బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఆప్ స్పందిస్తూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి లేడంటూ ఆప్ సెటైర్ వేసింది. దేశ రాజధానిలో కమలం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకోలేకపోతూ ఉంది. మోడీనే తమ ఆయుధం అని బీజేపీ వాళ్లు అంటున్నారు. అలా మోడీ ఇమేజ్ మీదే కమలం ఆధారపడుతూ ఉంది. ఈ విషయాన్ని ఆప్ వెక్కిరిస్తూ ఉంది.
ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీద ఎవరిని బరిలోకి దించుతారంటూ.. బీజేపీకి మరో ప్రశ్నను సంధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ విషయంలో వ్యంగ్యంగా ఫొటోను ఆప్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు చేసింది. ఇదంతా చూస్తుంటే.. ఆప్ విజయం పట్ల విశ్వాసంగానే కనిపిస్తున్నట్టుగా ఉంది.