నిర్మాత రాధాకృష్ణ దగ్గర ఏదైనా పని, త్రివిక్రమ్ ప్రమేయం లేకుండా జరుగుతుందా? మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ తో సినిమా అన్నప్పుడు దానిపై త్రివిక్రమ్ ప్రభావం లేకుండా ఉంటుందా? కచ్చితంగా త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పవన్ కల్యాణ్ హీరోగా సినిమా ప్రకటించిన వెంటనే అంతా త్రివిక్రమ్ వైపు చూశారు.
నిజానికి పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో సినిమా చేస్తున్నప్పుడు ఆటోమేటిగ్గా హారిక-హాసిని సంస్థ రంగంలోకి దిగాలి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అనేది మీడియం రేంజ్ బడ్జెట్ లో, ఆ స్థాయి హీరోలతో సినిమాలు తీసేందుకు పెట్టిన సంస్థ. అలాంటి బ్యానర్ పై పవన్ ఓ సినిమా ఒప్పుకున్నాడంటే, త్రివిక్రమ్ ప్రమేయం లేకుండా జరిగే పని కాదు.
ఇలా ప్రాజెక్టు సెట్ అవ్వడంలోనే కాదు, క్రియాశీలకంగా కూడా ఈ ప్రాజెక్టులోకి త్రివిక్రమ్ ను తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయ్యప్పనుమ్ కోషియమ్ అనే సినిమాకు రీమేక్ గా రాబోతున్న ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు రాస్తాడనే ప్రచారం ఊపందుకుంది.
అదే కనుక నిజమైతే, మొన్నటివరకు ఈ ప్రాజెక్టు కోసం తెరవెనక పనిచేసిన త్రివిక్రమ్.. ఇకపై అఫీషియల్ గా తెరపైకొచ్చినట్టే.
ప్రస్తుతం త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నాడు. ఈ టైమ్ దాటితే, నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో అతడు బిజీ అయిపోతాడు. సో.. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ కనుసన్నల్లో ఈ రీమేక్ ను లాగించేయాలనేది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే వకీల్ సాబ్ షూట్ ముగిసిన వెంటనే ఈ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొస్తారట.
పవన్ సినిమాకు ఇలా వర్క్ చేయడం త్రివిక్రమ్ కు కొత్తేంకాదు. ఇంతకుముందు పవన్ నటించిన తీన్ మార్ సినిమాకు డైలాగ్స్ రాసింది త్రివిక్రమే. అది కూడా రీమేక్ సినిమానే కావడం గమనార్హం.