దేశంలో సంచలనం రేపిన నిర్భయ అత్యాచార దోషులకు త్వరలోనే శిక్ష అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఏడేళ్ల నుంచి నిర్భయ హంతకులను తీహార్ జైల్లో పోషిస్తూ ఉన్నారు. వారిలో ఒకడు మైనర్ పేరిట బయటకు వచ్చాడు. ఇక మరొకడు జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన వాళ్లు మాత్రం జైల్లో కండలు పెంచుతూ ఉన్నారు. సినిమా హీరోలు తెచ్చుకున్నట్టుగా సిక్స్ ప్యాక్ బాడీలు పెంచి వాళ్లు జైలుకు, కోర్టుకు తిరుగుతూ ఉన్నారు.
ఈ క్రమంలో ఇటీవల వారి విషయంలో సర్వత్రా ఒత్తిడి పెరిగింది. హైదరాబాద్ దిశపై దారుణం జరిగిన నేపథ్యంలో నిర్భయ హంతకులకు ఇంకా శిక్ష అమలు చేయకపోవడం అనేక విమర్శలకు దారి తీసింది. దీంతో పోలీసులు మళ్లీ కదిలారు. కోర్టులు విచారణ వేగం చేశాయి. ఇటీవలే వారి ఉరి శిక్షకు సంబంధించి జడ్జిమెంట్ ఖరారు అయ్యింది. అయితే ఇంకా సమీక్షను కోరుతూ ఉన్నారు నిర్భయ హంతకులు.
అయితే ఈ నెలలోనే వారికి శిక్షను అమలు చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఉరి తీసేందుకు తలారి కూడా రెడీ అయ్యాడట. అతడి పేరు పవన్ జలాద్ అని తెలుస్తోంది. వారి ఉరి శిక్షను అమలు చేస్తామంటూ అనేక మంది ప్రభుత్వాన్ని కోరారు. అయితే చివరకు పవన్ ను అందుకు ఎంపిక చేశారు. నాలుగు ఉరిశిక్షలను అమలు చేసినందుకు గానూ పవన్ కు లక్ష రూపాయల మొత్తం అందబోతోందట. ఆ లక్ష రూపాయల మొత్తాన్ని తను తన కూతురి వివాహానికి వాడుకోబోతున్నట్టుగా పవన్ చెప్పారు.