బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ స్మృతి ఇరానీ…కారణాలేంటి?

కేంద్ర మంత్రి స్కృతి ఇరానీ బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌. ఎక్కడ? ఢిల్లీలో. దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈమధ్య దేశంలోని కొన్ని రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ…

కేంద్ర మంత్రి స్కృతి ఇరానీ బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌. ఎక్కడ? ఢిల్లీలో. దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈమధ్య దేశంలోని కొన్ని రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో గెలిచి రెండోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ (ఎన్‌డీఏ అనుకోండి) ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్రాల్లో క్రమంగా బీజేపీ ప్రాభవం తగ్గిపోతూ వచ్చింది. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఏదోవిధంగా కాంగ్రెసు నిలదొక్కుకుంటోంది. 

ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఢిల్లీ ఎన్నికలు ప్రకటించగానే అక్కడ బీజేపీ గెలవడం సాధ్యం కాదని, మరోసారి కేజ్రీవాల్‌ ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కొన్ని సర్వేలు కోడై కూశాయి. దీంతో బీజేపీ ఈ ఎన్నికలను ఇజ్జత్‌గా సవాల్‌ అన్నట్లుగా తీసుకుంది. అందులోనూ కొంతకాలంగా బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉధృతంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. జేఎన్‌యూ అట్టుడికిపోతోంది. హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇందుకు కారణం పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), ఎన్‌పిఆర్‌ (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌), ఎన్‌ఆర్‌సి (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌). 

ఈ మూడింటికీ దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఉద్యమాలకు నియలమైన జేఎన్‌యూలో భీకరంగా ఆందోళన జరుగుతోంది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని అక్కడి జాతీయ మీడియా అంచనా వేస్తోంది. రాజకీయ విశ్లేషకులూ ఇదే మాట చెబుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు చాలామంది ప్రచారం చేస్తారనుకోండి. కాని కేంద్ర మంత్రి స్కృతి ఇరానీని ఎక్కువ ప్రచార సభల్లో మాట్లాడించాలని, ఆమెను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఫోకస్‌ చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు నాయకులు కొన్ని కారణాలు చెప్పారు. 

ఓ సీనియర్‌ నాయకుడు చెప్పినదాని ప్రకారం….స్మృతి ఇరానీ కేబినెట్‌ మంత్రుల్లో యంగెస్ట్‌. అంటే వయసురీత్యా చిన్నవారు. ఆమెకున్న ప్లస్‌ పాయింట్‌ గ్లామర్‌. ప్రజలను ఆకట్టుకునే రూపం ఆమె సొంతం. ఆమె ప్రజలకు ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చే మహిళ. ఆమె ప్రసంగాలు ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి. ప్రతిపక్షాలపై విరుచుకుపడే సత్తా ఉన్న నాయకురాలు. ఆమె ఉపన్యాసాలు వింటే చాలు పార్టీ కార్యకర్తలు ఫుల్లుగా చార్జవుతారు. ఇక మరో నాయకుడు చెప్పినదాని ప్రకారం…స్మృతి ఇరానీ ఢిల్లీలో పుట్టి పెరిగారు. అక్కడే  చదువుకున్నారు. ఆమె తండ్రి పంజాబీ. తల్లి బెంగాలీ. ఢిల్లీలో సహజంగానే పంజాబీలు ఎక్కువ. స్మృతి మొదటిసారి లోక్‌సభకు ఎన్నికైంది  ఢిల్లీ నుంచే. 2004లో నగరంలోని చాందినీ చౌక్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

ఢిలీల్లో ఆమెకు అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్తల బృందం ఉంది. ఈ కారణాలన్నీ ఆమెకు ప్లస్‌ పాయింట్లు. కాబట్టి ఆమెను పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా డిసైడ్‌ చేసింది. జనవరి నాలుగున ఢిల్లీలో 'మేరీ ఢిల్లీ-మేరా సుజావ్‌' ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇరానీయే ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల్లో స్మృతీ ఇరానీ అమేథీలో రాహుల్‌ గాంధీని ఓడించినప్పటినుంచి పార్టీలో ఆమె ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది. కొంతకాలం కిందట జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్లోనూ స్మృతి స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారం చేశారు. ఢిల్లీలోనూ చాలామంది బీజేపీ అభ్యర్థులు ఇరానీయే ప్రచారం చేయాలని కోరుకున్నారు.